అంబేద్కర్ విగ్రహానికి నిప్పు వెనక నిజాలు !
పక్కనున్న రేకుల షెడ్డుకు నిప్పు వల్లే ఈ ప్రమాదం ?
రాజకీయ లబ్ధికి ఒక వర్గం వాడుకుంటుందా ?
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన సంచలనంగా మారింది. వైసిపి టిడిపి నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధిస్తున్నారు. పోలీసులు నిజాలు వెలికితీసి నిందితులను పట్టుకునే ప్రయతం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలోచిత్తూరు జిల్లా, జి డి నెల్లూరు నియోజక వర్గం, వెదురుకుప్పం మండలం దేవళంపేటలో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టడం సంచలనంగా మారింది. ఉదయమే మాజీ ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, వైసిపి నియోజక వర్గం ఇంచార్జి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనివెనక టిడిపి నాయకుడు సతీష్ నాయుడు మరి కొందరి హస్తం ఉందని ఆరోపించారు. స్థానిక సర్పంచ్ గోవిందయ్య అనుచరులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నిందితుడిని పట్టుకోవాలంటూ నగరి డీఎస్పీ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. తరువాత టిడిపి మండల కమిటీ అధ్యక్షుడు లోకనాథ రెడ్డి, మాజీ అధ్యక్షుడు మోహన్ మురళీ ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పార్టీతో సంబంధం లేకుండా నిందితులను పట్టుకోవాలని డిమాండ చేశారు. వీరు పరోక్షంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మీద అనుమానం వ్యక్తం చేశారు. మండల కమిటీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఒక నాయకుడు, అతని అనుచరులపై కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.కాగా టిడిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ మునిచంద్రా రెడ్డి, వైసిపి నాయకుడు డాక్టర్ అనగంటి హరికృష్ణ వేరు వేరు ప్రకటనల్లో ఈ దుర్ఘటనను ఖండించారు. దీనిపై సిఎం చంద్రబాబు పోలీసు అధికారులను ఆరా తీశారు. జాతీయ నాయకుల విగ్రహాలకు నష్టం కలుగకుండా చూడాలని సూచించారు. సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని ఆదేశించారు. అయితే రంగంలోకి దిగి పక్కనున్న రేకుల షెడ్డుకు ఎవరో పెట్టిన నిప్పు వల్లే ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు తెలిపారు.ఎవరూ విద్వేషాలు రెచ్చ గొట్టవద్దని కోరారు. కాగా మధ్యాహ్నం ఘటనా స్థలానికి చేరుకున్న జి డి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ మాట్లాడుతూ నారాయణ స్వామి అనుచరుడు, స్థానిక సర్పంచ్ గోవిందయ్య నిప్పు పెట్టారని ఆరోపించారు. రాత్రి రెండు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడితే వీడియో ఎలా తీశారని ప్రశ్నించారు. నారాయణ స్వామి గ్రామాలలో కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నారని చెప్పారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ మోహన్ మాట్లాడుతూ అగ్ర వర్ణాలు, దళితుల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశ్యంతో నారాయణ స్వామి కుట్ర పన్నారని ఆరోపించారు. షెడ్డుకు నిప్పు పెడితే ఒక పక్క ఉన్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎలాంటి హాని జరగకుండా అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఎలా అంటున్నాడని ప్రశ్నించారు. కాగా విగ్రహం పక్కన చిన్న దుకాణం పెట్టుకున్న ఓ మహిళతో సంబంధం ఉన్న వ్యక్తులలో ఒకరు ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని స్థానికులు కొందరు అంటున్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా ఈ దుర్ఘటన విషయంలో జిల్లాకు చెందిన అగ్రకుల ఎమ్మెల్యేలు, నాయకులు స్పందించక పోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం ఇద్దరు టిడిపి దళిత ఎమ్మెల్యేలు, దళితుడైన మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి తప్ప మిగిలిన నేతలు స్పందించక పోవడం గమనార్హం.

