31, అక్టోబర్ 2025, శుక్రవారం

మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష

చిత్తూరు కోర్టు సంచలన తీర్పు – రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం

బాధిత కుటుంబంలో హర్షాతిరేకం – న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరిగింది

చిత్తూరు, అక్టోబర్‌ 31 (ఆంధ్రప్రభ బ్యూరో):
రాష్ట్రాన్ని ఒక దశాబ్దం క్రితం కుదిపేసిన చిత్తూరు మాజీ మేయర్‌ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ దంపతుల హత్య కేసులో చిత్తూరు జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించారు. ఈ కేసు విచారణలో సాక్ష్యాధారాలు, పోలీసు దర్యాప్తు నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన అనంతరం కోర్టు తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి తీర్పు చదివిన క్షణం కోర్టు మందిరం నిశ్శబ్దంగా మారింది. నిందితులు తలదించుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై, అనురాధ,  మోహన్ ఆత్మకు న్యాయం దక్కింది అంటూ స్పందించారు. ఈ కేసులో చిత్తూరు కన్నయ్యనాయుడు కాలనీ, చిత్తూరు చెందిన శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ అనే చింటూ (49), ఎం. వెంకటేశ్‌ అనే గంగనపల్లి వెంకటేశ్‌ (49), కొట్టేవల్ల జయప్రకాశ్‌ రెడ్డి అనే జయ (33), గంగవరం మండలం మారేడుపల్లికి చెందిన తోటి మంజునాథ్‌ అనే మంజు (37), కర్ణాటక రాష్ట్రము కోలార్ జిల్లా ముల్బాగల్‌ కు చెందిన వేంకటాచలపతి అనే ముల్బాగల్‌ వెంకటేష్‌ అలియాస్ రేజర్‌ వెంకటేష్‌ (61)లకు కోర్టు ఉరి శిక్షను విధించింది.

2015 నవంబర్‌ 17 ఉదయం 11 గంటలకు చిత్తూరు మునిసిపల్‌ కార్యాలయంలో ఈ భయానక ఘటన జరిగింది. అప్పటి మేయర్‌ కటారి అనురాధ తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశమవుతుండగా, ఆమె భర్త మోహన్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ సమయంలో బుర్ఖాలు ధరించిన ఐదుగురు వ్యక్తులు మహిళల వేషంలో కార్యాలయంలోకి ప్రవేశించి, తుపాకులు, వేటకొడవళ్ళతో దాడి చేశారు. చింటూ తన పిస్టల్‌తో మేయర్‌పై కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త మోహన్‌పై కత్తులతో దాడి చేసి చంపేశారు. దాడిలో పాల్గొన్న నిందితులు కార్యాలయం వెనుక గోడ దాటి పారిపోయారు. రక్తపాతం మధ్యన చిత్తూరు మునిసిపల్‌ కార్యాలయం సాక్షిగా నిలిచింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.




పోలీసుల అత్యంత పకడ్బందీ దర్యాప్తు

అప్పటి జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పర్యవేక్షణలో చిత్తూరు సబ్‌-డివిజనల్‌ డీఎస్పీ ఎం. లక్ష్మీనాయుడు, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. నిరంజన్‌కుమార్ దర్యాప్తును శాస్త్రీయంగా చేపట్టారు. మొత్తం 69 మంది సాక్షులను విచారించి, 59 మంది సాక్ష్యాలను నమోదు చేశారు. ప్రధాన నిందితుడు చింటూ స్వయంగా లొంగిపోయి కుట్ర వివరాలను కోర్టులో వెల్లడించాడు. దర్యాప్తు సందర్భంగా పోలీసు బృందం వాడిన సాంకేతిక ఆధారాలు, కాల్‌ డేటా రికార్డులు, ఆయుధాల విశ్లేషణ ఇవన్నీ నేరాన్ని నిర్ధారించడంలో కీలకమయ్యాయి. తీర్పులో భాగంగా జడ్జి శ్రీనివాసరావు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన కొందరిపై షోకాజు నోటీసులు జారీ చేయాలని సూచించారు.న్యాయ వ్యవస్థను మోసం చేయాలనుకునే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.


నగరంలో భద్రతా చర్యలు

తీర్పు వెలువడనున్న నేపథ్యంలో చిత్తూరు పట్టణంలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ముఖ్య చౌరస్తాలు, కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సున్నితమైన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత (మేయర్‌ అనురాధ మేనకోడలు) మాట్లాడుతూ దశాబ్దం తర్వాత న్యాయం లభించింది. నా మామ మోహన్‌, అత్త అనురాధ ఆత్మలకు శాంతి లభించింది. కోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి మైలురాయని అన్నారు.


నేరస్తుల్లో భయం – న్యాయవ్యవస్థపై గౌరవం

ఉరిశిక్ష తీర్పు వెలువడగానే మిగతా నేరస్తుల్లో భయాందోళన నెలకొంది. చిత్తూరు జిల్లా పోలీసులు న్యాయం సాధించిన తీర్పు పట్ల ప్రజల ప్రశంసలు అందుకున్నారు. పోలీసుల పకడ్బందీ దర్యాప్తు, కోర్టు కఠిన తీర్పు న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దశాబ్ద కాలంగా సాగిన ఈ హత్య కేసు తీర్పు చిత్తూరు జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. పోలీసు శాఖ కృషి, న్యాయవ్యవస్థ నిబద్ధతకు ఈ తీర్పు నిదర్శనం. న్యాయం ఆలస్యమైనా అందిందన్న నమ్మకం ఇప్పుడు చిత్తూరు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *