17, అక్టోబర్ 2025, శుక్రవారం

ఒకే రోజు నరక చతుర్దశి, దీపావళి జరుపుకోవాలా ?!


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

భారతీయులకు అతి పెద్ద పండుగ దీపావళి. పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయే సరదాల దీపావళి పండుగ అతి త్వరలోనే రానుంది. అయితే ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలన్న విషయంలో కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? అన్నది సందేహంగా మారింది. సాధారణంగా దీపావళి పండుగను ఉత్తర భారత దేశంలో  ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి (లక్ష్మీ పూజ), గోవర్ధన పూజ, భాయిదూజ్ ముఖ్యమైనవి. మన జిల్లాలో మాత్రం రెండు రోజుల పండుగ. అయితే ఈసారి నరక చతుర్దశి, దీపావళి తేదీల విషయంలో పండుగ ప్రియులలో సందిగ్ధత నెలకొంది. కొందరు అక్టోబర్ 19న ఆదివారం నరక చతుర్దశి, అక్టోబర్ 20న సోమవారం దీపావళి అని భావిస్తుండగా, మరికొందరు రెండు పండుగలు అక్టోబర్ 20, సోమవారం రోజే జరుపుకోవాలని సూచిస్తున్నారు.

హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ రోజున లక్ష్మీదేవి పూజ జరుపుకోవడం ఆనవాయితీ. తెలుగు పంచాంగం ప్రకారం దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు. దృక్ పంచాంగం మరియు ఇతర ప్రముఖ పంచాంగాల ప్రకారం 2025 దీపావళికి సంబంధించిన తిథి వివరాలు  ఇవ్వబడ్డాయి.  ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి (నరక చతుర్దశి): అక్టోబర్ 19, ఆదివారం మధ్యాహ్నం 01:51 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 20, సోమవారం మధ్యాహ్నం 03:44 గంటల వరకు ఉంటుంది.  ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి (దీపావళి): అక్టోబర్ 20, సోమవారం మధ్యాహ్నం 03:44 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21, మంగళవారం ఉదయం 05:54 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా అమావాస్య రాత్రి సమయంలో ఉన్నప్పుడే దీపావళి పండుగ (లక్ష్మీ పూజ) జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే అక్టోబర్ 20, సోమవారం రాత్రికి అమావాస్య తిథి ఉండటం వలన, ఆ రోజే దీపావళి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
* రెండు పండుగలు ఒకే రోజు!*
హిందూ సంప్రదాయం ప్రకారం, నరక చతుర్దశిని సూర్యోదయానికి ముందు అభ్యంజన స్నానం  ఆచరించడం ద్వారా జరుపుకుంటారు. చతుర్దశి తిథి అక్టోబర్ 20, సోమవారం మధ్యాహ్నం 03:44 గంటల వరకు ఉంది. అందుకే ఈ రోజున సూర్యోదయానికి ముందు నరక చతుర్దశి పండుగను జరుపుకోవాలి. సాయంత్రం వేళ అమావాస్య తిథి ప్రవేశిస్తుంది కాబట్టి అదే రోజున దీపావళి (లక్ష్మీ పూజ) పండుగను జరుపుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో 2025లో నరక చతుర్దశి మరియు దీపావళి పండుగలు ఒకే రోజైన అక్టోబర్ 20, సోమవారం నాడు రావడం ఒక అరుదైన విషయమని పండితులు చెబుతున్నారు. దీపావళి అమావాస్య సాయంత్రం ప్రతిఒక్కరు లక్ష్మీపూజ తప్పనిసరిగా చేస్తారు.  దృక్ పంచాంగం ప్రకారం, లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం: అక్టోబర్ 20, సోమవారం సాయంత్రం 07:08 గంటల నుంచి 08:18 గంటల వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెబుతున్నారు.
 *దీపాలు ఎప్పుడు వెలిగించాలి*
దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేయడానికి ముందే దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది.  సాయంత్రం శుచిగా తలస్నానం చేసి, ముందుగా దేవుని వద్ద దీపం వెలిగించాలి.  ఆ తరువాత తులసికోట వద్ద దీపాన్ని ఉంచాలి.  తరువాత ఇంటిముందు చక్కని రంగవల్లికలు వేయాలి.  ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా శుభానికి ప్రతీక అయిన స్వస్తిక్ గుర్తులు వేసి వాటిపై దీపాలను ఉంచాలి. అప్పుడే లక్ష్మీదేవిని మనం ఆహ్వానం పలికినట్లు అర్ధం.  ఇలా ఇల్లంతా దీపాలను అలంకరించిన తర్వాత లక్ష్మీపూజను యధావిధిగా చేసుకోవాలి. ఈ అరుదైన పండుగ దినాన ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుందాం.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *