జిల్లాకు తప్పిన తుఫాను ముప్పు
మూడు రోజులపాటు నిరాటకంగా పనిచేసిన జిల్లా యంత్రాంగం
జిల్లా మండల అధికారులను సమన్వయం చేసిన జిల్లా కలెక్టర్
తుఫాను ప్రత్యేక అధికారి గిరీషా జిల్లాలో పర్యటన
కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో కాల్ సెంటర్లో ఏర్పాటు
ముప్పు తప్పడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా యంత్రాంగం, ప్రజలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
మెంథా తుఫాను ముప్పు చిత్తూరు జిల్లాకు తప్పింది. తొలుత ఈ తుఫాను ప్రభావం భారీగా ఉంటుందని అంచనా వేశారు. చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ కలర్ అలర్ట్ జారీ చేశారు. ఐఏఎస్ అధికారి గిరీషాను ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన రెండు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించి జిల్లా, మండల ఆధికారులను అప్రమత్తం చేశారు. చెరువులను, కుంటలను, జలాశయాలను పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 24 గంటల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, మండల కార్యాలయాల్లో కాల్ సెంటర్ లను ఏర్పాటు చేశారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్, వైర్ లెస్ కాన్ఫరెన్స్ ద్వారా నిత్యము జిల్లా, మండలాధికారులతో సమన్వయం చేసుకున్నారు. గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బందిని కూడా రాత్రిపూట అక్కడే బస చేయాలని ఆదేశించారు. మండల అధికారులు కూడా వారి ప్రధాన కేంద్రాలలోని బస చేశారు. గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. తుఫాను కారణంగా విద్యుత్ శాఖ అధికారులను ప్రత్యేకంగా అప్రమత్తం చేసి, ఎప్పటికప్పుడు విద్యుత్ అంతరాయాలను సరిచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యల కారణంగా 24 గంటల పాటు జిల్లా, మండలాలు అప్రమత్తంగా మూడు రోజులపాటు పనిచేశారు. ఊహించిన విధంగా ఈ తుఫాను అంత నష్టాన్ని కలిగించకపోవడం జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
చిత్తూరులో కురిసిన భారీ వర్షాలు తుఫాను కారణంగా 191 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయి. వరి పంట 175 హెక్టార్లలో ,వేలిశెనగ పంట 15 ఎకరాలలో దెబ్బతిన్నాయి. 83 మండలాలకు చెందిన 334 మంది రైతులు నష్టపోయారు. గంగాధర నెల్లూరు, సోమల, తవణంపల్లి, వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం, పూతలపట్టు, పెనుమూరు, యాదమరి, గుడిపాల, సదం బంగారు పాల్యం, ఐరాల, పాలసముద్రం మండలాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. పంట నష్టం వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో 15.6 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. వీటిని నష్టం 29. 6 లక్షల రూపాయలుగా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో బొప్పాయి 3.6 హెక్టార్లలో, పూల తోటలు 2.8, యాక్టర్లలో టమాటో 6.4, హెక్టార్లలో కాలీఫ్లవర్ రెండు హెక్టార్లలో దెబ్బతిన్నట్లు నివేదికలో తెలిపారు. వీటి కారణంగా 6 మండలాల్లోని 28 మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. సదం, చౌడేపల్లి, సోమల, పుంగనూరు, గంగవరం, చిత్తూరు మండలాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.
జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్లకు భారీగా నష్టం జరిగింది ఐదు నియోజకవర్గాల్లో 9 మండలాల్లో 15 రోడ్లు దెబ్బతిన్నాయి. 33 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతినగా, 15చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఇందులో 10 కల్వర్టులను తాత్కాలికంగా మరమ్మతు చేశారు. జిల్లాలో 591 మీటర్ల రోడ్ల దెబ్బతినగా, ఇప్పటివరకు 191 మీటర్ల రోడ్డును తాత్కాలికంగా మరమత్తు చేశారు. రోడ్లు, కల్వర్టులు పునరుద్ధరించడానికి 30.42 కోట్ల రూపాయలు అవసరమని రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. తాత్కాలిక మరమ్మత్తులకు 34.85 కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు.
ఈనెల 22, 23 తేదీల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడడంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం జరిగింది. జిల్లాలో 33 సింగల్ ఫేస్ ట్రాన్స్ఫర్లు, మరో 33 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. ఆరు కిలోమీటర్ల మేర కండక్టర్ ధ్వంసం, కాగా మూడు కిలోమీటర్ల మీద కేబుల్ పాడయింది. జిల్లాలో 63 పోల్స్ నేల వాలాయి. ఇప్పటికే చాలావరకు వీటిని పునరుద్ధరించడం జరిగిందనీ ట్రాన్స్ కో సూపరిండెంట్ ఇంజనీర్ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. చిత్తూరు జిల్లా నుంచి విశాఖపట్నం, కాకినాడ, మన్యం జిల్లాలకు 204 మంది విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తరలి వెళ్లారు. అక్కడ ఏర్పడిన విద్యుత్ అంతరాయాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వీరిని పిలిపించింది.
గంగ 2 జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
గంగ 3 ఎస్ఆర్ పురం మండలంలో వరి పంట నష్టాన్ని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ

