భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలో 74 చెరువులకు గండ్లు
జిల్లాలో పూర్తిగా నిండిన 1,434 చెరువులు
జిల్లాలో 120 హెక్టార్లలో పంటల నష్టం
తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు
జిల్లాలో సగటు వర్షపాతం వర్షపాతం 6.9 మి.మీ.
విజయపురం మండలంలో అత్యధికంగా 26 మిల్లీమీటర్లు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
చిత్తూరు జిల్లాలో ఇటీవల పడిన భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో జిల్లాలో 74 చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లాలో 1,434 చెరువులు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయి. 120 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. తుఫాన్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన గిరీష మంగళవారం చిత్తూరు మున్సిపాలిటీలో, కార్వేటినగరం మండలంలో పర్యటించారు కార్వేటి నగరంలోని కృష్ణాపురం డ్యామ్ ను పరిశీలించారు.
మెందా తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో మంగళవారం పలు మండలాల్లో వర్షపాతం నమోదయింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బులతో కమ్ముకొని కొన్ని ప్రాంతాల్లో చినుకులు, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 6.9 మిల్లీమీటర్లుగా నమోదయింది.
జిల్లాలో అత్యధికంగా విజయపురం మండలంలో 26.0 మి.మీ., నిండ్రలో 25.6 మి.మీ., నగరిలో 22.6 మి.మీ., కార్వేటినగరం 12.8 మి.మీ., ఐరాలలో 11.6 మి.మీ., వెదురుకుప్పంలో 9.2 మి.మీ., పులిచెర్లలో 9.8 మి.మీ., శ్రీరంగరాజపురంలో 9.0 మి.మీ., వెంకటగిరికోటలో 9.0 మి.మీ. వర్షం పడింది.మరోవైపు గుడిపల్లె, చౌడేపల్లె మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. కుప్పం, రామకుప్పం, బంగారుపాలెం, యాదమరి, గూడిపాల, పాలసముద్రం, చిత్తూరు రూరల్, తవనంపల్లె, గంగవరం, సదం, పెనుమూరు, పుతలపట్టు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 32 మండలాల్లో వర్షపాతం నమోదవగా, పశ్చిమ ప్రాంతాలతో పోలిస్తే తూర్పు మండలాల్లో కొంత ఎక్కువ వర్షం పడింది. వాతావరణ శాఖ ప్రకారం తుపాన్ ప్రభావం కొనసాగుతున్నందున రానున్న 24 గంటల్లో కూడా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
*74 చెరువులకు గండ్లు*
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో 74 చెరువులకు గండ్లు పడ్డాయి. గరిష్టంగా పులిచెర్ల మండలంలో పది చెరువులకు గండ్లు పడ్డాయి. ఐరాల మండలంలో 9 చెరువులకు, పెద్దపంజాణీలో ఏడు చెరువులకు, గంగవరం మండలంలో ఆరు చెరువులకు, పలమనేరు, గుడిపాల మండలాల్లో ఐదు చెరువులకు, నగిరి మండలంలో నాలుగు చెరువులకు, బైరెడ్డిపల్లి, కార్వేటినగరం, నిండ్ర, పెనుమూరు, రొంపిచర్ల మండలంలో మూడు చెరువులకు, విజయపురం, పుంగనూరు మండలంలో రెండు చెరువులకు, బంగారు పాల్యం, పూతలపట్ల ఒక్కొక్క చెరువు వంతున గండ్లు పడ్డాయి. కార్వేటినగరం మండలంలో ఏడు చెరువులకు గండ్లు పడగా, కృష్ణాపురం డ్యాం మూడు చోట్ల దెబ్బతింది.
*పూర్తిగా నిండిన 1,434 చెరువులు*
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో 1,434 చెరువులు పూర్తిగా నిండాయి. జలకళను సంతరించుకున్నాయి. నిండుకుండను తలపిస్తున్నాయి. తుఫాను కారణంగా భారీగా వర్షాలు పడితే ఈ చెరువులు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చెరువుల పరిరక్షణలో నిమగ్నమయ్యారు. జిల్లాలు 717 చెరువులు 75 శాతం నిండాయి. 1032 చెరువులు 50 శాతం నిండగా, 549 చెరువులు 25 శాతం నిండాయి. 390 చెరువులకు మాత్రం 25 శాతం కంటే తక్కువ నీళ్లు వచ్చాయి. తుఫాను కారణంగా ఈ చెరువులో కూడా నిండుతాయని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.
*120 హెక్టార్లలో పంట నష్టం*
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో 12 మండలాల్లో 120 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట 117.2 హెక్టార్లలో, వేరుశనగ 3.13 హెక్టార్లలో దెబ్బతింది. 71 గ్రామాలలోని 247 మంది రైతులు పంటలు నష్టపోయారు. యాదమరి, గుడిపాల, తవణంపల్లి, పెనుమూరు, బంగారుపాల్యం, పూతలపట్టు, ఐరాల, వెదురుకుప్పం, సోమల, ఎస్ఆర్ పురం, గంగాధర నెల్లూరు, పాలసముద్రం మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులకు నివేదికలు అందాయి. పంట నష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

