అంబేద్కర్ విగ్రహానికి నిప్పు వెనుక అసలు నిందితులు ఎవరు ?
విగ్రహం పక్కన ఉన్న కొట్టుకు ఎవరు, ఎందుకు నిప్పు పెట్టారు?
ఆ మంటలను ఎవరు అంబేద్కర్ విగ్రహం వైపు మళ్ళించారు?
సమాధానాలు దొరకని ప్రశ్నలు ఎన్నో ఎన్నెన్నో!
ముందుకు సాగని పోలీసుల విచారణ, దొరకని నిందితులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక వర్గం దేవళంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి వారం రోజులకు పైగా అవుతుంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే రోజు అక్కడ కాలిన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని స్థాపించారు. టిడిపి ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కార్యక్రమాన్ని కూడా రూపొందించి, అమలు చేసింది. శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత స్వయంగా దేవళంపేట వచ్చి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కేసు విషయంలో పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఈ కేసును తప్పుదారి పట్టించాలని ప్రయత్నించినందుకు స్థానిక సర్పంచ్ గోవిందయ్యను మాత్రం పోలీసుల అరెస్టు చేశారు. అయితే, అసలు అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న కొట్టుకు నిప్పు ఎలా అంటుకుంది? ఎవరు నిప్పు అంటీం చారు. అలా ఎందుకు చేయాల్చి వచ్చింది ? అన్న విషయాలు ఇప్పటివరకు తేలలేదు. అలాగే కొట్టుకు అంటుకున్న నిప్పును అంబేద్కర్ విగ్రహం వైపు మళ్ళించి, కాలిపోయే విధంగా కొందరు ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలా ఎవరు చేశారో ఇప్పటివరకు పోలీసులు విచారణలో తేలలేదు. ఈ వ్యవహారంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయి.
శనివారం హోమ్ మంత్రి అనితతో పాటు పలువురు నేతలు దేవళంపేట సందర్శించారు. నిప్పు పెట్టిన వ్యక్తి ఎవరో ఆమె కూడా చెప్పలేక పోయారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారమే ఆమె మాట్లాడారు. ఈ వ్యవహారంలో బొమ్మేపల్లి సర్పంచ్ గోవిందయ్య తప్పుడు సమాచారం ప్రచారం చేసి టిడిపి నేత సతీష్ నాయుడును ఇరికించాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ నెల మూడవ తేదీ ఒక మహిళ కొబ్బరి ఆకుల పందిరికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు. పొరపాటుగా అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా కాలిందని చెప్పారు. అయితే గోవిందయ్య కక్ష సాధించాలన్న ఉద్దేశ్యంతో టిడిపి నేత సతీష్ నాయుడు అగ్గి పెట్టారని ప్రచారం చేశారని అంటున్నారు. ఆయన కుల, మత విద్వేషాలు రెచ్చ గొట్టాలని కుట్ర పన్నారని కేసు పెట్టి అరవ తేదీ రిమాండ్ కు పంపారు. అయితే నిప్పు పెట్టిన రోజు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఆయన కుమార్తె వైసిపి ఇంచార్జి కృపాలక్ష్మీ తదితరులు విగ్రహం వద్ద ధర్నా చేశారు. నారాయణ స్వామి మాట్లాడుతూ సతీష్ నాయుడు, బిసి నేత కిషన్ చంద్ విగ్రహానికి నిప్పు పెట్టారని ఆరోపించారు. గోవిందయ్య చెప్పిన మాటలే నారాయణ స్వామి కూడా చెప్పినప్పటికీ ఆయన మీద కేసు పెట్టక పోవడం గమనార్హం. అలాగే టిడిపి మాజీ మండల కమిటీ అధ్యక్షుడు మోహన్ మురళీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన కూడా పరోక్షంగా సతీష్ నాయుడు, కిషన్ చంద్ పై గురి పెట్టారు. టిడిపి లోని ఒక వర్గం నేతలు గోవిందయ్య , నారాయణ స్వామిని ప్రభావితం చేసి సతీష్ నాయుడు, కిషన్ చంద్ ను కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినట్టు మరో వర్గం ఆరోపిస్తోంది. అయితే అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తే దేవళంపేటకు చెందిన ఇద్దరు టిడిపి నాయకుల ప్రమేయం బయటపడే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. ఈ నేపధ్యంలో టిడిపి అగ్రర నేతలు కలుగ చేసుకుని కేవలం గోవిందయ్య మీద కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం దేవాలంపేటలో పర్యటించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్, మడకశిర ఎం ఎస్ రాజు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ , పార్లమెంటు అధ్యక్షుడు సి అర్ రాజన్ వైసిపి నేతలను విమర్శించడంపై దృష్టి పెట్టారు తప్ప, అసలు నిందితుడిని గూర్చి మాట్లాడలేదు. ఈ నేపధ్యంలో నిప్పే లేకుండా పొగ ఎలా వచ్చిందో అర్ధం కాలేదని కొందరు అంటున్నారు. అసలు నిందితులను వదిలేసి దళిత సర్పంచ్ గోవిందయ్యను కేసులో ఇరికించాలని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.
గంగ 1 అంబేద్కర్ విగ్రహం (ఫైల్ ఫోటో)

