విజయాలను ప్రసాదించే విజయదశమి
నేడే విజయదశమి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఈ పవిత్ర సమయంలో సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయ దశమి ఆశ్వయుజ పాడ్యమి రోజున ప్రారంభమై శరన్నవరాత్రులు దశమితో ముగుస్తాయి. దసరా అనేది దశహరా అనే పదం నుంచి వచ్చింది. దశహరా అంటే దశ విధ పాపహరం అని అర్థం. దసరా పండుగ రోజు ఎక్కడేక్కడే ఉన్న వారందరూ సొంతింటికి వచ్చి బంధుమిత్రులతో కలిసి వేడుక జరుపుకుంటారు. దసరా అంటే.. మహిషాసురుడు అనే రాక్షసుడు లోకకంఠకుడుగా మారి ముల్లోకాలలో స్వైర విహారం చేశాడు. తట్టుకోలేని దేవతలు మహిషాసురుడిని సంహరించాలని జగన్మాతను కోరారు. దేవతల కోరిక మేరకు జగన్మాత తొమ్మిది రోజులపాటు మహిషాసురునితో యుద్ధం చేసి పదవ రోజున రాక్షసున్ని సంహరించగా రాక్షసపీడ విరగడైనందుకు గుర్తుగా దసరాగా జరుపుకుంటారు. విజయదశమి నాడు పూజలందుకునే శమీ (జమ్మి) వృక్షానికి సంబంధించిన పురాణ గాధ ఒకటి ఉంది. పూర్వం ప్రజాపతి అగ్నిని సృష్టించాడు. అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాపతినే కాల్చివేయసాగింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజాపతి అగ్నిని శమింపచేసేందుకు పచ్చని చెట్టును సృష్టించి దాని కొమ్మలతో కొట్టి అగ్నిని ఆర్పివేశాడు. అగ్నిని శమింప చేసేందుకు ఉపయోగించిన వృక్షమే శమీ వృక్షం. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు ఏడాది అజ్ఞాతవాసం పూర్తికాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొంది, శమీవృక్ష రూపంలోని అపరాజితా దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించినారు. శమీ వృక్షం వద్దకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకుని ప్రదక్షిణలు చేసి ఆకు తీసుకు వచ్చి పెద్దలకు పాదాభినందనం చేసి ఆశ్వీరాదం పొందడం ఆచారం. రాముడు విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి, రావణుని సహరించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం పాలపిట్ట ను చూసే సంప్రదాయం ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి, శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ అనే ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి. మిత్రుల ఆలింగనాలు, పరస్పర శుభాకాంక్షల మధ్య దసరా సాయంత్రం వేళ అనుబంధాలు, ఆప్యాయతల్లో మునిగితేలుతాం. శమీ వృక్షాన్ని దర్శించి పూజించడంతో విజయాలు లభిస్తాయని నమ్మకం. ప్రస్తుతం ఆయుధాలకు బదులు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన వస్తువుల్ని, యంత్రాల్ని పూజిస్తున్నారు. వాహన పూజలు జరుపుతుంటారు. కొత్త వ్యాపారాలు, పనులు, దుకాణాలు విజయదశమి నాడు ప్రారంభిస్తే మంచిదని భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడడం మన ప్రాంతంలో ఆచారంగా వస్తుంది. పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందన్న నమ్మకంతో పాలపిట్టను వెతుక్కుంటూ మరీ వెళ్లి చూసేందుకు ఆతృత పడుతుంటారు. రాముడు రావణున్ని వధించిన రోజు కూడా ఆశ్వయుజ దశమేనని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు దేవికి పూజ చేసి ఆశీర్వాదం పొంది రాముడు యుద్ధంలో రావణున్ని వధించి విజయం సాధిస్తాడు. దీనికి గుర్తుగా మన దగ్గర కూడా రావణదహనం కార్యక్రమాలను నిర్వహిస్తుం టారు. ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో దసరా రోజున రావణ దహనం చేస్తారు. దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దేనదానవులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే విజయదశమిగా పేర్కొన్నారు. ఈ దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకూ సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయ దశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభ సుచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై విజయానికి గుర్తు. ఇదే దసరా రోజున రావణాసురుణ్ని అంతమొందించి శ్రీరాముడు ఘన విజయం సాధించాడు. అలాగే రాక్షసుల రాజు మహిషాసురిడిని నేల కూల్చి కాళికా మాత ఘన విజయం సాధించింది. ఇలాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం దక్కినట్లే. అందుకే పండుగ నాడు పాలపిట్టను చూడడం అదృష్టంగా భావిస్తారు.

