29, అక్టోబర్ 2025, బుధవారం

ఆంధ్రప్రభ వార్తకు స్పందన

ప్రైవేటు వ్యక్తి నుంచి ఆరు షాపింగ్ గదుల స్వాధీనం 

ఆ గదులకు బహిరంగ వేలం నిర్వహించిన అధికారులు 

పంచాయతీకి ఏడాదికి రూ.2.26 లక్షల ఆదాయం



చిత్తూరు, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ బ్యూరో) : ఆంధ్రప్రభ వరుస కథనాలతో పెనుమూరు పంచాయతీకి ఏడాదికి రూ. 4.26 లక్షల ఆదాయం సమకూరింది. ఆరు గదులను 18 ఏళ్లు తర్వాత పంచాయతీ వారు స్వాధీనం చేసుకుని, సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రైవేట్ వ్యక్తి అధినంలో షాపింగ్ గదులు అనే వార్తను ఆంధ్రప్రభ ప్రచురించింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ స్పందించి, ఆ గదులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా పెనుమూరు పంచాయతీ కార్యదర్శి ప్రభు కిరణ్ఆ దేశించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి ప్రైవేట్ వ్యక్తికి నోటీసులు జారీ చేసి, పంచాయతీకి చెందిన ఆరు గదులను స్వాధీనం చేసుకున్నారు. ఆ గదులను రెండు రోజుల కిందట బహిరంగ వేలం వేయడం జరిగింది. గతంలో మూడు గదులకు నామమాత్రపు అద్దెను చెల్లిస్తుండగా బహిరంగ వేలం ద్వారా పెనుమూరు గ్రామపంచాయతీకి సంవత్సరానికి 4.26 లక్షల రూపాయల ఆదాయం లభించమంది.


2007లో అప్పటి ఎంపి రామకృష్ణా రెడ్డి కేటాయించిన నిధులతో సంత గేటు ప్రాంగణంలో స్థానిక నాయకుడు ఆరు గదులను  నిర్మించారు. ఇందులో మూడింటికి స్లాబ్ వేయగా, మూడు గదులకు రేకులు కప్పారు.అయితే అందులో మూడింటిని బినామీ పేర్లతో పంచాయతీ నుంచి నామమాత్రపు ధరకు పొంది అధిక బాడుగకు ఇచ్చారు. మిగిలిన మూడింటిని తన స్వాధీనంలో పెట్టుకుని బాడుగ వసూలు చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యవహారంపై ఆంధ్రప్రభ కథనాలకు స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ ఆదేశాల ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకుని వేలం పెట్టారు. అయితే  గ్రామస్తులను ప్రాధేయ పడి అందులో ఉన్న వారే వేలంలో దక్కించుకున్నారు. ఇందులో స్లాబ్ వేసిన మూడు గదులను ఒక్కొక్కటి ఏడాదికి రూ 71,688 చొప్పున చెంగల్రాయ నాయుడు, లక్ష్మీ, మునస్వామి శెట్టి పాడుకున్నారు. దీని ప్రకారం రూ 2,15,064 ఆదాయం సమకూరింది. రేకులు కప్పిన మూడు గదులను ఒక్కో దానికి ఏడాదికి రూ 70,452 చొప్పున సుధారాణి, ఖాదర్ షరీఫ్, సుబ్రమణ్యం పడుకున్నారు. ముగ్గురి ద్వారా ఏడాదికి రూ 2,11,365 ఆదాయం వస్తుంది. మూడేళ్లకు జరిగిన ఈ వేలంలో ఏడాదికి ఐదు శాతం నగదు పెరుగుతుందని డిప్యూటీ ఎంపీడీఓ డిల్లీ బాబు, పంచాయతీ కార్యదర్శి ప్రభుకిరణ్ తెలిపారు. కాగా గత 18 సంవత్సరాలుగా ఆక్రమణలో ఉంచుకుని పంచాయతీకి ఎగ్గొట్టిన సొమ్ము లెక్క గట్టి వసూలు చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారని తెలిసింది. అవసరం అయితే సివిల్, క్రిమినల్ కేసులు  పెడతామని ఒక అధికారి తెలిపారు. కాగా బస్టాండు కాంప్లెక్ లోని 22 గదులకు ఆరు నెలల క్రితం అధికారులు వేలం నిర్వహించారు. ఒక వర్గం వారు దౌర్జన్యం చేసి ఏక పక్షంగా పాడుకున్నారని మరొక వర్గం హై కోర్టులో స్టే తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య సత్వర పరిష్కారం కోసం అధికార చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




18 సంవత్సరాలుగా పట్టించుకోని పంచాయితీ అధికారులు 

వారపు సంత స్థలంలో, ఎంపి నిధులతో నిర్మాణం 

మూడు గదులను గ్రామ పంచాయాతికి స్వాదీనం

మరో మూడు గదులు తానే బాడుగకు ఇచ్చుకుంటున్న వైనం 

గ్రామపంచాయితికి రూ. కోటి వరకు నష్టం 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వానిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను  ఒక ప్రైవేటు వ్యక్తి తన ఆధీనంలో పెట్టుకొని అద్దెలు  వసూలు చేసుకుంటున్న సంఘటన పెనుమూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. స్థానిక పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు కుమ్మక్కై గత 18 సంవత్సరాలుగా ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదని తెలుస్తుంది. ఒక ప్రైవేటు వ్యక్తికి  ఆయాచిత లబ్ధికి తన తోడ్పాటును అందిస్తున్నారు. ఇందుకు తగిన ప్రతిఫలం ప్రభుత్వ అధికారులు కూడా పొందుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక కూటమి నేతతో, పంచాయితీ అధికారులు కుమ్మక్క కావడంతో పెనుమూరు గ్రామపంచాయతీకి నెలకు సగటున 50 నుండి 75 వేల రూపాయలు నష్టం కలుగుతోంది. ఈ షాపులను స్వాధీనం చేసుకొని బహిరంగ వేలం వేసి ఉంటే సుమారుగా 75 వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం గ్రామ పంచాయితీకి వేచ్చేదని  స్థానికులు చెబుతున్నారు. నెలకు అధమంగా  50 వేల రూపాయలు అనుకున్న 18 నెలల కాలానికి గ్రామ పంచయతీకి సుమారుగా కోటి రూపాయల నష్టం వాటిల్లింది. ఆ షాపులను తన ఆధీనంలో పెట్టుకొని ఆ నాయకుడికి ఇప్పటి వరకు కోటి రూపాయల వరకు లబ్ధి పొందినట్లు తెలుస్తుంది. ఇందులో పంచాయతీ అధికారులకు కూడా వాటా ఉదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పెనుమూరు పంచాయతీ అవినీతి అవకతవకలకు నిలయంగా మారింది. ఇటీవల జరిగిన బస్టాండు వాణిజ్య సముదాయం గదుల వేలం కూడా వివాదాస్పదంగా మారింది. వేలంలో పాల్గొనడానికి దిడిలు కట్టిన వారందరిని అనుమతించక, రౌడిలతో బెదిరించి, నామమాత్రమైన ధరకు వేలం పడుకున్నారని హై కోర్టును ఆశ్రయించారు. తక్కువ ధరకు కూటమి పార్టీలు, వైసిపి నాయకులు పడుకోవడంతో గ్రామ పంచాయితీకి భారీగా నష్టం వచ్చిందని తెలిపారు.  వ్యవహారంపై హై కోర్టు స్టే విధించిన విషయం తెలిసింది. అక్కడ తవ్వే కొద్దీ పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పంచాయతీ స్థలంలో, ప్రభుత్వ నిధులతో కట్టిన ఆరు గదులు ప్రైవేటు వ్యక్తి స్వాధీనంలో ఉన్నాయని తెలిసింది. 2007 లో అప్పటి చిత్తూరు ఎంపి రామకృష్ణా రెడ్డి ( టిడిపి) నిధులతో పంచాయతీ వారపు సంత స్థలంలో ఆరు గదులు కట్టారు. గదుల నిర్మాణం బాధ్యత స్థానిక టిడిపి నేతకు ఇచ్చారు. గదుల నిర్మాణం పూర్తయిన తరువాత ఆ నేత  మూడు గదులను పంచాయతీకి స్వాధీనం చేసి వేలం వేయించారు. బినామీ పేర్లతో ఒక్కో గదిని రూ.1, 500 చొప్పున పాడుకుని ఎక్కువ ధరకు బయటి వారికి ఇచ్చారు. మిగిలిన మూడు గదులను పంచాయతీకి స్వాధీనం చేయకుండా, వాటి  బాడుగ తానే తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో గదికి నెలకు రూ 12,000 వసూలు చేసుకుంటున్నారు. అంటే పంచాయతీకి స్వాధీనం చేసిన మూడు గదుల నుంచి ఒక్కో దానికి రూ 10,500 చొప్పున రూ 31,500 వసూలు చేసుకుంటున్నారు. మిగిలిన మూడు గదులకు రూ. 36,000 కలిపి మొత్తం నెలకు రూ  67,500 తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఆయన గదులు అక్రమంగా స్వాదీనం చేసుకున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తరువాత 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2014లో టిడిపి, 2019లో వైసిపి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ 18 ఏళ్లలో నలుగురు ఐదుగురు పంచాయతీ కార్యదర్శులు మారారు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా ఈ అవినీతిన్ని పట్టించుకున్న నాధుడే లేదని ప్రజలు అంటున్నారు. మండలంలో కీలక టిడిపి నేత ఆయన ఆయన అధికారులను ప్రలోభ పరచి, ప్రత్యర్ధులతో చీకటి ఒప్పందాలు చేసుకుని చలామణి అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ కార్యదర్శి వివరణ 

వారపు సంత  స్థలంలో ఎంపీ నిధులతో ఆరు షాపింగ్ గదులను నిర్మించిన విషయం వాస్తవమేనని పెనుమూరు పంచాయతీ కార్యదర్శి ప్రభు కిరణ్ కుమార్ తెలిపారు. ఇందులో మూడు షాపింగ్ గదులను గ్రామపంచాయతీకి స్వాధీనం చేశారని, మరో మూడు గదులు ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ వ్యవహారం చాలా కాలంగా జరుగుతొందన్నారు. షాపింగ్  గదుల నిర్మాణానికి కొంత బిల్లులు పెండింగ్ ఉండడం కారణంగా మూడు గదులను ఆ నేత తమకు స్వాధీనం చేయలేదన్నారు. పూర్తి వివరాలతో జిల్లా పంచాయతీ అధికారికి నివేదిస్తున్నామని, వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి ప్రభు కిరణ్ కుమార్ తెలిపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *