చిత్తూరు జిల్లాలో ప్రశ్నార్థకంగా మహిళల భద్రత
మరోవైపు ఫారెస్ట్ అధికారులమంటూ మైనర్‌పై అత్యాచారం
రక్షణ కోసం పోలీసులను ఆశ్రవిస్తే మత్తుమందిచ్చి అత్యాచారం
వరస సంఘటనలతో ప్రజల్లో భయాందోళనలు
*ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు*
మహిళల రక్షణ పేరుతో ఎన్నో చట్టాలు, కఠిన నిబంధనలు ఉన్నా చిత్తూరు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు మహిళల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మురకంబట్టు, చిత్తూరు పట్టణం, బంగారుపాళ్యం ప్రాంతాల్లో కొద్ది వారాల వ్యవధిలోనే జరిగిన మూడు ఘటనలు జిల్లా ప్రజల్లో ఆందోళన, భయాన్ని పెంచాయి. ఒకడు ప్రేమజంటను భయపెట్టి నగలు, నగదు కాచేస్తాడు. మరొకొందరు తాము అటవీశాఖ అధికారులమంటూ ప్రేమ జంటను బెదిరించి మైనర్ బాలిక మీదనే సామూహికంగా అత్యాచారం చేస్తారు. రక్షించండి దొరా అంటూ ఒక మహిళా పోలీసు స్టేషన్ కు వెళ్తే, రక్షణ కల్పించాల్చిన పోలీసు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేస్తాడు. వరసగా జరుగుతున్న సంఘటనలతో మహిళల గోప్యత, గౌరవం, భద్రత మీద ప్రమాదంలో పడ్డాయని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నారు.
గత నెల 25న చిత్తూరు పట్టణంలోని మురకంబట్టు నగరవనం పార్క్‌లో ప్రేమజంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. మొదట వారిని బెదిరించి, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత బాలికపై పాశవికంగా అత్యాచారం చేశారు. బాధిత యువకుడు 29న చిత్తూరు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తాలూకా ఎస్.ఐ. మల్లికార్జున కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద, అలాగే ఎస్సీ, ఎస్టీ హింసా చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. నిందితులు మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్‌లను అరెస్ట్ చేశారు. వీరు గతంలోనూ నేర చరిత్ర కలిగినవారేనని, ప్రేమజంటలను టార్గెట్ చేసి వీడియోలు తీసి బెదిరించి డబ్బులు దోచుకోవడం, మహిళలను వేధించడం వీరి నేర స్వభావమని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన చిత్తూరులోని యువతలో భయాందోళన కలిగించింది. పార్కుల వంటి ప్రదేశాల్లో భద్రత లేకపోవడం, పహారా బలహీనత, సీసీ కెమెరాల లేమి వంటి అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి.
*చిత్తూరు పట్టణంలో ప్రేమజంటలపై దాడులు*
ఇటీవల చిత్తూరు పట్టణంలోని జనసంచారం తక్కువగా పివికెఎన్ డిగ్రీ కాలేజీ వెనుక ఉన్న అడవి ప్రాంతంలో ప్రేమజంటలను బెదిరించి నగలు, డబ్బులు దోచుకునే సంఘటనలు పెరిగాయి. ఈ కేసుల్లో ఒకదానిలో వన్ టౌన్ పోలీసులు అకీల్ అనే దుండగుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1.20 లక్షల విలువైన బంగారు నగలు, రూ.80 వేల విలువైన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అతను ప్రేమజంటలను కత్తితో బెదిరించి డబ్బులు దోచుకునే నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ పోలీసుల దృష్టికి రాని సంఘటనలు చాలా జరిగినట్లు తెలుస్తుంది. దొంగకు తేలు కుట్టినట్లు చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడి మిన్నకున్నట్లు సమాచారం.
*కాపాడాల్చిన పోలీసే కాటు వేస్తే ...*
ఒకవైపు దుండగులు మహిళలను టార్గెట్ చేస్తుంటే, మరోవైపు పోలీసుల చేతుల్లోనే మహిళలు బాధపడటం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు జిల్లాలో మరొక కలవరపరిచే సంఘటన బంగారుపాళ్యం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పలమనేరు మండలం గంటవూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ షబ్రిన్ తన భర్త వేధింపులపై మూడు సంవత్సరాల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పలమనేరు స్టేషన్‌లో పనిచేస్తున్న హోం గార్డ్ కిరణ్ ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అనుచితంగా వేధించాడని, తర్వాత ఆమెకు న్యాయం చేస్తానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఇటీవలి నెలల్లో ఆ మహిళ మానసికంగా దిగులుకు గురై మొగిలి దేవరకొండకు వెళ్లింది. అక్కడ ఇద్దరు పోలీసులు వచ్చి ఆమెను ప్రశ్నించి, తమ ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆ నంబర్‌కు ఫోన్ చేయగానే పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఉమాశంకర్ వచ్చి, పానీయంలో మత్తుమందు కలిపి తాగించి, అత్యాచారం చేశాడని షబ్రిన్ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసు సిబ్బంది చేతుల్లోనే మహిళ వేధింపులకు గురవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీసు శాఖపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసింది. రక్షకుడే రాక్షసుడైతే ప్రజలు ఎవరిని నమ్మాలి? అని సామాజిక సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
*నిఘా పెంచాలని మహిళా సంఘాల డిమాండ్*
మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు బలోపేతం చేయాలని, పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి సంఘటన తర్వాత పోలీసులు చర్యలు తీసుకుంటారు కానీ నివారణాత్మక చర్యలు లోపిస్తున్నాయి. మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులు భయంతో జీవించకూడదు. భద్రత ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని మహిళా జాగృతి సంస్థ ప్రతినిధి అన్నారు. ఈ సంఘటనలపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని, యువత పార్కులు, నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లి ప్రమాదంలో పడకూడదు అని విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థలు విద్యార్థుల్లో సామాజిక అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోక్సో చట్టం, ఎస్సీ-ఎస్టీ చట్టం, మహిళా భద్రత చట్టాలు కఠినమైనవే అయినప్పటికీ, వాటి అమలులో పటిష్టత లేనప్పుడు అవి ప్రయోజనం ఇవ్వవని న్యాయవేత్తలు చెబుతున్నారు. చిత్తూరు ఘటనలతో మహిళల భద్రతపై జిల్లా పోలీసుల బాధ్యత మరింత పెరిగింది. చిత్తూరు మహిళలు సురక్షితంగా జీవించే వాతావరణం కల్పించడానికి పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాలని ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు. ఈ మూడు సంఘటనలు సమాజంలో విలువలు, నైతికతలు పడిపోతున్నాయనే హెచ్చరికలాంటివి. పరస్పర గౌరవం, భద్రత, బాధ్యత అనే విలువలు ప్రతి వ్యక్తిలో బలపడకపోతే చట్టాలు కూడా నిరుపయోగమే. మహిళను కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ కలిగిన మనిషిగా గౌరవించే సామాజిక అవగాహన పెంచడం ఇప్పుడు అత్యవసరం.
గంగ 1 మైనరు బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులను కోర్టు వరకు రోడ్డుపై నడిపించిన పోలీసులు (ఫైల్ ఫోటో)

