నీవా నది వరదలు, బాధలకు రాం..రాం
శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
చిత్తూరు పట్టణంలో వర్షాలు పడితే ఒక భిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది. కొన్నిచోట్ల ఆ వర్షం పెద్ద సవాలుగా మారుతుంది. నీవా నది కొద్దిరోజుల వర్షానికే ఉధృతంగా పొంగిపొర్లి పరివాహక ప్రాంతాల జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. తేనెబడ్డ, వీరభద్ర కాలనీ, తోటపాలెం, వెంకళరావు కాలనీ, సంతపేట ప్రాంతాలు నీవా నదిలో భాగమయ్యే దృశ్యం ప్రజలకు కొత్త కాదు. కానీ ప్రతి సారి ఆ నీటి ఉధృతి కొత్త బాధని గుర్తు చేస్తోంది. అలాగే చిత్తూరు పట్టణం ఏ కొద్ది పాటి వర్షానికి అయినా చిత్తడి అవుతుంది. మురుగు కాలవలు రోడ్ల మీద పొంగి పోర్లుతాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. రోడ్లు కూడా నదులను తలపిస్తాయి. పలు కాలనీలు నీటిలో మునిగిపోతాయి.
చిత్తూరు నీవా పరివాహక ప్రాంతాల ప్రజలకు 2015, 2017, 2021, 2023, 2024 ఈ ఐదు సంవత్సరాలు మరపురాని ముద్ర వేసిన సంవత్సరాలు. 2021లో వచ్చిన ఘోర వరదలో తేనెబడ్డ కాలనీలో మూడడుగుల ఎత్తు నీరు నిలిచిపోయి. దాదాపు 100 ఇళ్ళు నీటిమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనాలు చీకట్లోనే రాత్రులు గడిపారు. 2023 వరదలో వీరభద్ర కాలనీకి పూర్తిగా బయట రోడ్డు కనెక్టివిటీ కట్ అయింది. పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోయారు, రోగులు ఆస్పత్రులకు చేరుకోలేక బాధితులయ్యారు. 2024 నవంబర్‌లో తమిళనాడులో కురిసిన వర్షాలతో నీవా నది ఉధృతంగా ప్రవహించింది. గుడిపాల యాదమరి మండలాల నుండి వచ్చిన వరద జలాలు చిత్తూరుకు చేరి పట్టణంలో అనేక కాలనీలను ముంచేశాయి. ఆ సమయంలో రోడ్లు మునిగిపోవడంతో మహిళలు తాగునీరు తెచ్చేందుకు కూడా తిప్పలు పడ్డారు. కొన్నిచోట్ల ఆవు, మేకలు కొట్టుకుపోయాయి. ప్రజలు తడిసిన నేలపై కందిపప్పు వండుకుని కడుపు నింపుకున్న ఘటనలను ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటారు. మూడు రాత్రుల పాటు ఇంట్లో నేలమీది నీరు తగ్గలేదు. సైకిల్ తేలిపోయింది, పిల్లల పాఠశాల పుస్తకాలు అన్నీ పోయాయి. పొద్దున ఇంటి నుండి బయటికి వెళ్తే చర్మం దురదగా ఉండేది. అప్పుడు మాకు బతకడమే ఒక సవాలుగా అనిపించింది అని ఒక మహిళ ఆవేదన. ప్రతి ఏడాది వరద బాధను ఎదుర్కొంటున్నాం. వాన పడి నీవా పొంగితే పని లేదు, పూటగడవదు. మా ఇళ్ళలో నీరు, బయట వాన… మేము ఎక్కడికి పోవాలి? అంటూ ఒక కార్మికుడి కన్నీరు. నీవా నది పక్కన ఉన్న భాధితుల ఆవేదనను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అర్థం చేసుకున్నారు. ప్రజల భయాన్ని తీర్చే శాశ్వత పరిష్కారం అవసరం అని ఆయన నిశ్చయించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి తోటపాలెం, దోభీ ఘాట్, వీరభద్ర కాలనీ, తేనెబడ్డ ప్రాంతాలను పరిశీలిస్తూ స్థానికులతో సంభాషించారు. దెబ్బతిన్న లిల్లీ బ్రిడ్జి, మురుగు జలాల అడ్డంకులు, నీరు నిలిచే ప్రదేశాలు అన్నింటినీ స్వయంగా చూశారు.
*రూ.175 కోట్ల శాశ్వత ప్రణాళిక*
ప్రజల ఆందోళనను అర్థం చేసుకున్న ప్రభుత్వం రూ.175 కోట్లతో శాశ్వత ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో కొత్త వంతెనలు, రీటైనింగ్ వాల్‌లు, కల్వర్టర్లు నిర్మించడం, రోడ్లను పునరుద్ధరించడం వంటి పనులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఆమోదం పొందగానే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే వర్షం పడినా, నీవా పరివాహక ప్రాంతాల ప్రజలు కష్టాలు పదాల్చిన అవసరం లేదు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతిసారి లిల్లీ బ్రిడ్జి మీదుగా నీరు ముంచెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. దీని స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఆమోదిస్తే పనులు వెంటనే ప్రారంభిస్తాం అని తెలిపారు.
*ఎమ్మెల్యే సహాయం*
వరదలతో ఇబ్బందులుపడిన ప్రజలకు ఎమ్మెల్యే జగన్మోహన్ స్వయంగా తెలుసుకొని, నిత్యావసర సరుకులను అందజేశారు. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఉప్పు, దుప్పట్లు, వంటకు కావలసిన సరుకులు పంపిణీ చేశారు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు ఆయన చేతిని పట్టుకుని, ఈ వంతెన పాడై, ఈ గల్లీ తడిచి, మేము ఏడేళ్లు కష్టపడ్డాం బాబూ. ఈసారి మీరు శాశ్వతంగా చేస్తారన్న మాట విన్నా ఇక ప్రశాంతంగా నిద్రపోతాం అని కళ్లలో తడితో చెప్పి అందరిని కదిలించింది. ప్రజల ఆ కన్నీళ్లు, అధికారుల చొరవ, ప్రభుత్వ ప్రణాళిక కలిపి ఇప్పుడు నీవా నది కన్నీటి గాధకు కొత్త పుట తెరుస్తున్నాయి. ఇకపై వానలు వస్తే ప్రజలు భయపడకూడదు, నీటిని చూసి ఆందోళన కాకుండా ఆనందం పొందాలి. చిత్తూరు ప్రజలు కోరుకునే ఒక్క మాట ఇక నీవా ముంచకూడదు. ఆ మాట నిజమవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ శాశ్వత ప్రణాళిక అమల్లోకి వస్తే తేనెబడ్డ, వీరభద్ర కాలనీ, తోటపాలెం ప్రజలకు ఇక వరద భయం ఉండదు. నీవా గతంలో కన్నీళ్లు మిగిల్చింది ఇప్పుడు ఎమ్మెల్యే జగన్ మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చొరవతో ఆశలు విరబూస్తున్నాయి.

