23, అక్టోబర్ 2025, గురువారం

భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలో అపార నష్టం

 విద్యుత్ శాఖకు 445 చోట్ల అంతరాయాలు 

12 మండలాల్లో వరి పంటకు నష్టం 

11చోట్ల దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్లు

రెండు మండలాల్లో దెబ్బతిన్న పాఠశాల భవనాలు 

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

చిత్తూరు జిల్లాలో గురువారం వర్షాలు తగ్గుముఖం పెట్టాయి. నిండ్ర మండలంలో మాత్రం 83.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మిగిలిన మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదు. విజయపురం మండలంలో 34.4, నగిరి మండలంలో 28.8, ఎస్ఆర్ పురంలో 26.8, సోమలలో 14.6, ఐరాలలో 13, కార్వేటి నగరంలో 11.6,  వెదురుకుప్పంలో 11.2, పులిచర్లలో 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లా సంఘటన బుధవారం 40.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, గురువారం 14 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రం నమోదయింది. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బంది పడిన ప్రజలు గురువారం కొంత ఊపిరిపించుకున్నారు. గురువారం చాలా మండలాల్లో ఎండ కాసింది. అక్కడక్కడ కొద్దిగా జల్లులు కురిసినట్లు సమాచారం.  భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో 12 మండలాల్లో వరి పంట దెబ్బతింది. రెండు మండలాల్లో పాఠశాల భవనాలు దెబ్బ తిన్నాయి. ఈ వర్షాలకు విద్యుత్ శాఖకు భారీ నష్టం సంభవించింది. నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నారు.  జిల్లాలో 9 చోట్ల ఆర్ అండ్ బి రోడ్లు  తెగిపోయాయి. మరో రెండు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. 50 కిలోమీటర్ల పొడవైన రోడ్డు దెబ్బతింది. 

*12 మండలాల్లో వరి పంటకు నష్టం*


భారీ వర్షాల కారణంగా 12 మండలాల్లో వరి పంట దెబ్బతింది. మొత్తం 32 గ్రామాలలో 172 మంది రైతులు నష్టపోయారు. 70 88 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. యాదమరి, గుడిపాల, తవణంపల్లి, పెనుమూరు, బంగారుపాలెం, పూతలపట్టు, ఐరాల, చౌడేపల్లి, సోమల, సదం, పాలసముద్రం, గంగాధర నెల్లూరు మండలాల్లో వరి పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నివేదికను తయారు చేశారు. వరి పంట కోతకు వచ్చిన దశలో పలు మండలాల్లో దెబ్బతిందని తెలిపారు.

 *రెండు మండలాల్లో పాఠశాల భవనాలకు దెబ్బ*

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో రెండు మండలాల్లో పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. గుడిపాల మండలం కమ్మ తిమ్మపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంపౌండ్ వాల్ దెబ్బతింది. అలాగే పై కప్పులో కూడా లీకేజీ ఏర్పడింది. తవణంపల్లి మండలం మాధవరం ప్రాథమికోన్నత పాఠశాలలో కాంపౌండ్ వాల్ దెబ్బతింది. మొత్తం నష్టాన్ని 14.5 లక్షల రూపాయలుగా పంచాయతీరాజ్ అధికారులు అంచనాలు తయారు చేశారు. 

*విద్యుత్ శాఖకు భారీగా నష్టం*

జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ శాఖకు భారీగా నష్టం వాటిల్లింది. 445 చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పునరుద్ధరణకి అధికారులు కృషి చేశారు. చాలాచోట్ల విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. విద్యుత్తు ఉప కేంద్రాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గృహాలకు చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నష్టం అంచనాను విద్యుత్ శాఖ అధికారులు తయారు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను  పునరుద్దరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

*11 చోట్ల ఆర్ అండ్ బి రోడ్ల కోత*

భారీ వర్షాల కారణంగా ఆర్ అండ్ బి రోడ్లు భవనాలు శాఖకు భారీగా నష్టం జరిగింది. జిల్లాలో 9 చోట్ల రోడ్లు తెగిపోయాయి. మరో రెండు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. 50 కిలోమీటర్ల పొడవైన రోడ్డు దెబ్బతిన్నట్లు ఆర్ అండ్ బి అధికారులు అంచనా వేశారు. ఈ వర్షాలకు తవణంపల్లి మండలంలో నాలుగు చోట్ల రోడ్లు తెగిపోయాయి. యాదమరి మండలంలో మూడు చోట్ల, సోమల మండలంలో  రెండు చోట్ల నీటి ప్రవాహానికి రోడ్లు కొట్టుకొని పోయాయి. యాదమరి మండలంలో రెండు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ వర్షాల కారణంగా ఎంత నష్టం జరిగిందన్న విషయాన్ని ఆర్ అండ్ బి అధికారులు అంచనా వేస్తున్నారు.

*ముఖ్య మంత్రి సమీక్ష*

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్  టెలి కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.  మఖ్యమంత్రి మాట్లాడుతూ.. వర్ష ప్రభావిత  జిల్లాలలో మందస్తు చర్యలు తీసుకోవాలని వర్షం ప్రభావిత  జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూడాలని అన్నారు. కాలువ, చెరువుగట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్నచోట్ల పటిష్ట పరచాలని సూచించారు. జిల్లాలో వర్షం వలన చెరువులు నిండిన తర్వాత ఆ నీటిని వృధా కాకుండా నిల్వ చేసుకోవాలని తెలిపారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, రహదారులు, భవనాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, పిల్లలకు పాలు లాంటి ఆహారపదార్ధాలను అందుబాటులో ఉంచాలన్నారు. తీవ్ర వర్షాల కారణంగా కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సీఎం అధికారులకు సూచనలు ఇచ్చారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. అలాగే పంట నష్టం జరక్కుండా చూడాలని సీఎం సూచనలిచ్చారు. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో చెరువులు నింపేందుకు చర్యలు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్  ముఖ్యమంత్రికి వివరిస్తూ..  జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.  జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో భారీ వర్షం నేపథ్యంలో కంట్రోల్ రూమ్ లు  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నగిరి మండలంలో  అత్యధికంగా వర్షపాతం నమోదు చేయడం జరిగిందని తెలిపారు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించారుఎక్కడ వర్షపు నీరు నిల్వ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీరు కలుషితం లేకుండా  ఎప్పటికప్పుడు వాటర్ టెస్టింగ్ కూడా జరుపుతున్నామని తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *