14, అక్టోబర్ 2025, మంగళవారం

ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు

సామాన్యులకు అందని ద్రాక్షగా మారిన బంగారం 
బంగారం ధరల పెరుగుదల కారణంగా పడకేసిన రియల్ ఎస్టేట్ 
ధరల తగ్గుదల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులు
గిల్టు నగలతో సరిపెడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలు


(చిత్తూరు, బ్యూరో ఆంధ్రప్రభ)

గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. పసిడి కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు శుభకార్యాలకు, పెట్టుబడికి నమ్మకమైన ఆస్తిగా భావించిన బంగారం, ఇప్పుడు కొందరికి అందని ద్రాక్షలా మారింది. బంగారం ధరలు భారీగా పెరుగుతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కంటే బంగారం మీద పెట్టుబడి పెట్టడం లాభదాయకం కావడంతో ప్రజలు బంగారు కొనడానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న బంగారు ధరల కారణంగా పేదలు మధ్య తరగతి ప్రజలు గిల్టు నగలకే పరిమితం కావలసి వస్తోంది. బంగారం ధరలు రోజురోజుకు పెరగడానికి కారణాలు సామాన్యులకు అర్థం కావడం లేదు. ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో నిపుణుల సైతం అంకేనా వేయలేకపోతున్నారు.

దశాబ్ద కాలంలో  బంగారం ధరల పెరుగుదలను పరిశీలిస్తే,  బంగారం ఎంత వేగంగా పెరిగిందో తెలుస్తుంది. 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర  1995లో  దాదాపు రూ. 4,680 ఉండగా, 30 ఏళ్లలో దాదాపు 26.8 రెట్లు పెరుగుదల కనిపిస్తుంది.  2005 లో రూ. 7,000 నుండి 7,638ఉన్న ధర  20 ఏళ్లలో దాదాపు 17 రెట్లు పెరిగింది.  2015 లో  రూ. 26,845 నుండి 27,000 పలికిన బంగారం 10 ఏళ్లలో దాదాపు 4.6 రెట్లు పెరిగి,  నేడు రూ.1,28,350 పైగా పలుకుతోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే,  బంగారం అనేది దీర్ఘకాలంలో అత్యంత స్థిరమైన, అధిక రాబడినిచ్చే పెట్టుబడి అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో దాని పెరుగుదల చాలా వేగంగా ఉంది.  బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే, బంగారం అనేది అంతర్జాతీయంగా ట్రేడ్ అయ్యే వస్తువు.  దాని ధరలు కేవలం దేశీయ పరిస్థితులపైనే కాకుండా, ప్రపంచ ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి.  ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. గత 20 సంవత్సరాలుగా ప్రపంచం 2008 ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అనేక సంక్షోభాలను చవిచూసింది. ఈ సంక్షోభాల సమయంలో మదుపరులు తమ పెట్టుబడులను రిస్క్ లేని, సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు మళ్లిస్తారు. ఇది బంగారానికి డిమాండ్‌ను పెంచుతుంది.  అమెరికా  ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న ఊహాగానాలు బంగారం ధరలపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. వడ్డీ రేట్లను తగ్గిస్తే, డాలర్ విలువ బలహీనపడి, బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. బంగారం అంతర్జాతీయంగా అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోయినప్పుడు, బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. భారతదేశం భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, రూపాయి బలహీనత దేశీయ ధరలను పెంచుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, కరెన్సీ విలువ తగ్గుతుంది. ద్రవ్యోల్బణం నుంచి తమ సంపదను కాపాడుకోవడానికి ప్రజలు బంగారాన్ని విలువ నిల్వ గా భావించి కొనుగోలు చేస్తారు. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతాయి. 

రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరల వలన సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. పెరుగుదల  ప్రభావం పెళ్లిళ్లపై చూపుతోంది. మన వివాహాల్లో బంగారం తప్పనిసరి. ధరలు విపరీతంగా పెరగడంతో, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల వివాహాల కోసం అప్పులు చేయవలసి వస్తోంది, లేదా కొనుగోళ్ల మొత్తాన్ని తగ్గించుకోవలసి వస్తోంది. నగల దుకాణాల్లో కొనుగోళ్లు కూడా 50-60 శాతం వరకు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.  చిన్న మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్య ప్రజలు ఇప్పుడు ఒక గ్రాము కూడా కొనలేని పరిస్థితి. ఇది వారి భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపుతోంది.  ధరలు పెరిగే కొద్దీ, ఇప్పటికే బంగారం ఉన్న వారికి లాభం చేకూరుతుంది. కానీ కొనుగోలు చేయాలనుకునే సామాన్య ప్రజలు మరింత వెనుకబడిపోతున్నారు.

 బంగారం ధరలు ఎక్కడ ఆగుతాయి? అనే ప్రశ్నకు  నిపుణుల సమాధానం చెప్పలేకపోతున్నారు. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో కచ్చితంగా చెప్పడం కష్టం అంటున్నారు. ఈ పెరుగుదల, తరుగుదల ప్రధానంగా ప్రపంచంలో యుద్దాల మిద కూడా  ఆధారపడి ఉంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు స్థిరపడితే మాత్రమే బంగారంపై పెట్టుబడి డిమాండ్ తగ్గి ధరలు తగ్గే అవకాశం ఉంది.  నిపుణుల అంచనా ప్రకారం రాబోయే ఒకటి, రెండేళ్లలో బంగారం ధర రూ. 2 లక్షల మార్కును కూడా దాటే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా పసిడికి ఉన్న డిమాండ్‌లో పెద్ద మార్పు రాకపోవచ్చు. బంగారం ధరల పెరుగుదల అనేది కాలంతో పాటు, ప్రపంచ సంక్షోభాలకు అనుగుణంగా పెరుగుతున్న పెట్టుబడి విలువను సూచిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఆభరణాల కొనుగోళ్ళు అందని ద్రాక్షగా మారుతోంది. 

గంగ 1 బంగారం 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *