31, అక్టోబర్ 2025, శుక్రవారం

మేయర్ దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

ఐదు మంది దోషులకు ఉరిశిక్ష ఖరారు 

దశాబ్ద కాలం తర్వాత వచ్చిన తీర్పు 

కోర్టు తీర్పులు స్వాగతించిన చూడ  చైర్మన్ కటారి హేమలత 

చిత్తూరు పట్టణంలో 144 సెక్షన్ అమలు



చిత్తూరు, అక్టోబర్‌ 31 (ఆంధ్రప్రభ బ్యూరో): చిత్తూరు నగరాన్ని ఒక దశాబ్దం క్రితం కుదిపేసిన మాజీ మేయర్‌ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ హత్య కేసులో చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. కోర్టు 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధించడమే కాకుండా, బాధిత కుటుంబానికి మొత్తం 70 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అందులో కటారి కుటుంబానికి రూ. 50 లక్షలు, ఫిర్యాదుదారు సతీష్‌ నాయుడుకు రూ. 20 లక్షలు ఇవ్వాలని తీర్పు పేర్కొంది. ఈ కేసులో కన్నయ్యనాయుడు కాలనీ, చిత్తూరు చెందిన శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ అనే చింటూ (49), ఎం. వెంకటేశ్‌ అనే గంగనపల్లి వెంకటేశ్‌ (49), కొట్టేవల్ల జయప్రకాశ్‌ రెడ్డి అనే జయ (33), గంగవరం మండలం మారేడుపల్లికి చెందిన తోటి మంజునాథ్‌ అనే మంజు (37), కర్ణాటక రాష్ట్రము కోలార్ జిల్లా ముల్బాగల్‌ కు చెందిన వేంకటాచలపతి అనే ముల్బాగల్‌ వెంకటేష్‌ అలియాస్ రేజర్‌ వెంకటేష్‌ (61)లకు కోర్టు ఉరి శిక్షను విధించింది.

2015 నవంబర్‌ 17వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. మేయర్‌ కటారి అనురాధ మరియు ఆమె భర్త కటారి మోహన్‌ చిత్తూరు మునిసిపల్‌ కార్యాలయంలో జనచైతన్య యాత్ర కార్యక్రమంపై చర్చిస్తున్న సమయంలో, నిందితులు ముందుగా పన్నిన పథకం ప్రకారం బుర్ఖాలు ధరించి కార్యాలయానికి చేరుకున్నారు. నిందితులు తమ గుర్తింపును దాచుకునేందుకు ముస్లిం మహిళల వేషం వేసి, ఒకరు కూరగాయల సంచీ పట్టుకుని, మరొకరు మహిళల బ్యాగ్‌ పట్టుకుని మేయర్‌ కార్యాలయంలోకి చొరబడ్డారు. అయిదు మంది మేయర్‌ గదివైపు కదిలారు. వారిలో ఒకరు చేతిలో ఉన్న బ్యాగ్‌ నుంచి మూడు వేటకొడవళ్ళు తీసి మిగతా ముగ్గురికి ఇచ్చారు. చింటూ తన వద్ద ఉన్న ఎయిర్‌ పిస్టల్‌ ను వెంకటేష్ కు  అందించాడు. మేయర్‌ కార్యాలయ గదిలోకి ప్రవేశించిన వెంటనే  చింటూ తన పిస్టల్‌తో మేయర్‌ కటారి అనురాధపై కాల్పులు జరిపాడు. క్షమించండి అని వేడుకున్నా వినకుండా, ఆమె తలపై బుల్లెట్‌ దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత నిందితులు ఆమె భర్త కటారి మోహన్‌పై దాడికి యత్నించారు. ఆయనను రక్షించడానికి ముందుకు వచ్చిన ఫిర్యాదుదారు సతీష్‌ నాయుడును మంజునాథ్‌తన వేటకొడవలితో వెనకన కోసి గాయపరిచాడు. వెంకటేష్ తన ఎయిర్‌ పిస్టల్‌తో మోహన్‌పై కాల్పులు జరిపాడు. తీవ్ర భయంతో మోహన్‌ గారు కౌన్సిల్‌ హాల్‌ వైపు పరుగెత్తగా, నిందితులు వెంబడించి ఆయనను వేటకొడవలితో మెడపై కోయడంతో ఆయన కుప్పకూలి మరణించారు.  దాడి అనంతరం నిందితులు భవనం వెనుకవైపు హెల్త్‌ ఆఫీసర్‌ కార్యాలయం గోడ ఎక్కి బయటకు పారిపోయారు. డ్రైవర్‌ తన నల్ల రంగు మారుతి స్విఫ్ట్‌ కారులో రెడీగా ఉండగా, చింటూ,  వెంకటేష్  ఆ కారులో ఎక్కి పారిపోయారు. మిగతా ముగ్గురు బస్‌స్టాండ్‌ వైపు పరుగెత్తారు. గాయపడిన వారిని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మేయర్‌ కటారి అనురాధ మరణించారని ధృవీకరించారు. తీవ్ర గాయాలపాలైన కటారి మోహన్‌, సతీష్‌ నాయుడును వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అయితే మోహన్‌ గారు రాత్రి 9 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు. సతీష్‌కుమార్‌ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. నిరంజన్‌కుమార్‌  కేసు నమోదు చేశారు. అప్పటి జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌ పర్యవేక్షణలో, చిత్తూరు సబ్‌-డివిజనల్‌ డీఎస్పీ ఎం. లక్ష్మీనాయుడు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. మొత్తం 69 మంది సాక్షులను విచారించి, ఆధారాలను సేకరించి, ఎ 2 నుండి ఎ 23 వరకు ఉన్న నిందితులను అరెస్ట్‌ చేశారు. 2015 నవంబర్‌ 30న ప్రధాన నిందితుడు  చంద్రశేఖర్‌ అనే చింటూ కోర్టులో లొంగిపోయాడు. విచారణలో అతను నేర ఉద్దేశ్యాన్ని, కుట్ర పద్ధతిని వివరంగా ఒప్పుకున్నాడు. సుమారు 59 మంది సాక్షులను విచారించిన తర్వాత, కోర్టు శుక్రవారం  తీర్పు వెలువరించింది. సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలు, దర్యాప్తు అధికారులు సమర్పించిన పత్రాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం,  తొమ్మిదవ అదనపు జిల్లా  జడ్జి  శ్రీనివాసరావు 5 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించారు.  విచారణలో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జడ్జి ఆదేశించారు. అప్పటి చిత్తూరు సబ్‌-డివిజనల్‌ డీఎస్పీ ఎం. లక్ష్మీనాయుడు, 1 టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. నిరంజన్‌ కుమార్, ప్రస్తుత డీఎస్పీ టి. సాయినాథ్, ఇన్‌స్పెక్టర్‌ మహేశ్వర్, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శైలజ, కోర్టు మానిటరింగ్‌ సెల్‌ ఇన్‌చార్జ్‌ ఇన్స్పెక్టర్‌ చంద్రశేఖర్, కోర్టు మానిటరింగ్‌ సెల్‌ సిబ్బంది హరికుమార్‌  కేసు దర్యాప్తు, విచారణలో పాల్గొన్నారు. దశాబ్ద కాలంగా సాగిన ఈ హత్య కేసులో న్యాయం సాధ్యమవడంతో, చిత్తూరు ప్రజలు, రాజకీయ వర్గాలు, భాదిత కుటుంబ సభ్యులు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక మైలురాయి తీర్పు అని పలువురు అభిప్రాయపడ్డారు. జిల్లా కోర్టు తీర్పును చిత్తూరు చూడ చైర్మన్ కటారి హేమలత స్వాగతించారు. ఈ తీర్పుతో హత్య కు గురైన తన మామ అత్తలు కటారి మోహన్, కటారి అనురాధ ఆత్మకు శాంతి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు సందర్భంగా చిత్తూరు పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. గంగనపల్లిలో కటారి మోహన్ కార్యాలయం వద్ద పోలీసు టికెట్లను ఏర్పాటు చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *