డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు
రెండు సరికొత్త పథకాలను ప్రారంభించానున్న ప్రభుత్వం
పిల్లల చదువు నిమిత్తం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి
పిల్లల పెళ్లికి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి
లక్ష రూపాయల వరకు రుణం పొందే అవకాశం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారులను చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డ్వాక్రా మహిళలకు అందజేసే శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలకు వడ్డీ శాతాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఎంత మొత్తం రుణం తీసుకున్న వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. వీటితోపాటు కొత్తగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాలను రెండింటిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ పథకాల కింద డ్వాక్రా సభ్యులకు పావలా వడ్డీకే లక్ష రూపాయల వరకు రుణాన్ని అందచేస్తారు. ఇందువల్ల డోక్రా మహిళలు తమ పిల్లల చదువు, పెళ్లిళ్లు నిమిత్తం అప్పులు చేసే బాధ తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాల అమలుకు రాష్ట్రస్థాయిలో 2000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ప్రమాదవశాత్తున ఈ పథకాల కింద రుణం తీసుకున్న మహిళ మృతి చెందితే ఆ మహిళ తీసుకున్న రుణం కూడా మాఫీ అవుతుంది. ఈ మేరకు పథకాల రూపకల్పన పూర్తయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొందర్లోనే లాంచనంగా ప్రారంభించనున్నారు.
మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలను అందచేస్తుంది. గతంలో స్త్రీ నిధి రుణం మీద 12శాతం వడ్డీ ఉంటే, బ్యాంక్ లింకేజీ రుణాలపై 13శాతం వడ్డీలు వసూలు చేసేవారు. అయితే, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల మహిళలకు ఊరట కలిగిస్తూ వడ్డీ రేట్లపై రెండు శాంతం రాయితీ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంతో స్త్రీ నిధి రుణాలపై 10శాతం, బ్యాంక్ లింకేజీ రుణాలపై 11శాతం వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పావలా వడ్డీ పథకం కింద గతంలో రూ.3లక్షల వరకు మాత్రమే తక్కువ వడ్డీ వర్తించేది. మూడు రెట్ల రూపాయలు దాటితే వడ్డీ రేటు పెరిగేది. కూటమి ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో ఎంత రుణం తీసుకున్నా రెండు శాంత రాయితీ వర్తిస్తుంది. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపికబురు ప్రకటించింది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ వారి కుటుంబానికి అండగా నిలిచేలా మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతోంది. పిల్లల విద్యా ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాం కొరకు ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకాలు త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ స్కీంలకు ఆమోదం తెలిపారని సమాచారం. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు వర్తిస్తాయి. అలాగే ఇప్పటికే బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నవారికి మాత్రమే అర్హత ఉంటుంది. పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను బయోమెట్రిక్ ఆధారంగా నిర్వహించనున్నారు.
*ఎన్టీఆర్ విద్యాలక్ష్మి* పథకం కింద ఒక మహిళ గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం రుణ సాయం పొందవచ్చు. 10 వేల నుంచి రూ.1 లక్ష వరకు అవసరాన్ని బట్టి రుణం లభిస్తుంది. వడ్డీ రేటు కేవలం 4 శాతం (పావలా వడ్డీ) మాత్రమే. గరిష్ఠంగా 48 వాయిదాలలో రుణం చెల్లించాలి. అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదు, విద్యాసంస్థ వివరాలు సమర్పించాలి. దరఖాస్తు చేసిన 48 గంటల్లోపే బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది.
*ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి* డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ఈ పథకం పనిచేస్తుంది. రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం పొందవచ్చు. వడ్డీ రేటు 4 శాతం (పావలా వడ్డీ). గరిష్ఠంగా 48 వాయిదాలలో చెల్లించాలి. లగ్నపత్రిక, వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాలి. వివరాల పరిశీలన అనంతరం, వధువు తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా డబ్బు జమ అవుతుంది. ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాల అమలుకు ప్రతి సంవత్సరం రూ.2000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అందులో విద్యాలక్ష్మి కోసం రూ.1000 కోట్లు.. కళ్యాణ లక్ష్మి కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో 50 శాతం డ్వాక్రా సంఘాల బలోపేతానికి వినియోగిస్తారు. మిగిలిన 50 శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయించనున్నారు. అంతే కాకుండా ఈ పథకాల కింద రుణం తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తూ ప్రమాదంలో మరణిస్తే, ఆ రుణం మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. దీంతో కుటుంబంపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

