టిడిపి రాష్ట్ర కమిటీలో చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత !
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
టిడిపి రాష్ట్ర కమిటీని ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి చేశారు. పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ వర్ల రామయ్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు, ప్రోగ్రామ్స్ కమిటీ, లోకేష్ టీమ్ కలసి జాతీయ, రాష్ట్ర కమిటీలను రూపొందించారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచనలు, ప్రధాన కార్యదర్శి లోకేష్ సలహాలు పాటించారు. లోకేష్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత తుది మెరుగులు దిద్ది, చంద్రబాబు ఆమోదంతో ప్రకటిస్తారని అంటున్నారు. ఆయన అట్రాలియా పర్యటన ముగించుకుని ఈ నెల 24 న అమరావతి వస్తారు. చంద్రబాబు నాయుడు నాయుడు కూడా అప్పటికి దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చేస్తారు.
జాతీయ, రాష్ట్ర కమిటీల కార్యవర్గం పొలిట్ బ్యూరో సభ్యులు కలసి దాదాపు 260 మందికి పైగా ఉంటారని అంటున్నారు. ఈ నేపద్యంలో చిత్తూరు జిల్లా నుంచి కనీసం పది మందికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డిలలో ఒకరిద్దరి జాతీయ కమిటీలో చోటు దొరకవచ్చు. రాష్ట్ర అధికార ప్రతినిధులు డాక్టర్ సప్తగిరి ప్రసాద్, సురేంద్ర కుమార్ ను తిరిగి అదే పదవిలో కొనసాగించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యేలు సి కె బాబు, ఎ ఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, వై వి రాజేశ్వరి, కాజూరు బాలాజీ, కోదండ యాదవ్, చంద్రప్రకాశ్, సి కె లావణ్య తదితరులకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పిస్తారని తెలిసింది. కాగా అనుబంధ సంస్థల రాష్ట్ర కమిటీలలో మరి కొందరికి స్థానం కల్పిస్తారని అంటున్నారు. కాగా కీలకమైన పార్లమెంటు ( జిల్లా) అధ్యక్ష పదవిపై ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిసింది. రాయలసీమను ఒక యూనిట్ గా తీసుకుని చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ నేపద్యంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడుకు, రాష్ట్ర మాజీ కార్యదర్శి జి సందీప్ చౌదరి, బంగారు పాల్యం మాజీ ఎంపిపి ఎన్ పి జయప్రకాష్ నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మిగిలిన పాలు పార్లమెంటు అధ్యక్ష పదవులకు ఐవీఆర్ఎస్ నిర్వహించినప్పటికీ చిత్తూరు వాయిదా వేశారు. లోకేష్ వచ్చిన తర్వాత నిర్ణయిస్తారని తెలిసింది. కడపకు శ్రీనివాస్ రెడ్డి, భూపేష్ రెడ్డి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. రాజంపేట పార్లమెంటు (అన్నమయ్య జిల్లా) అధ్యక్షునిగా బలిజ సామాజిక వర్గానికి చెందిన సుకవాసి ప్రసాద్ బాబు ఒక పేరుతో ఐవీఆర్ఎస్ నిర్వహించారు. తిరుపతి పార్లమెంటుకు రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు జి నరసింహ యాదవ్, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది.
గంగ 2 టిడిపి లోగో

