పోలీసులు అదుపులో 12 మంది అనుమానితులు
అనుమానితులలో స్థానిక సర్పంచ్ గోవిందయ్య కూడా
మరో ఐదు మంది మహిళలను విచారిస్తున్న పోలీసులు
జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు మండలం దేవళం పేట కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుమారు 12 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసులు వైసీపీకి చెందిన స్థానిక సర్పంచ్ గోవిందయ్య, తెలుగుదేశం పార్టీకి చెందిన సురేష్ నాయుడు పైని మరో ఐదు మంది మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసు రాష్ట్రస్థాయిలో సంచలనం కావడంతో పోలీసులు ఈ విషయం మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకరించారు. విషయం తెలియగానే శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి సంఘటన స్థలం చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి దోషులను తొందర్లోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి శుక్రవారం పోలీసులు కేసును నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్లు కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ గా తీసుకున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. తొందరగా దోషులను పట్టుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే విచారణను ప్రారంభించారు. శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి తదితరులు దేవళం పేట అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాలిన అంబేద్కర్ విగ్రహం స్థానంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వం తరఫున కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించింది. శుక్రవారం చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజన్ దేవలంపేటకు వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్థానికుల కథనం మేరకు అంబేద్కర్ విగ్రహానికి యాదృశ్యకంగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహానికి సమీపంలో ఒక మహిళ నివాసం ఉంటుంది. ఆ మహిళ అక్కడ ఉన్న స్థలంలో టెంకాయ మట్టలను వేసి ఉంచారు. స్థానిక విభేదాల కారణంగా కొందరు గురువారం రాత్రి అంబేద్కర్ విగ్రహం సమీపంలోని టెంకాయ మట్టలకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ నిప్పు ఉదృతమై అంబేద్కర్ విగ్రహానికి సోకి, విగ్రహం కొంతవరకు కాలిపోయింది. ఈ విషయాన్ని రాజకీయం చేయాలని గ్రామంలోని ఒక వర్గం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. స్థానిక వైసిపి నాయకులతో ఇటీవల టిడిపిలో చేరిన కొంతమంది నాయకులు కూడా చేతులు కలిపినట్లు తెలుస్తోంది. మండల స్థాయిలోని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను రాజకీయంగా దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నంగా కొందరు వర్ణిస్తున్నారు. ఏది ఏమైనా ఒకటి, రెండు రోజుల్లో ఈ సంఘటనకు కారణమైన వారిని పోలీసులు గుర్తించే అవకాశం ఉంది.