మేయర్ దంపతుల హత్య కేసులో కీలక పరిణామం
తప్పుడు సాక్ష్యం ఇచ్చిన 14 మందికి కోర్టు షోకాజ్ నోటీసులు
చిత్తూరు, అక్టోబర్ 31 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి అనురాధ – కటారి మోహన్ దంపతుల హత్య కేసు విచారణలో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ సమయంలో తప్పుడు సాక్ష్యం ఇచ్చినట్లు గుర్తించిన 14 మంది సాక్షులకు చిత్తూరు జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మేయర్ దంపతుల హత్య కేసులో విచారణలో పాల్గొన్న కొంతమంది సాక్షులు తమ వాంగ్మూలాల్లో ప్రధాన అంశాలపై అసత్య వాంగ్మూలం ఇచ్చినట్లు గుర్తించారు. దీనిపై కోర్టు, ఈ 14 మంది సాక్షులకు భారతీయ దండన చట్టం సెక్షన్ 193 ప్రకారం ఎందుకు నేరపూర్వక చర్యలు ప్రారంభించకూడదో వివరణ ఇవ్వమని నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పులో పేర్కొన్నట్లు, విచారణ ప్రక్రియలో తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది. షోకాజ్ నోటీసులు అందుకోనున్న వారిలో సురేష్‌కుమార్,జి. మల్లికార్జున, ఆర్. బాలకృష్ణ, ఆర్. పద్మనాభ చెట్టి, డి. ఆదాము, ఆర్. ఆనంద నాయుడు, ఎస్. మునిరత్నం, డి. ముద్దుకృష్ణ యాదవ్, ఎస్. దొరైరాజ్, ఎం.కె. త్యాగరాజన్, కె. కిరణ్‌కుమార్, జి.కె. వసు బాబు, జి. గోపినాథ్, పి. ధనంజయ ఉన్నారు. ఈ సాక్షులందరూ విచారణ సమయంలో వివిధ స్థాయిల్లో కోర్టుకు హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. కోర్టు పరిశీలనలో ఈ వాంగ్మూలాల్లో ముఖ్యమైన అంశాలపై అసత్యం చెప్పినట్లు తేలింది. కోర్టు చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిఐను ఆదేశిస్తూ, పై పేర్కొన్న 14 మంది సాక్షుల పూర్తి చిరునామా వివరాలు 10 రోజుల్లోగా సేకరించి, వాటిని ప్రభుత్వ న్యాయవాది ద్వారా కోర్టుకు సమర్పించాలని సూచించింది. భారతీయ దండన చట్టంలోని సెక్షన్ 193 ప్రకారం, ఎవరైనా కావాలనే తప్పుడు సాక్ష్యం ఇవ్వడం లేదా తప్పుడు సాక్ష్యం సృష్టించడం నేరంగా పరిగణించబడుతుంది. దీనికి గరిష్ఠంగా ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు జరిమానా విధించవచ్చు. మేయర్ దంపతుల హత్య కేసు విచారణ దశాబ్దకాలంగా సాగుతూ, శుక్రవారం ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే విచారణ సమయంలో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన అంశాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తూ, న్యాయనిర్మాణ ప్రక్రియను రక్షించడంలో ఇది కీలక దశగా భావించబడుతోంది. చిత్తూరు జిల్లా న్యాయవర్గాలు, పోలీసు అధికారులు ఈ పరిణామాన్ని సాక్ష్యాల నిబద్ధతను కాపాడే చర్యగా అభివర్ణించారు.

