తల్లికి వందనం లబ్దిదారుల సంఖ్య గోప్యం
నిధుల విడుదలకు భారీగా షరతులు
10 శాతానికి పైగా అనర్హులుగా తేలే అవకాశం
చిత్తూరు జిల్లాలో 2,60,641 మంది విద్యార్థులు
రెండవ విడత ఈ నెల 10న విడుదల
(ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో)
కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా గత నెల 12వ తారీఖున తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లోకి నిధులను జమ చేసింది. అయితే ఈ నిధులు జిల్లాల వారీగా ఎంతమందికి విడుదలయ్యాయి అనే విషయాన్ని రహస్యంగా ఉంటుంది. ఈ విషయం జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారులకు కానీ, జిల్లా యంత్రాంగాన్ని కానీ అందుబాటులో లేవు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఎంతమందికి తల్లికి వందనం కింద నిధులను విడుదల చేశారు అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. సాధారణంగా ఏ పథకం కింద నిధులను విడుదల చేసినా, జిల్లా, మండలాల వారీగా ప్రకటిస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బిసి, ఓసి అభ్యర్థుల వివరాలను కూడా వెల్లడిస్తారు. ఇందుకు భిన్నంగా తల్లికి వందనం పథకంలో మాత్రం లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. గ్రామ సచివాలయాల్లో మాత్రం ఆ సచివాలయ పరిధిలో తల్లికి వందనం లబ్ధిదారుల వివరాలను ప్రకటించింది. మొదటి విడత తల్లికి వందనం కింద నిధులు విడుదల కాకుంటే, గ్రామ సచివాలయంలో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే షరతులను విధించింది. ఈ షరతుల కారణంగా సుమారు 10 శాతానికి పైగా పిల్లలు తల్లికి వందన పథకం కింద నిధులను పొందే అవకాశం కోల్పోయారని తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 2,60,641 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్నారు. ఈ 15 వేల రూపాయలలో 2 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్యం కోసం వినియోగించనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 14,701 మంది, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 1,22,266, మున్సిపల్ పాఠశాలలకు చెందిన 6,522, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 5,864, ఏపీ మైనారిటీ స్కూల్స్ కి చెందిన 3,364, ప్రైవేట్ స్కూల్స్ కు చెందిన 1,538, కస్తూరి పాఠశాలలకు చెందిన 2,081 విద్యార్థులు లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,56,336 మంది విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 1,04,305 మంది మొత్తం కలిపి 2,60,641 విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 83,874 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 21,950 మంది, ఉన్నత పాఠశాలలో చదువుతున్న 62,231, హై స్కూల్ ప్లస్ లో చదువుతున్న 10,155, ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 40288, మంది ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్ కళాశాలలో చదువుతున్న 14,815 మంది, జూనియర్ కళాశాలలో జరుగుతున్న 27,328 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
*షరతులు వర్తిస్తాయి*
తల్లికి వందనం పధకం కింద లబ్ది పొందాలంటే, మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12,000 మించకూడదు. కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి బియ్యం కార్డు ఉండాలి. కుటుంబం మాగాణి 3 ఎకరాల కంటే తక్కువ, మెట్టభూమి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. రెండూ కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. కుటుంబ సభ్యులలో ఎవరైనా 4-చక్రాల (టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయింపు) కలిగి ఉంటే అర్హులు కారు. నెలవారీ విద్యుత్ వినియోగం సొంత లేదా అద్దె ఇల్లు కుటుంబానికి నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. సగటున 12 నెలల విద్యుత్ వినియోగం పరిగణనలోకి తీసుకుంటారు. ఆ కుటుంబం 1000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఏ మున్సిపల్ ఆస్తిని కలిగి ఉండకూడదు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు, పి ఎస్ యు లో పనిచేస్తున్న వారి పిల్లలు, లేదా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారి పిల్లలు అర్హులు కారు. పారిశుధ్య కార్మికులకు మినహాయింపు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10,000 కంటే తక్కువ జీతం, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 12,000 కంటే తక్కువ జీతం పొందుతున్న అన్ని ఉద్యోగులకు మినహాయింపు ఉంది. ఆ కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే, ఆ కుటుంబం అర్హులు కారు. లబ్ధిదారుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గృహ డేటాబేస్‌లో చేర్చి ఉండాలి. ఒకవేళ, లబ్ధిదారుడు గృహ డేటాబేస్‌లో లేనప్పటికీ, పిల్లవాడు డేటాబేస్‌లో ఉంటే, అర్హతను నిర్ధారించడానికి, నిబంధనల ప్రకారం లబ్ధిదారుడిని మ్యాప్ చేయడానికి జి ఎస్ డబ్లూ ఎస్ విభాగం ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలి. లబ్ధిదారుడి పిల్లలు ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో I నుండి ఇంటర్ చదువుతూ ఉండాలి. ఐటిఐ, పాలిటెక్నిక్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రయోజనం పొందే ఇతర సారూప్య కోర్సులను ఎంచుకునే విద్యార్థులు అనర్హులు. అదనంగా, డిబిటి చెల్లింపు కోసం ఆధార్ లింకేజీని నిర్ధారించడానికి తల్లి బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ కి అనుసందానం చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో చదువుతుండాలి. విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇందుకు విద్యార్థి స్టడీ సర్టిఫికెట్, తల్లి ఆధార్ కార్డు, తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్, నివాస పత్రము లేదా రేషన్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రము, అవసరమైతే ఇన్‌కమ్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి, తల్లుల ఎకౌంట్లో డబ్బులు జమ చేసింది. తల్లికి వందనం రూ.15,000 అకౌంట్లో పడాలంటే, విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో పాటు ఎంతో బ్యాంకు ఖాతాను జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని కోరింది. ఒకవేళ లింక్ కానీ వారు లింక్ చేసుకునేందుకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాలలో సంప్రదించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేశారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో, ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకాన్ని అమలు చేయనున్నారు. మొదటి విడత నిధులు విడుదల కాని వారికీ, ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 10 వ తేదిన ప్రభుత్వం విడుదల చేయనుంది.

