మద్యం ముడుపుల కేసులో అప్రూవర్ గా నారాయణస్వామి?
ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నా, సంప్రతించకనే పాలసీ రూపకల్పన
ఈ కేసులో ఇరికించడానికి ఇద్దరు నేతలు ప్రయత్నింస్తున్నారని ఆరోపణ
నిర్దోషిగా బయటపడానికి అప్రూవర్ గా మారాలనే ఆలోచన
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
మద్యం ముడుపుల కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణస్వామి అప్రూవర్ గా మారనున్నారా? అయన సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నారు. ఆయన ఈ నెల 21వ తేదీ సిట్ విచారణకు హాజరు కాక పోవడం, ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు దీనికి ఊతం ఇస్తున్నాయి. వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు తనను ఈ కేసు ఇరికించాలని చూస్తున్నారని నారాయణస్వామి ఆరోపించారు. ఆ ఇద్దరు నేతలు చిత్తూరు జిల్లాకు చెందిన తండ్రి, కొడుకులేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నారాయణస్వామి పేరుకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, జిల్లాలో ఆయన పెత్తనం ఏమి సాగలేదు. చివరకు గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాకుండా కొందరు అడ్డుపడ్డారు. ఒక దశలో చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి, మళ్లీ రద్దు చేశారు. ఆయనకు కాకుండా కుమార్తెకు టికెట్ ఇప్పించారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న నారాయణస్వామి మద్యం కుంభకోణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోనున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
మద్యం ముడుపుల కుంభకోణం జరిగిందనడానికి సిట్ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాలు అన్నీ చార్జిషీట్ లో పొందుపరిచారు. ఈ నేపధ్యంలో స్కాం జరగలేదని వాంగ్మూలం ఇస్తే నారాయణ స్వామిని కూడా కుట్రలో భాగస్వామిని చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జరిగాయని పూర్తి నిజాలు చెప్పితే సొంత పార్టీ నేతలకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ దశలో తెలివిగా వ్యవహరించి తప్పించుకోవడం మంచిదని న్యాయనిపుణులు సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఆయన ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు స్కాం జరగలేదని, మంత్రిగా పాలసీని సమీక్షించడం మాత్రమే తన బాధ్యత అన్నారు. స్కాంలో కీలక వ్యక్తి అయిన రాజ్ కాసిరెడ్డి ఎవరో తనకు తెలియదు అన్నారు. అలాగే తనను స్కాంలో ఇరికించేందుకు పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అంటే లిక్కర్ కుంభకోణంలో ప్రభుత్వానికి సంబంధం లేదని, అయితే బయట జరిగి ఉండవచ్చని ఆయన పరోక్షంగా చెపుతున్నారు. ఆ విషయమే సిట్ విచారణలో చెప్పడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. కాగా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిథున్ రెడ్డి పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో తనకు జి డి నెల్లూరు అసెంబ్లీ టికెట్టు రాకుండా అడ్డుపడ్డారన్న కోపం ఉంది. తనను కాదని తన అనుచరుడు రాజేష్ కు టికెట్టు ఇవ్వాలని రామచంద్రా రెడ్డి కుట్ర చేశారని భావిస్తున్నారు. అయితే ఆఖరికి జగన్ దయతలచి తన కుమార్తె కృపా లక్ష్మికి టిక్కెట్ ఇచ్చారని అంటున్నారు. ఎన్నికల సమయంలో మిథున్ రెడ్డి జీడి నెల్లూరు నియోజక వర్గం బాధ్యత తీసుకున్నప్పటికీ తనకు వ్యతిరేకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతల్ని కట్టడి చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో తాను పేరుకు ఉప ముఖ్య మంత్రి అయినా జిల్లాలో పెత్తనం అంతా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చలాయించారన్న అక్కసు కూడా నారాయణ స్వామి పలు సార్లు వెళ్లగక్కారు. తన స్వంత నియోజక వర్గం వ్యవహారాలలో కూడా పెద్దిరెడ్డి జోక్యం చేసుకోవడం ఆయనకు నచ్చేది కాదు. ఇప్పుడు సరైన సమయం వచ్చినందున అప్రూవర్ గా మారి పెద్దిరెడ్డి కుటుంబంపై కసి తీర్చుకునే అవకాశం ఉందని ఆయన వర్గీయులలో వినిపిస్తోంది.
ఏపీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకూ పెద్దగా నారాయణ స్వామి పేరు వినిపించలేదు. పేరుకు ఎక్సైజ్ మంత్రే అయినా, చేతుల్లో ఏమీ ఉండేది కాదని అందరికీ తెలుసు. అందుకే సిట్ అధికారులు ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. కానీ సాక్షిగా అయినా వాంగ్మూలం కీలకం కాబట్టి, నోటీసులు జారీ చేశారు. కానీ నారాయణ స్వామి తనకు ఆరోగ్యం బాలేదని డుమ్మకొట్టారు. కానీ పోలీసుల్ని ఇంటికి పంపించి.. వీడియో క్వాల్ ద్వారా ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారని సమాచారం. మద్యం కుంభకోణం విషయమై మాజీ మంత్రి మాట్లాడుతూ తనను ఈ కేసులో ఇరికించేందుకు ఇద్దరు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణకు సహకరిస్తానన్నారు. డిజిటల్ లావాదేవీలు మద్యం దుకాణాల్లో వద్దని చెప్పిన మాట నిజమేనని అంగీకరించారు. ఈ స్కాంలో చాలా మంది డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చు కానీ, తాను మాత్రం నిజాయితీగా వ్యవహరించానని చెబుతున్నారు. నారాయణ స్వామి సిట్ అధికారులకు కూడా ఇదే విషయం చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. రాజకీయాలపై అవగాహన ఉన్న నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రిగా తనను బలి చేసి, అందరూ బయటపడే ప్రమాదం ఉందన్న అనుమానంలో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే తనను ఇరికించాలని వైసీపీ నేతలే ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేసులు పెడితే నారాయణ స్వామి ప్రధానంగా బలవ్వాల్సి ఉంటుంది. అందుకే ఆయన కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కావున విజయసాయి రెడ్డి లాగా అప్రూవర్ గా మారి తనను తాను రక్షించుకోవడానికి నారాయణస్వామి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు.
పో రై గంగ 1 నారాయణస్వామి

