20, జులై 2025, ఆదివారం

నేడు సిట్ ముందుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

కీలకంగా మారనున్న నారాయణస్వామి వాగ్మూలం 

నారాయణస్వామి విచారణతో వేగవంతం కానున్న సిట్ విచారణ 

మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిని గుర్తించే ప్రయత్నం 

విచారణలో వేగం పెంచిన సిట్ అధికారులు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

మద్యం ముడుపుల కేసులో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సోమవారం సిట్ ముందుకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆయన వాగ్మూలం కీలకంగా మారబోతోంది. మద్యం ముడుపుల కేసు మరింత ముందుకు వెళ్లడానికి నారాయణస్వామి వాగ్మోలం ఉపయోగపడుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ఆయన పాత్రను గురించి ప్రశ్నించనున్నారు. ఆయన చెప్పే సమాధానం ఆధారంగా తదుపరి విచారణ జరగనుంది. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని నారాయణస్వామి చెప్పే అవకాశం ఉంది. 
అలా చెబితే, మద్యం కుంభకోణం కేసు రూపకల్పనకు ఎవరు కర్త, కర్మ, క్రియ అనే విషయమై తదుపరి విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి సకల శాఖల మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద విచారణ జరిగే అవకాశం ఉంది. నారాయణస్వామి విచారణతో కేసు కీలక మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు.

వైసిపి పాలనలో స్కాం జరిగిన సమయంలో ఆయన ఉప ముఖ్య మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన శాఖలో జరిగిన కుంభకోణం కేసులో నిందితునిగా ఆయన పేరు లేదు. అయితే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామికు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కుంభకోణంపై కూటమి సర్కార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే వరకు 49 మందిని నిందితులుగా చేర్చారు. అందుతో 11 మందిని సిట్ అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తాజాగా శనివారం రాత్రి వైసిపి ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఆయన ముందస్తు బెయిలు కోసం ప్రయత్నం చేసి విఫలం కావడంతో సిట్ ముందు హాజరయ్యారు. సాయంత్రం వరకు విచారణ చేసిన అధికారులు తరువాత అరెస్టు చేశారు.ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఆయన కుమారుడి మోహిత్ రెడ్డి పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 3200 కోట్ల రూపాయలు స్కాం జరిగిందని సిట్ అధికారులు అభియోగ పత్రం సమర్పించి ఉన్నారు. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత సమర్పించిన చార్జి షీట్ లో పలు చోట్ల మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పేరు ఉందని అంటున్నారు. కాగా ఈ కేసులో మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ సిట్ ఏసిబి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది. ఈ కేసులో  ఎ 1గా కాసిరెడ్డి రాజ్ ఉన్నారు. అలాగే వరుసగా దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి, దొడ్డా వెంకట సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయ సాయి రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, బూనేటి చాణక్య,  తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ కె నైఫ్ అహ్మద్ ఎ10 వరకు ఉన్నారు. ఇందులో విజయసాయి రెడ్డి సాక్ష్యం చెప్పి అరెస్టు కాకుండా ఉన్నారు. ఎ 38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరి కొందరు పరారీలో ఉన్నారు.  ఈ నేపధ్యంలో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి చెప్పే సాక్ష్యం కీలకాలంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఆయన తనకు ఏమీ సంబంధం లేదని, తెలియదని చెప్పే అవకాశం ఎక్కువ ఉందని వైసిపి వర్గాలు అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఆయన విచారణకు సహకరించక పోతే సిట్ అధికారులు ఆయన నిందితులతో కుమ్మక్కు అయినట్టు భావించి 50 వ  నిందితునిగా చేర్చినా  చేర్చవచ్చని కూటమి నేతలు వాదిస్తున్నారు. నారాయణస్వామి వాగ్మోలం ఆధారంగా ఈ కేసు దర్యాప్తు మలుపు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా ఏ శాఖకు సంబంధించి ముఖ్య నిర్ణయమైన ఆ శాఖ మంత్రి ఆమోదంతోనే తీసుకుంటారు. లేకుంటే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవచ్చును. ముడుపుల వ్యవహారంలో నారాయణస్వామి తన ప్రమేయం లేదని చెబితే, ముడుపుల కుంభకోణానికి రూపకర్త ఎవరనే విషయం మీద దర్యాప్తు జరగనుంది. వైసీపీ పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా పేరుపొందారు. ఆయన ఏ శాఖకు సంబంధించిన నిర్ణయమైనా తీసుకునేవారు. ఆ నిర్ణయాన్ని సంబంధిత శాఖ మంత్రి అమలు చేసేవారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతిమంగా విధానపరమైన నిర్ణయం తీసుకునేవారు. ఈ విషయంలో ఈ ఇద్దరి ప్రమేయాన్ని కూడా సిట్ పరిశీలించే అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో ముడుపుల కుంభకోణానికి సంబంధించిన ముఖ్య పాత్రధారిని నిర్ణయించే అవకాశం ఉంది. ఫలితంగా ఈ కేసు త్వరగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మద్యం ముడుపుల కుంభకోణానికి సంబంధించి సిట్ శనివారం ప్రాథమిక చార్జి సీటును దాఖలు చేసింది. మరో 20 రోజుల్లో పూర్తిస్థాయి చార్జిషీట్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. 20 రోజుల్లో అంతిమ లబ్ధిదారు పేరును ఖరారు చేయాల్సి ఉంది. అలాగే ఈ కుంభకోణానికి సంబంధించిన ముఖ్య పాత్రధారులు కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి నారాయణస్వామిని సిట్ అధికారులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. మిథున్ రెడ్డికి ఆగస్టు ఒకటి వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ దశలో నారాయణ స్వామి ఏమి చెపుతారు అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *