26, జులై 2025, శనివారం

జీడి నెల్లూరు వ్యవహారంపై అధిష్టానం సీరియస్

ఎవరు మీడియా సమావేశాలు, పత్రిక ప్రకటనలు ఇవ్వద్దని ఆదేశాలు 

అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పార్టీ అధ్యక్షుని హెచ్చరిక 

చిత్తూరులో నిర్వహించగలపెట్టిన విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్న వైనం 

15 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

గంగాధర నెల్లూరు నియోజక వర్గంలోని వర్గ పోరు పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టిని సాధించింది. ఎమ్మెల్యే పీఏ కేంద్రంగా నియోజకవర్గంలోని పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ సందర్భంగా తలెత్తిన వర్గపోరుకు అధిస్థానం తత్కాలికంగా చెక్ పెట్టింది.  ఒకరిపై ఒకరు పత్రికలు, సోషల్ మీడియాలో విమర్శలు చేసుకోరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్ శనివారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. కొందరు శనివారం చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిఏ కి అనుకూలంగా విలేకరుల సమావేశం నిర్వహించాలని ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ అడ్డుకున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తీసేలా ఎవరూ వ్యవహరించ కూడదని ఇరువర్గాల కోరారు. ఇరు వర్గాలను సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, 15 రోజుల్లో అంతా సర్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గత మూడు రోజులుగా  జీడీ నెల్లూరు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ పైన సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో పలు ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం టిడిపి పార్లమెంటు నియోజక వర్గం నాయకుడు గుండయ్య, పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, ఎమ్మెల్యే తమ్ముడు నిధి తదితరులు కలెక్టర్ కు చంద్రశేఖర్ పై ఫిర్యాదులు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఆయనను ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే మీడియా సమావేశంలో తీవ్రస్థాయి ఆరోపణలు చేసారు. దీనిపై సాయంత్రం ఎమ్మెల్యే వర్గీయులు ప్రతి విమర్శలు చేశారు. గుండయ్య ఎమ్మెల్యే పేరు చెప్పి ఆస్తులు కూడబెట్టారని ధ్వజం ఎత్తారు. ఎమ్మెల్యే థామస్ చంద్రశేఖర్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ ఒక వీడియో విడుదల చేసారు. శనివారం ఎస్ ఆర్ పురం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్గీయులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంపై పలు ఆరోపణలకు సిద్ధం అయ్యారు. ఈ వ్యవహారాలు తెలుసుకున్న పార్టీ అధిష్టానం అంతర్గత వివాదాలు నియంత్రించాలని సి ఆర్ రాజన్ కు సూచించింది. ఆయన రంగంలోకి దిగి పరస్పర విమర్శలు చేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని సర్క్యులర్ జారీ చేశారు. ఎవరు మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని ఆదేశించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనితో ఎస్ ఆర్ పురంలో ఎమ్మెల్యే వర్గం తలపెట్టిన మీడియా సమావేశం ఆగిపోయింది. అలాగే చిత్తూరులో నిర్వహించ తలపెట్టిన మీడియా సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు సి ఆర్ రాజన్ అడ్డుకున్నారు. ఏదైనా ఆరోపణలు ఉంటే లఖితపూర్వకంగా తనకు తెలియజేయాలని కోరారు. దీంతో వచ్చిన నాయకులు ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదును జిల్లా పార్టీ అధ్యక్షుడికి అందజేశారు. అయితే పార్టీలో పదవులు లేని కొంత మంది ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలపై విమర్శలు చేస్తూ వీడియోలు పోస్టు చేశారు.

కాగా జి డి నెల్లూరు పార్టీ వ్యవహారాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ, రాబిన్ శర్మ టీమ్ ను అధిస్థానం ఆదేశించినట్టు తీసింది. నియోజక వర్గంలో ఇప్పటి వరకు కమిటీలు వేయక పోవడంపై కూడా ఆరా తీసినట్టు తెలిసింది. నియోజక వర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు పాత్రపై కూడా వివరాలు కోరినట్టు సమాచారం. నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలు, ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు సూచిస్తూ సమగ్ర నివేదిక పంపమని కోరినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సింగపూరు నుంచి రాగానే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ మాట్లాడుతూ ఇరు వర్గాలను సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పి ఏ కి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వారికి నోటీసుల జారీ చేసి వారి వివరణ కూడా తీసుకొని రాష్ట్ర పార్టీకి అందజేస్తామని తెలిపారు. ఈ విషయమై జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తో కూడా మాట్లాడామని అందరిని కలుపుకొని పోవడానికి ఆయన అంగీకరించారని తెలిపారు. దీంతో సమస్య దాదాపుగా పరిష్కారమైందని పేర్కొన్నారు. ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి వారి అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ అధిష్టానానికి నివేదిస్తామని సిఆర్ రాజన్ తెలిపారు. ఎవరు కూడా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవద్దని కోరారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *