అదును పోయాక పడుతున్న వర్షాలు
జిల్లాలో ముందుకు సాగని వ్యవసాయం
భారీగా తగ్గిన వేరుశనగ పంట
అయోమయంలో జిల్లా రైతాంగం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తనం వేసే సమయము గడిచిన తర్వాత చిత్తూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఏం చేయాలో రైతులకు దిక్కుతోచడం లేదు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ జూన్ నెలతో ప్రారంభమవుతుంది. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఎక్కువగా వేరుశనగ పంటను సాగు చేస్తారు. ఈ పంట పూర్తిగా వర్షాధారంగా పండిస్తారు. ఇప్పటికే జిల్లాలో వేరుశనగ విత్తి, కలుపు తవ్వకానికి వచ్చి ఉండాలి. అయితే వర్షాలు లేని కారణంగా జిల్లాలో వేరుశనగ పంట సాగు కాలేదు. మిగిలిన ఖరీఫ్ పంటలు కూడా అంతంత మాత్రమే. అదును పోయిన తర్వాత పడుతున్న ఈ వర్షాలు వల్ల ఉపయోగంలేదని వ్యవసాయ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయ పంటగా గుర్రపు ముల్లంగి వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు.
ఈ ఖరీఫ్ సీజన్ కు చిత్తూరు జిల్లాలో అన్ని రకాల పంటలు 20 వేల హెక్టార్లలో సాగు కావలసి ఉంది. గత సంవత్సరం ఈ తేదీ వరకు 18 వేల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగు అయ్యాయి. ఈ సంవత్సరం 1000 యాక్టర్లలో మాత్రమే పంటలు సాగు అయ్యాయి. జిల్లాలో వేరుశనగ 18 వేల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1200 హెక్టార్లలో మాత్రమే సాగయింది. రాగులు 663 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 37 హెక్టార్లలో, కందులు 642 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 57 హెక్టార్లలో మాత్రమే సాగు అయింది. జిల్లాలో అలసందలు, ఆనుములు, కందులు అసలు సాగు కాలేదు. ఈ పంటలను జూలై మొదటి వారం లోపు వేయాల్సి ఉంది తర్వాత వేయడం వలన పంట ఆలస్యం అవుతుంది. పంట ఓడుపుకునే దశలో వర్షాలు పడకపోవచ్చు ఆ పంట చేతికి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఏం పంట వేయాలో రైతులకు పాలుపవడం లేదు. జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని 32 మండలాల్లో 17వ తారీఖున 37.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 18 వ తారీఖున 24.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. ఈ రెండు రోజులు కలిపి రొంపిచర్ల మండలంలో 117 మిల్లీమీటర్లు, సదంలో 45.8, పులిచర్లలో 142.4, వెదురుకుప్పంలో 96.8, నిండ్రలో 34, విజయపురంలో 65.4, నగరిలో 94.2, కార్వేటినగరంలో 53, పెనుమూరులో 127.2, పూతలపట్టులో 111.8, ఐరాలలో 96.6, సోమలలో 41.6, చౌడేపల్లిలో 20.2, పుంగనూరులో 85.8, పెద్దపంజానీలో 87.2, గంగవరంలో 105.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే తవణంపల్లిలో 113.4 మిల్లీమీటర్లు, ఎస్ఆర్ పురంలో 91.8, గంగాధర నెల్లూరులో 104.2, చిత్తూరు రూరల్ లో 116.2, పలమనేరులో 64.8, బైరెడ్డిపల్లిలో 54.8, వీ. కోటలో 38.4, శాంతిపురంలో 17.2, గుడిపల్లిలో 2.6, కుప్పంలో 1.2, రామకుప్పంలో 11.8, బంగారుపాలెంలో 73.2, యాదమరిలో 71.6, గుడిపాలలో 48.8, పాలసముద్రంలో 39, చిత్తూరు అర్బన్ లో 94.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో అతి తక్కువ వర్షపాతం నమోదయింది.
*39 వేల క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ*
ఈ ఖరీఫ్ సీజన్ కు వ్యవసాయ శాఖ జిల్లాలోని రైతులకు 39 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనములు సరఫరా చేసింది. 26 వేల క్వింటాళ్ల వేరుశనగను జిల్లా వ్యాప్తంగా రైతులకు రైతు సేవ కేంద్రాల ద్వారా సరఫరా చేసింది. ఈ విత్తనం చాలదని అదనంగా వేరుశనగ కావాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదించారు. దీంతో అదనంగా మరో 13 వేల క్వింటాల్లో వేరుసెనగను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విత్తనాన్ని కూడా రైతులకు సరఫరా చేశారు. రైతులు విత్తనాలను సిద్ధం చేసుకుని వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పడాల్సిన సమయంలో వర్షం పడకపోవడంతో జిల్లాలో వేరుశనగ సాగు కాలేదు. రైతులు దుక్కులు దున్ని వరుణ దేవుని కోసం ఎదురుచూస్తూ గడిపారు. సీజన్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వేరుశనగ సాగు చేస్తే పంట ఆలస్యం అవకాశముంది. చివరి దశలో వర్షాలు పడకపోతే పంట చేతికి వచ్చే అవకాశాలు లేవు. గత సంవత్సరం కూడా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురయ్యింది. వేరుశనగ పంట తీసే సమయంలో రెండు నెలల పాటు జిల్లాలో వర్షాలు పడలేదు. దీంతో వేరుశనగ పంట చిత్తూరు జిల్లాలో 90 శాతం దెబ్బతింది. ఈ సంవత్సరం వేరుశనగ విత్తడానికి ముందు రెండు నెలలుగా వర్షాలు లేవు. ఫలితంగా గత సంవత్సరం నష్టపోయిన విధంగానే ఈ సంవత్సరం కూడా వేరుశనగ రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో గత నాలుగు ఐదు సంవత్సరాలుగా సకాలంలో వర్షాలు పడడం లేదు. వేరుశనగ పంట చేతికి రావడం లేదు. ఇందుకు తోడు జిల్లాలో అడవి పందుల బెడద విపరీతంగా ఉంది. వేరుశనగ పంట వేస్తే పంట మొత్తాన్ని గుంపులు గుంపులుగా వచ్చి అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో జిల్లా రైతులు వేరుశనగ వేయడానికి ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న 39 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం వాడే పరిస్థితుల్లో లేదు. ఆ విత్తనాన్ని రైతులు చట్నీలకు, నూనె ఆడించుకోవడానికి వినియోగిస్తున్నారు.

