22, జులై 2025, మంగళవారం

వైసీపీ నేతలు సీట్ నోటీసుల భయం

మద్యం ముడుపుల కేసులో కీలకంగా మారిన చిత్తూరు జిల్లా నేతలు 

మద్యం ముడుపుల సొమ్మును ఎన్నికలలో అభ్యర్థులకు అందజేసినట్లు నిర్ధారణ 

వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు

రాయలసీభలోని వైసీపీ నాయకులకు సిట్ నోటీసుల భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరికి తాఖీదులు అందుతాయోనని గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. పలువురికి కంటికి కునుకు పట్టడం లేదు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మిథున్ రెడ్డి, గోవింద బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన ఇద్దరు పీఏ లు జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారు. మరో పిఏ బాలాజీ కుమార్ కు కూడా సీట్ నోటీసులు జారీ చేసింది. అలాగే మాజీ మంత్రి నారాయణస్వామికి సిట్ నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరు కాలేదు. మద్యం ముడుపుల డబ్బును గత ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు సీట్ గుర్తించింది. ఈ పంపిణీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరుల ద్వారా జరిగిందని గుర్తించింది. ఈ విషయం నిర్ధారణ అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసిపి అభ్యర్థులను భయాందోళనలు నెలకొన్నాయి.


రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కాంలో చిత్తూరు వైసిపి నాయకులు కీలకంగా మారారు. ఈ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన పిఎ బాలాజీ కుమార్ యాదవ్ కు తాజాగా సిట్ నోటీసు జారీ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో జగ్గయ్య పేట వద్ద ఉన్న టోల్ గేటు సమీపంలో ఎన్నికల కమిషన్ పట్టు కున్న రూ 8 కోట్లపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే ఇండోర్లో బాలాజీ అరెస్టు సమయంలో తాము సీజ్ చేసిన రూ. 3.5 లక్షలు లిక్కర్ స్కాం దే అని భావిస్తున్నామని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. లిక్కర్ స్కాంలో రూ 3,200 కోట్ల అవినీతి జరిగిందని, అందులో ఎక్కువ సొమ్ము గత ఎన్నికల్లో పోటీసేసిన వారికి చేరిందని సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిసింది. దీనితో ఆ డబ్బు ఎవరెవరికి ఎంత చేరిందన్న కోణంలో దర్యాప్తు జరిగితే చాలా మంది అభ్యర్థులు కూడా కేసులో ఇరుక్కునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనితో డబ్బు తీసుకున్న వారు, డబ్బు చేరవేసిన వారు భయపడుతూ ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రిమాండ్ విధించడం వల్ల రాజమండ్రి జైలులో ఉన్నారు .ఇప్పటికే 39 మంది నిందితుల్లో 12 మంది  అరెస్టు అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, తుడా మాజీ చైర్మన్ మోహిత్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం హై కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు తీర్పు వెలువడే వరకు  అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై బుదవారం విచారణ జరుగుతుంది.  కాగా జిల్లాకు చెందిన మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె నారాయణ సిట్ విచారణకు గైర్హాజర్ అయ్యారు. సోమవారం విచారణకు రమ్మని సిట్ వాట్సాప్ ద్వారా నోటీసు పంపింది. అయితే తాను రాలేనని స్వామి సిట్ కు తిరిగి మెసేజ్ పెట్టారని తెలిసింది.  సిట్  అధికారులు మళ్ళీ నోటీసు ఇచ్చి నారాయణ స్వామిని విచారిస్తారు. అలాగే ఆయనను కూడా నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసిపి ఐదేళ్ల పాలనలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన వాంగ్మూల కీలకం కానున్నది నిపుణులు భావిస్తున్నారు. అయితే లిక్కర్ స్కాం అన్నదే కల్పితమని నారాయణ స్వామి కొందరు మీడియా వారితో అన్నట్టు వార్తలు వచ్చాయి. అసలు మద్యం కుంభకోణానికి ఆస్కారమే లేదని ఆయన ఖండిస్తున్నారు. కాగా ఇద్దరు వైసిపి నాయకులు తనను కావాలనే మద్యం కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ స్వామి సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ నలుగురి వాంగ్మూలం బట్టి కేసు మలుపు తిరిగే అవకాశం ఉందంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *