24, జులై 2025, గురువారం

థామస్ కు చంద్రబాబు వార్నింగ్ !

వెంటనే మండల కమిటీలు వేయాలని ఆదేశం 

వైసిపి నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత వద్దు

అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి 

ఎమ్మెల్యే పిఏ మీద కలెక్టర్ కు ఫిర్యాదు  

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు సిఎం చంద్రబాబు నాయుడు సున్నితంగా  వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షల నేపధ్యంలో బుధవారం రాత్రి విజయవాడలోని చంద్రబాబు కార్యాలయంలో థామస్ కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఎమ్మెల్యే థామస్ కు క్లాస్ పీకినట్లు సమాచారం. జిల్లా అంతటా మండల పార్టీ కమిటీలు ఏర్పాటు జరిగినా, జీడి నెల్లూరులో ఏర్పాటు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే వైసిపి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, గ్రావెల్, మట్టి ఆక్రమ రవాణా  తదితర విషయాల మీద చర్చ జరిగినట్లు తెలిసింది. అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, వైసిపి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత తగ్గించాలని సూటిగా చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

సమీక్ష నిమిత్తం థామస్ తన పి ఎ చంద్రశేఖర్, హరీష్ యాదవ్, శరవణ, రాందేవ్ లను వెంట తీసుకుని వెళ్లారు. అయితే చంద్రబాబు థామస్ ఒకరినే గదిలోకి పిలిపించుకుని దాదాపు 30 నిమిషాలు మాట్లాడినట్టు సమాచారం. ఏడాది పాలనలో నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా అవసరమైన, చేపట్టవలసిన కార్యక్రమాల జాబితా కోరినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే పనితీరు బాగా లేదని తనకు పలు రిపోర్టులు వచ్చాయని చంద్రబాబు చెప్పారని అంటున్నారు. ప్రధానంగా గ్రావెల్ అక్రమ రవాణా, వైసిపి నుంచి వచ్చిన వారి ఆధిపత్యం లాంటి అంశాలపై సిఎం నిలదీసినట్టు తెలిసింది. పార్టీకి చెందిన కొందరు పనికట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని థామస్ చెప్పే ప్రయత్నం చేసారు. దీనికి చంద్రబాబు అడ్డుపడి తనవద్ద  ఇంటెలిజెన్స్ రిపోర్టులు, అధికారులు పంపిన నివేదికలు ఉన్నాయని హెచ్చరించారు. పార్టీలో సీనియర్ నాయకులను కలుపుకొనిపోవాలని సూచించారు. ఎమ్మెల్యే కంటే పార్టీ సుప్రీం అని, కార్యకర్తలు ముఖ్యమని సీఎం చెప్పారని తెలిసింది. కాగా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలలో పార్టీ మండల కమిటీల ఏర్పాటు జరిగినా జి డి నెల్లూరులో కనీసం ఆ ప్రయత్నం కూడా జరగక పోవడం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెలాఖరులోగా పారదర్శకంగా మండల కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అప్పటికి పూర్తికాకుంటే థామస్ ను పక్కన బెట్టి కమిటీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారని తెలిసింది. ఈ వ్యవహారంలో నియోజక వర్గ పార్టీ పరిశీలకుడు, ఇద్దరు ఎన్నికల పరిశీలకులను థామస్ పట్టించుకోవడం లేదని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. నియోజక వర్గంలో ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులు దూరం అవుతున్నారని, దీనికి కారణం తెలపాలని చంద్రబాబు నిలదీశారు. పార్టీకి వెన్నెముక అయిన కమ్మ సామాజిక సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు అసమ్మతితో ఉన్నారని తెలిపారు. అన్ని వర్గాలను, అందరూ నేతలను కలుపుకుని పోవాలని సూచించినట్టు తెలిసింది. తీరు మారక పోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూడవలసి ఉంటుందని హెచ్చరించి పంపారని తెలిసింది. వివాదాలకు కారణమైన పిఎ చంద్రశేఖర్ ను తొలగించాలని, కొత్తగా వైసిపి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత తగ్గించాలని చంద్రబాబు, థామస్ ను ఆదేశించినట్టు తెలిసింది. అయితే దీనికి కొంత సమయం కావాలని థామస్ కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజక వర్గం తరహాలో జి డి నెల్లూరు నియోజక వర్గంలో కూడా ప్రోగ్రామ్స్ సమన్వయ కర్తను నియమించే అవకాశం లేకపోలేదని రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరు అన్నారు. 

*పి ఏ మిద కలెక్టర్ కు ఫిర్యాదు*

 గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కి ప్రభుత్వం తరపున  పి ఏ గా ఉన్న వ్యక్తిని తొలగించి, అవినీతి, అక్రమాల మిద విచారణ జరపాలని జీడి నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన పి ఏ గా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను చూడాల్సింది పోయి పార్టీ కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇతని మీద విచారణ చేపట్టి ఇతన్ని పిఏ ఉద్యోగం నుంచి తొలగించి, మంచి వ్యక్తిని పి ఏ గా నియమించాలని కోరారు. అతను చీకటి సామ్రాజ్యం నిర్మించుకుని, అన్ని శాఖలలోనూ ప్రభుత్వ అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇతని ఆగడాలు ఈ మధ్య టీవీలు, పేపర్లలో కూడా వచ్చాయని వివరించారు. ఇంతకుముందు ఏ  ఎమ్మెల్యే సహాయకులు ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు. వర్కులలో కూడా పర్సంటేజీలతో వసూలు చేస్తున్నారని, ఇతని  కొనసాగిస్తే   నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం బతకదన్నారు. నాదే పార్టీ అనే విధంగా రాజకీయాలు నడుపుతున్న అతను ఎమ్మెల్యేను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఇతని మీద విచారణ జరిపి అతని వెంటనే  పీఏ ఉద్యోగం నుంచి తొలగించాలని కోరారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *