రేపు నెల నుండి కొత్తగా స్పౌజ్ పెన్షన్లు మంజూరు ?
జిల్లాలో 9,300 మంది వితంతువులకు లబ్ది
మే నెలలో జిల్లాకు 2921 స్పౌజ్ పెన్షన్లు మంజూరు
2019 నుండి స్పౌజ్ పెన్షన్లు మంజురుకు అవకాశం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
స్పౌజ్ పెన్షన్లకు వచ్చే నెల నుంచి మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు సంకేతాలు అందుతున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా కోసం ఎదురుచూస్తున్న వితంతువులకు ఆగస్టు నెల నుంచి ఈ పెన్షన్లు అందే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 9,300 మందికి ఈ పెన్షన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది. దీనిపైన డిఆర్డిఏ అధికారులు గ్రామ సచివాలయాల వారిగా వివరాలను తెప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆగస్టు నెల నుంచి వీరికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను మంజూరు చేయవచ్చని భావిస్తున్నారు.
వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్ల కింద మే 29వ తారీఖున చిత్తూరు జిల్లాకు 2,921 పెన్షన్లను మంజూరు చేసింది. స్పౌజ్ పెన్షన్ అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి మరణిస్తే, ఆ పెన్షన్ ను భార్యకు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2024 అక్టోబర్ నెల తర్వాత మరణించిన పెన్షనర్ భార్యకు మాత్రమే ఈ పెన్షన్ మంజూరు అయ్యింది. ఈ పెన్షన్ ను జూన్ 12వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రోజున వేరే కార్యక్రమాల్లో ఉన్నందున దానిని వాయిదా వేసింది. తదుపరి జులై నెలలో అయినా ఈ పెన్షన్లను ఇస్తారని భావించారు. అయితే ప్రభుత్వం మే నెలలో మంజూరు చేసిన స్పౌజ్ పెన్షన్లను ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంది. అందుకు మంజూరైన డబ్బులు కూడా వెనక్కి వెళ్ళాయి. ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు ప్రభుత్వం 2023 డిసెంబర్ నెల నుంచి పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు స్పౌజ్ పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు డిఆర్డిఏ అధికారులు గ్రామ సచివాలయాల ద్వారా వివరాలను తెప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈ సంఖ్య తొమ్మిది వేల వరకు వచ్చింది. అయితే మరికొందరు ప్రజా ప్రతినిధులు 2019 నుంచి పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు కూడా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి మళ్లీ 2019 నుంచి స్పౌజ్ కింద పెన్షన్లు మంజూరు కానీ వారి వివరాలను కోరింది. దీంతో మరో 300 మంది తేలారు. మొత్తం వివరాలను డిఆర్డిఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు ఆగస్టు నెల నుంచి 9,300 మందికి పెన్షన్ల కింద మంజూరు అవుతాయని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కొత్తగా వితంతు పెన్షన్లను కూడా మంజూరు చేయడం లేదు. గతంలో భర్త చనిపోతే ఆ పింఛన్ ను భార్యకు మరుసటి నెల నుండి అందచేసే వారు. ప్రస్తుతం కొత్త పింఛన్ల మాటను కూటమి ప్రభుత్వం మర్చిపోయింది. గతంలో ఉన్న లబ్ధిదారులకే పింఛన్లు అందజేయడంలోనే నిమగ్నమై ఉంది. దీంతో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సామాజిక పించన్ల కారణంగా చిత్తూరు జిల్లాలో 2,68,820 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి ప్రతి 113 కోట్ల రూపాయలను అందచేస్తున్నారు. వీరికి ఏప్రిల్ నెల నుంచి పింఛన్ మొత్తలను కూటమి ప్రభుత్వం పెంచింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కార్మికులు, కళాకారులు, హెచ్ఐవి భాదితులు, హిజ్రాలు, చెప్పులు కుట్టే వారికి మూడు వేల రూపాయల నుంచి 4వేల రూపాయలుగా పెంచారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి లెక్కగట్టి, జూలైలో ఒకేసారి ఏడువేల రూపాయలుగా అందజేశారు. అలాగే దివ్యాంగులకు 3000 ఉన్న పెన్షన్ ను 4000 రూపాయలు చేశారు. కుష్టు వ్యాధితో వైకల్యం సంభవించిన వారికి పెన్షన్ కూడా 3వేల నుంచి 6 వేలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె అపరేషన్ చేసుకున్న వారికి, డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలసరి పింఛన్ 5000 నుంచి 10000 రూపాయలకు పెంచారు. మంచానికే పరిమితమైన వారికి పింఛన్ 5000 నుండి 15 వేలకు పెరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన సందర్భంగా ఎన్ టి ఆర్ భరోసా పేరుతో అందచేస్తున్నారు. వీరిలో అభయ హస్తం అందుకుంటున్న 11,358 మందికి, సైనిక వెల్ఫేర్ పింఛన్లను అందుకుంటున్న 62 మందికి ఈ పించన్ల పెంపు వర్తించలేదు. మిగిలిన 2,61,554 మందికి పింఛన్ మొత్తాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం పాత పింఛన్దారులకు పింఛన్ మొత్తాలను పెంచి అందజేయడం పట్ల పింఛన్దారులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్దారులను నిర్లక్ష్యం చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తను కోల్పోయిన వితంతువులు తమకు పింఛన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. భర్త లేకపోవడంతో తమకు జీవనాధారం లేకుండా పోయిందని, తమను ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా ప్రమాదాలలో వికలాంగులైన వారు, ఒంటరి మహిళలు ఆవేదన చెప్పనలివి కావడం లేదు. పించన్ కోసం ప్రతి నెలా ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చివరకు స్పందించి స్పౌజ్ పెన్షన్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఇందువల్ల దీర్ఘ కాలంగా పించన్ కోసం ఎదురుచూస్తున్న వితంతువులకు ఉపసమనం కలగనుంది.

