ఎమ్మెస్ బాబు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారా?
ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో కనిపించని బాబు
పిసిసి అధ్యక్షురాలు సమావేశానికి కూడా డుమ్మా
నియోజకవర్గంలో జరగని మండల పార్టీ అధ్యక్షులు నియామకం
నూతన ఇన్చార్జి కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషణ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు క్రమంగా ఆ పార్టీకి కూడా దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల చిత్తూరుకు విచ్చేశారు. చిత్తూరులో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కూడా ఎమ్మెస్ బాబు హాజరు కాలేదు. సమావేశానికి సంబంధించిన సమాచారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ బాబుకు తెలిపినా, సరైన విధంగా స్పందించలేదని తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తిరిగి వైసిపి గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను పూతలపట్టు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ప్రకటించినా, ఎన్నికల తర్వాత నియోజక వర్గానికి ముఖం చాటేశారు. ఏనాడు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు. మండల పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేపట్టలేదు. దీంతో ఎమ్మెస్ బాబు క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందు వైసిపిలో ఉంటూనే రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మరో సరి వైసిపిలో టిక్కెట్టు ఎవ్వకపోవడం మీద ఎం ఎస్ బాబు ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర స్థాయిలో విరచుకపడ్డారు. దళిత నియోజకవర్గాల్లో జరుగుతున్న మార్పులు, చేర్పులపై విమర్శల వర్షం కురిపించారు. తనకు టిక్కెట్టు నిరాకరించడం మీద స్పందిస్తూ.. తాను చేసిన తప్పేంటో సీఎం జగన్ చెప్పాలన్నారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ను కలిసినప్పుడు తనపై వ్యతిరేకత ఉందని చెప్పారని, ఓడిపోయే చోట కూడా ఓసీలను అలాగే ఉంచుతున్నారన్నారు. మంత్రులు, పార్టీ పెద్దలు చెప్పినట్లు పనిచేశానని.. జగన్ చెప్పింది చేశాను.. ఇప్పుడు తన తప్పు అంటే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్లలో ఎప్పుడైనా సీఎం జగన్ పిలిచి మాట్లాడారా అని ఎంఎస్ బాబు ప్రశ్నించారా? దళితులకు జగన్ ఏం న్యాయం చేశారు? దళిత ఎమ్మెల్యేలు అంటే చిన్నాచూపా అని నిలతీశారు. ఇప్పుడు తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. ఐప్యాక్ వాళ్లకు డబ్బులు ఇస్తే సర్వే రిపోర్టు మార్చేస్తున్నారని, జగన్ చెప్పకముందే తాను గడప గడపకు తిరిగానన్నారు. ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ఈసారి పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లా ఓసీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్న ఎందుకు మార్చలేదనీ నిలతీశారు. డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారనీ, గత ఎన్నికలలో ఐప్యాక్ సర్వే ఇస్తేనే తనకు టికెట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ నమ్మకం ఉందన్నారు. పార్టీ వీడే ప్రసక్తే లేదని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉందని.. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాననీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎం ఎస్ బాబుకు అధికార పక్షం నుండి సరైన సమాధానం రాలేదు. పైగా అవమానాలు, అవహేళనలు ఎదురయ్యాయి. నియోజకవర్గంలో బాబుకు ఒక వర్గం ఉంది. అలాగే నియోజకవర్గంలో బాబును వ్యతిరేకించే బలమైన వర్గం కూడా ఉంది. బాబుకు వ్యతిరేక వర్గం బహిరంగంగా పత్రికలకు ఎక్కారు. బాబు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనకు టిక్కెట్టు ఇస్తే పార్టీకి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అధిష్టానం ఎం ఎస్ బాబును పక్కన పెట్టి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టిక్కెట్టు ఇచ్చింది. దీంతో ఎమ్మెస్ బాబు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో నియోజకవర్గ రాజకీయం మలుపుతిరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావించారు. పి సి సి అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె బాబుకు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికలలో అయన పూతలపట్టు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేశారు. ఎన్నికలలో ఊహించిన విధంగా ప్రభావాన్ని చూపలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన తెలుగుదేశం గాలి కారణంగా టిడిపి అభ్యర్థి మురళీమోహన్ విజయం సాధించారు. ఎమ్మెస్ బాబు మూడవ స్థానానికి పడిపోయారు. ఎన్నికలలో ఓడిపోయిన నాటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా మండల పార్టీ అధ్యక్షులను నియమించాలని అధిష్టానం ఆదేశించింది. జిల్లాలోని అన్ని మండలాల్లో మండల పార్టీ అధ్యక్షుల నియామకం జరిగినా, పూతలపట్టు నియోజకవర్గంలో మాత్రం జరగలేదు. దీంతో నియోజకవర్గ నూతన ఇన్చార్జి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్వేషిస్తున్నారు.

