వైసీపీ నాయకులను వెంటాడుతున్న కేసుల భయం
వరుసగా నమోదు అవుతున్న ఎఫ్ఐఆర్ లు
ఇప్పటికీ 14 మంది మీద కేసులు నమోదు
మాజీ ఎమ్మెల్యే సునీల్, చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద రెడ్డి మీద కూడా
మరి కొందరి మీద భారీగా కేసులు నమోదయ్యే అవకాశం
అజ్ఞాతములకి పోతున్న వైసీపీ నాయకులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
పోలీసుల ఆంక్షల మధ్య ఈనెల తొమ్మిదవ తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన జరిగింది. మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చిన నేపథ్యంలో బంగారు పాల్యంలో భారీగా బల ప్రదర్శన చేశారు. జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన తర్వాత బెంగళూరు ప్యాలస్ కు చేరుకున్నారు. చిత్తూరు జిల్లాలోని వైసిపి నాయకులపై ఆరోజు సాయంకాలం నుంచి పోలీసు కేసుల నమోదు ప్రారంభమైంది. పోలీసుల ఆజ్ఞలను ఉల్లంఘించి భారీగా జన సమీకరణ చేయడం, మామిడికాయలను రోడ్డుమీద పారబోసి, తొక్కించడం, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ని దారి మళ్లించడం, పోలీసులను బెదిరించడం, వారి విధులకు ఆటంకం కలగజేయడం వంటి కారణాలతో ఇప్పటికే నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. ప్రస్తుతానికి 14 మంది మీద కేసులు నమోదు చేశారు. నిందితుల జాబితాలో మరి కొంతమందిని చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంఖ్య ఎంత అన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు అరెస్టులు ప్రారంభం కాలేదు. కేసులు అన్ని దర్యాప్తు దశలో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి భారీగా అరెస్టులు జరిగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున వైసీపీకి చెందిన కొంతమంది నేతలు ఇప్పటికే అజ్ఞాతవాసంలోకి వెళ్లినట్లు సమాచారం.
జగన్ పర్యటన సందర్భంగా షరతులు ఉల్లంఘించారని పలువురు వైసిపి నాయకులపై బంగారుపాళ్యం పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసిపి పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ ఎం.బి. కుమార్‌రాజా, మండల వైసీపీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు గజేంద్ర తదితరులపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆంక్షలను ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అన్న ఆయన కాన్వాయ్ ని పోలీసులు నిర్దేశించిన దారిలో కాకుండా వేరే దారి మళ్ళించడం, పోలీసులతో వాగ్వివాదానికి దిగడం, జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పించడం, మామిడి మార్కెట్ యార్డులో మూడు వేల వరకు ప్రజలను సమీకరించడం, ఉద్దేశపూర్వకంగా బంగారు పాల్యంలో పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడం వంటి నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆకస్మికంగా రోడ్డుపైన 5 ట్రాక్టర్ల మామిడికాయలను పారబోసి, వాటిని తొక్కించడం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం తదితర కారణాలతో తుంబపాలెంకు చెందిన న్యాయవాది దేవేంద్ర, తిమ్మాజిపల్లికి చెందిన ప్రకాష్ రెడ్డి, ఆయన కుమారుడు భగత్ రెడ్డి, ట్రాక్టర్ డ్రైవర్లు అక్బర్, ఉదయ్ మరికొంత మంది మీద కేసును నమోదు చేశారు. ఈ కేసులో న్యాయవాది దేవేంద్రను, డ్రైవర్లు అక్బర్ ఉదయ్ లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటనలు మీడియా ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన దాడికి సంబంధించిన విషయంలో పలువురి మీద ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇప్పటికే గంగాధర నెల్లూరుకి చెందిన వినోద్ కుమార్, మోహన్, చిత్తూరు చెందిన చక్రి, వీకోటకు చెందిన శంకరాచారి లను గుర్తించారు. ఇందులో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని గుర్తించే కార్యక్రమం జరుగుతోంది. జగన్ పర్యటనలో పోలీసులతో వాదించి పోలీసులను నెట్టుకొని లోనికి ప్రవేశించిన కేసులో చిత్తూరుకు చెందిన వైసీపీ నేత విజయానంద రెడ్డి, మరికొందరి పైన కేసును నమోదు చేశారు. వీరు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులను రప్పా, రప్పా నరుకుతామని బెదిరించడం, బారికెట్లు తోసుకొని హెలిపాడ్ లోకి ప్రవేశించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జగన్ పర్యటన పూర్తయిన తర్వాత వైసీపీ నాయకుల్లో కేసుల భయం ప్రారంభమైంది. పోలీసులు వరుసగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారు తొమ్మిదవ తారీఖున మూడు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, తర్వాత మరో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఈ కేసులో చిత్తూరుకు చెందిన వైసిపి ఇన్చార్జి విజయానందరెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. మరి కొంతమందిని ఈ కేసులో చేర్చే అవకాశం ఉంది. హెలిపాడ్ దగ్గర 30 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే భారీకేట్లను ఛేదించుకొని, పోలీసుల వలయాన్ని తోచుకుని 500 పైగా కార్యకర్తలు హెలిపాడ్ లోకి ప్రవేశించారు. ఈ సమయంలో పోలీసులకు, వైసీపీ నాయకులకు తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. కొందరు పోలీసులను తోసుకొని హెలిపాడ్ లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా డిఎస్పకి, చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద రెడ్డికి తీవ్రస్థాయిలో వాగ్వి వాదం జరిగింది. కొందరు డిఎస్పిని రప్పా, రప్పా నరుకుతామని హెచ్చరించారు. తోపులాటలో విజయానంద రెడ్డి, ఒక కానిస్టేబుల్, ఒక మహిళ కింద పడిపోయారు. హెలిపాడ్ నుంచి జగన్ కాన్వాయ్ రూట్ ను కూడా స్థానిక నాయకులు మళ్ళించారు. ఆధారిలో మామిడికాయలను రోడ్డు మీద పోసి తొక్కించారు. కావున కాన్వాయ్ ని ఆ దారిలో మళ్లించారు. అలాగే మామిడికాయల మార్కెట్ యార్డులో 500 కార్యకర్తలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే వైసిపి కార్యకర్తలు ప్రహరీ గోడ దూకి, పోలీసులను తోసుకొని మార్కెట్ యార్డులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పోలీసులకు వైసీపీ నాయకులకు తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. తమ వాహనాలను లోనికి అనుమతించలేదని వైసిపి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసులతో గొడవపడ్డారు. అలాగే వార్తల కవరేజ్ కెళ్ళిన ఫోటోగ్రాఫర్ పైన దాడి జరిగింది వీటన్నిటిని పోలీసులు వీడియో కెమెరాల ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా 14 మంది మీద ప్రస్తుతం కేసులు నమోదు చేసినా, భవిష్యత్తులో భారీగా కేసులలో నిందితులను చేర్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కొంతమంది వైసీపీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. కేసుల విషయంలో ముందస్తుగా ఏం చేయాలో వారి లాయర్లతో సంప్రదిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం భారీగా వైసిపి నాయకుల మీద కేసుల నమోదు చేసే అవకాశం ఉంది. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించిన, పోలీసులతో వాదానికి దిగిన, పోలీసులను బెదిరించిన, పోలీసులను నెట్టుకొని లోపలికి వెళ్లిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

