సిట్ విచారణకు నారాయణస్వామి డుమ్మా
అజ్ఞాతంలోకి మాజీ మంత్రి
వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతో హాజరుకాలేనని సమాచారం
తదుపరి ఎప్పుడు హాజరయ్యేది సమాచారం ఇవ్వని మాజీ మంత్రి
అధిష్టానం ఆదేశాలతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విమర్శలు
కేసును సాగదీయడం, దర్యాప్తుకు ఆటంకాలు కలుగజేయడమే ముఖ్య ఉద్దేశం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన కే నారాయణస్వామి సోమవారం సిట్ విచారణకు హాజరు కాలేదు. ఆయన ఫోన్లను ఇంటి వద్ద నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. నారాయణ స్వామి సిట్ అధికారులకు తాను సోమవారం విచారణకు హాజరు కాలేనని తెలియజేశారు. అయితే, తాను ఎప్పుడు విచారణకు హాజరయ్యేది తెలియజేయలేదు. దీంతో అధిష్టానం ఆదేశాల ప్రకారం మద్యం ముడుపుల కేసును మరింతకాలం సాగదీయడానికి నారాయణస్వామి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నలుగురు లాయర్లు నారాయణస్వామితో కేసు విషయాలను చర్చించినట్లు సమాచారం. అనంతరం నారాయణస్వామి విచారణకు డుమ్మా కొట్టి తన ఫోన్లను ఇంటి వద్దనే వదలి ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, నారాయణస్వామి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇంటి నుంచి బయటకు వెళ్లారని, ఆయన ఆధీనంలోనే ఉన్నారని వేరొ ఫోన్లో జగన్మోహన్ రెడ్డితో టచ్ లో ఉన్నారని టిడిపి నేతలు అంటున్నారు. కేసులో నారాయణస్వామి వాంగ్మూలం కీలకం కావడంతో ఆయనను వ్యూహాత్మకంగా సిట్ ముందుకు హాజరు కాకుండ వైసీపీ నాయకులు పథకం పన్నారని అంటున్నారు. నారాయణస్వామి హైదరాబాద్ లేక బెంగళూరులో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామికి మూడు రోజుల క్రితం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అయితే, అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్ అధికారులకు సమాచారం అందజేశారు. వాస్తవానికి సోమవారం మాజీ మంత్రి నారాయణస్వామి సిట్ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఆయన విచారణకు రాలేనని సిట్ అధికారులకు సమాచారమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన ప్రమేయం లేకుండానే నూతన మద్యం పాలసీని రూపొందించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన పాత్ర ఏమీ లేదని దర్యాప్తులో తేలడమే కారణం. అందుకే మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా స్టేట్ మెంట్ ఇవ్వాలని మాజీ మంత్రి కె.నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం ముడుపుల కేసులు వీలైనంత త్వరగా ఒక కొలిక్కి తేవాలని సిట్ భావిస్తుంది. ఈ క్రమంలోనే నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తోంది. సోమవారం విచారణకు రావాలని మాజీమంత్రి వైసీపీ నేత నారాయణస్వామికి నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఈ కేసుల్లో నారాయణస్వామి వాంగ్మూలం చాలా కీలకంగా మారనుంది. మద్యం కుంభకోణం జరగలేదని నారాయణస్వామి సిట్ అధికారుల ముందు చెబితే, ఆ కుట్రలో ఆయనకు కూడా భాగస్వామి అని ఆయన మీద కేసు నమోదు చేసి, అరెస్టు చేసే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం జరిగిందని చెబితే వైసీపీకి చెందిన నేతలు, అధికారులు జైలుకెళ్లే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి వాంగ్మూలం అత్యంత ముఖ్యం. నారాయణస్వామి ఏం చెప్పినా, దానిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సిట్ అధికారులు సమాయత్తంగా ఉన్నారు. అందుకోసమని నారాయణస్వామిని సిట్ అధికారుల ముందు నోరు విప్పకుండా ఆయనను విచారణకు వెళ్లకుండా అధిష్టానం ఆదేశించిందని టిడిపి నేతలు భావిస్తున్నారు. సోమవారం విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనారోగ్యంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నారాయణస్వామికి మరోసారి సీట్ నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. వైసిపి హయాంలో అయిదు సంవత్సరాలు ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగారు. మద్యం పాలసీపై క్యాబినెట్ నిర్ణయాల వంటి అంశాలపై ఆయన్ని సిట్ ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉన్నట్లుండి స్వామి విచారణకు హాజరు కావడంతో రకరకాలుగా ఉహిస్తున్నారు. స్వామికి మూడు రోజులకు ముందే సిట్ నోటీసులు ఇచ్చింది. పార్టీ నుంచి ఆయనకి అందిన ఆదేశాల కారణంగా విచారణకు వెళ్లలేదని మరికొందరు అంటున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఈ కేసులో 48 మందిని సిట్ నిందితులుగా చేర్చారు. సిట్ అధికారులు కేవలం 12 మందిని మాత్రమే అరెస్టు చేశారు. మరో ఎనిమిది మంది విదేశాల్లో ఉన్నారు. మరో 28 మందిని ఈ లోగా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ 28 మందిలో నేతలు, అధికారులు ఎవరైనా ఉన్నారా అని వైసిపి నేతలు భయపడుతుయన్నారు. నేతలు కాకుండా కసిరాజుకు చెందిన వారు కూడా ఉన్నారనేది భావిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పాత్ర ప్రశ్నార్థకగా మారింది. ఆయన ఈ కేసులో అప్రూవల్ గా మారినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన వివరాల మేరకు కసిరాజ్ రెడ్డి, మిధున్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈమధ్య విచారణకు రావాలని విజయసాయి రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కొన్ని సమస్యలు కారణంగా ఇప్పుడు రాలేరని, తర్వాత వస్తానని ఆయన తెలిపారు. ఈసారి విచారణలో విజయసాయిరెడ్డి ఇంకెన్ని కొత్త విషయాలు బయటపెడతారో అని వైసిపి నాయకులు భయపడుతున్నారు. సాయి రెడ్డి మాత్రం అరెస్టు నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. నారాయణస్వామిది విచిత్రమైన పరిస్థితి. ముడుపుల కుంభకోణం విషయంలో నారాయణస్వామి పాత్ర లేదని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఆయన చెప్పే సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు మలుపు తిరిగే అవకాశం ఉంది. అలాగే ఈ కేసును వేగవంతంగా ముగించే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ కేసును జాప్యం చేయడం, కేసు దర్యాప్తులో ఆటంకాలు కలుగచేయడానికి ఉద్దేశపూర్వకంగా నారాయణస్వామి విచారణకు డుమ్మాగొట్టినట్లు తెలుస్తోంది.

