14, జులై 2025, సోమవారం

ఈ కేవైసీ అయిన రైతులకే రూ. 4 ఇన్ పుట్ సబ్సిడీ

ఈ క్రాప్ లో మామిడి నమోదయి ఉండాలి 

ఆధార్, ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉండాలి 

20 రోజుల్లో ప్రభుత్వం ప్రకటించిన ఇన్ ఫుడ్ సబ్సిడీ విడుదల

ఈ కేవైసీ చేసుకొని రైతులకు కొంత ఆలస్యం 

కౌలు రైతులకు ఇన్ పుట్  సబ్సిడీ లేనట్లే

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.


మామిడికాయలను కోసి ఫ్యాక్టరీలకు తరలించిన కొంతమంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహపు ధర నాలుగు రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో పడాలంటే ఆ రైతు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకుని ఉండాలి. ఈ క్రాప్ లో అతనికి మామిడి తోట ఉన్నట్టు నమోదు కావాలి.ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్  అనుసంధానం కావాలి. ఇలా అయితేనే ఆ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయల ప్రోత్సాహపు ధర బ్యాంకు అకౌంట్లో పడుతుంది. లేకుంటే ఆ రైతుకు సంబంధించి పంట వివరాలను గ్రామ, మండల స్థాయి అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా ధ్రువీకరించిన తర్వాత ఈ కేవైసీ చేసుకోని రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహపు ధర జమ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో సుమారుగా 20 శాతం మంది రైతులు ఈ కేవైసీ, ఈ పంట నమోదు చేసుకోలేదని సమాచారం.

చిత్తూరు జిల్లాలో క్రమంగా ఉద్యానవన పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు సకాలంలో వర్షాలు పడకపోవడం, కూలీలు లభించకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో సాంప్రదాయ పంటలైన వరి, చెరకు వేరుశనగ, ఇతర చిరుధాన్యాలు పండించడానికి రైతులు ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన పంటలకు భారీగా సబ్సిడీ ఇస్తుండడంతో రైతులు మామిడి, జామ, అల్లనేరేడు, డ్రాగన్ ఫ్రూట్, కూర కాయలు, పూల మొక్కల పెంపకం వంటి పంటల వైపు ఆకర్షితులు ఆవుతున్నారు. వీటికి నీటి అవసరం పెద్దగా ఉండదు. వారం పది రోజులకు ఒకసారి నీటిని కట్టితే సరిపోతుంది. ఈ పంటలకు నీటిని కట్టడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ వేసుకున్న రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలను అందజేస్తుంది. దీంతో చిత్తూరు జిల్లాలో మామిడి పంటను విస్తారంగా రైతులు వేశారు. సుమారుగా ఒక లక్ష 50 వేల ఎకరాలలో మామిడి పంట ఉందని ఉద్యానవన శాఖ అంచనా. ఈ సంవత్సరం మామిడి పంట ఐదు లక్షల టన్నులు దిగుబడి రావచ్చని అంచనా వేశారు. ఈ మామిడికాయలను ప్రాసెస్ చేయడానికి చిత్తూరు జిల్లాలో 27 జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ దిగుబడి రావడం, గతంలో ప్రాసెస్ చేసిన మామిడి పల్ప్ నిల్వ ఉండడంతో మామిడికాయలను తీసుకోవడానికి జ్యూస్ ఫ్యాక్టరీలు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయల మద్దతు ధరలు ప్రకటించింది. ఇందులో ఎనిమిది రూపాయలు జ్యూస్ ఫ్యాక్టరీలు అందచేస్తాయిని, నాలుగు రూపాయలు అదనంగా ప్రోత్సాహపు ధరగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని పేర్కొంది. ఈ మేరకు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలలో ర్యాంపులలో ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రైతులు మామిడిని సరఫరా చేసిన తర్వాత ఎంత సరఫరా చేసింది, రైతు వన్ బి, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డులను తీసుకున్నారు. వాటిని మదింపు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రైతులు ఇచ్చిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం తమ వద్దనున్న వివరాలను సరిపోల్చమని జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో రైతుల సర్వే నంబర్ ఆధారంగా ఆ రైతు పొలంలో ఏ పంట చేసింది ఇదివరకే ప్రభుత్వం ఈ క్రాప్ ద్వారా నమోదు చేసింది. గతంలో వాలంటీర్లు ఈ పంటను నమోదు చేయగా, కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వాటిని మరోసారి చేయించింది. రైతులను తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ విషయాన్ని గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. రైతు సేవా కేంద్రాలలో రైతులకు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తూ ఈ కేవైసీ చేశారు. అలాగే రైతు పొలంలో ఏ పంట ఉన్నది నమోదు చేశా.రు కొంతమంది రైతులు స్థానికంగా లేకపోవడంతో ఈ కేవైసీ చేయించుకోలేదు. అలాగే ఈ పంట కూడా సక్రమంగా నమోదు కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయల ప్రోత్సాహపు ధర రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసే విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మొదటి విడతగా ఈ కేవైసీ చేసుకున్న, ఈ పంటలో మామిడి పంట నమోదైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయల ప్రోత్సాహపు ధర వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన రైతులకు సంబంధించిన పంట వివరాలను వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, రైతు సేవా కేంద్రం అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారి, మండల తహసిల్దార్ ధ్రువీకరించాల్సి ఉంది. వీరు ధ్రువీకరించిన తర్వాత ఆ జాబితాను జిల్లా కలెక్టర్ ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహపు ధర జమ కావడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలాగే కౌలు రైతులకు తమ ఖాతాలలో నగదు జమ అయ్యే అవకాశం లేదు. కొందరు వ్యాపారస్తులు రైతుల వద్ద మామిడి పంటను తోపుల మీదనే కొనుగోలు చేశారు. వారికి కూడా వారి ఖాతాలో ప్రోత్సాహపు ధర జమ కాదు. ఆ భూమికి సంబంధించిన రైతు ఖాతాలో మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన మొత్తం జమ చేస్తారు. ఇప్పటివరకు జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలు, ర్యాంపుల ద్వారా మూడు లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేశారు. 60,781 మంది రైతులు తమ తోటల్లోని మామిడిని సరఫరా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఈ కేవైసీ, ఈ క్రాప్ నమోదు వంటి వివరాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందచేస్తున్నారు. మరో 20 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయల మామిడి ప్రోత్సాహపు ధర రైతుల బ్యాంకు ఖాతాలను జమయ్యే అవకాశం ఉంది. ఈ కేవైసీ చేయించుకొని, ఈ క్రాప్ లో మామిడి నమోదు కానీ రైతులకు సంబంధించి మొత్తాలు కొంత ఆలస్యంగా వారి ఖాతాలో జమ కానున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *