జీడి నెల్లూరులో తారా స్థాయికి చేరిన వర్గ పోరు
కలెక్టర్ ను కలిసి ఎమ్మెల్యే పిఏకి వ్యతిరేకంగా ఒక వర్గం ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన వర్గాన్ని స్వార్థపరులుగా వర్ణించిన ఎమ్మెల్యే థామస్
రెండు వర్గాలుగా చీలిపోయిన నియోజకవర్గ టిడిపి పార్టీ
అమీ తుమి తెలుసుకోవడానికి సిద్ధమవుతున్న ఇరువర్గాలు
బజారున పడుతున్న పార్టీ పరువు మర్యాదలు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపిలో వర్గపోరు తారస్థాయికి చేరుకున్నది. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, ఆయన వ్యతిరేక వర్గం ఒకరిపై ఒకరు ప్రత్యక్ష పోరుకు సిద్ధం అయ్యారు. అమీ తుమీ తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే పిఏగా పనిచేస్తున్న చంద్రశేఖర్ మీద పలు అవినీతి ఆరోపణలు చేశారు. తక్షణం ఆయనను బదిలీ చేయాలని, లేకుంటే సస్పెండ్ చేసి అతని ఆస్తుల మీద విచారణ జరిపించాలని కోరారు. తనకు పీఏగా పనిచస్తున్న చంద్రశేఖర్ ను గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వెనకేసుకొచ్చారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఆయన వచ్చిన తర్వాత పనులు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయని కొనియాడారు. కొంతమంది స్వార్థపరులు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం తన మీద, తన పీఏ ల మీద జిల్లా అధికారులకు, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు.
శుక్రవారం నియోజక వర్గానికి చెందిన దాదాపు 50 మంది టిడిపి నాయకులు చిత్తూరులో జిల్లా కలెక్టర్ ను కలసి థామస్ పి.ఎ. చంద్రశేఖర్ మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. హరీష్ యాదవ్, శరవణ, రామ్ దేవ్ లతో కలసి పి.ఎ. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రశేఖర్ ఎమ్మెల్యే పేరు చెప్పి లక్షలు సంపాదిస్తున్నారని, కాంట్రాక్టర్లు, ఉద్యోగార్థులు, పనుల కోసం వచ్చే వారి నుంచి డబ్బు దండుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఒక సారి నియోజక వర్గం పర్యటనకు వస్తే పి ఎ రెండు లక్షలు సంపాదిస్తారని ఆరోపించారు. ఉపాధి హామీ పనులలో, గోకులం షెడ్ల నిర్మాణంలో నియోజకవర్గంలో జరిగిన మండల స్థాయి అధికారుల బదిలీల్లో ఎమ్మెల్యే పేరు చెప్పి భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రకృతి వనరులు భారీగా దోపిడీకి గురవుతున్నాయని, ఇందువల్ల తమ పార్టీకి శాసనసభ్యునికి చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వద్ద పనిచేసిన ఆయన కోవర్టులా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రశేఖర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని లేదా బదిలీ చేయాలని కోరారు. అలాగే, ఆయన అక్రమ ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ను కలసిన వారిలో టిడిపి పార్లమెంటు ఎస్సీ విభాగం అధ్యక్షుడు గుండయ్య, పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, ఎమ్మెల్యే తమ్ముడు నిధి, పెనుమూరు మాజీ ఎంపిపి వి హరిబాబు నాయుడు తదితరులు ఉన్నారు.
*పి ఎ చంద్రశేఖర్ నిజాయితీ పరుడు: థామస్*
తన పి ఎ చంద్రశేఖర్ పై చాలా నిజాయితీ పరుడని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ కితాబు ఇచ్చారు. ఆమేరకు మీడియాకు విడుదల చేసిన వీడియోలో చంద్రశేఖర్ పని తీరును ప్రశంసించారు. గత ఎనిమిది నెలల నుంచి తన వద్ద పి.ఎ. గా ఉన్న ఆయనపై ఇంత వరకు ప్రజలు ఒక ఆరోపణకూడ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన ప్రతి పని పద్ధతి ప్రకారం చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు నియోజక వర్గం ప్రజలనుంచి 1500 కు పైగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అన్నింటిని క్రోడీకరించి ఆయా శాఖలకు పంపామని తెలిపారు. చంద్రశేఖర్ పైన అవినీతి ఆరోపణలు ఉంటే సాక్షాలతో తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తాను వెంటనే పీఏ పైన చర్యలు తీసుకుంటానని థామస్ హామీ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పార్టీకి, తనకు చెడ్డ పేరు తీసుకువచ్చే వారిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన గతంలో వైసిపి ఎమ్మెల్యే వద్ద పనిచేశారని చెప్పారు. మంత్రుల వద్ద పనిచేసే ఓ ఎస్ డి లలో పలువురు గతంలో వైసిపి మంత్రుల వద్ద పనిచేశారని తెలిపారు. దీనిని తప్పు పట్టడం మూర్ఖత్వం అన్నారు. పార్టీలో కొందరు నాయకులు చంద్రశేఖర్ పై కలెక్టర్ కు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని చెప్పారు. కాగా వాట్సాప్ గ్రూపుల్లో ఎమ్మెల్యే వర్గీయులు అసమ్మతి నేతలపై పలు ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. గుండయ్య ఎమ్మెల్యే పేరు చెప్పుకుని తిరుపతిలో మూడు అంతస్తుల మేడ కట్టారని, ఆయన భార్యను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించుకున్నారని ధ్వజం ఎత్తారు.
*వర్గపోరు బహిర్గతం*
గత కొద్ది కాలంగా నియోజక వర్గం టిడిపిలో వర్గ పోరు కొనసాగుతోంది. టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి మండలంలో పార్టీ ఎమ్మెల్యే అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం కనిపిస్తోంది. దీనితో మండల కమిటీల ఎన్నికలు కూడా నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి వరకు నియోజకవర్గ పార్టీలోని పోరు అంతర్గతంగా జరిగింది. శుక్రవారంతో ఈ వర్గ పోరు కాస్త బహిర్గతమైంది. ఒక వర్గం జిల్లా కలెక్టర్ ని కలిసి ఎమ్మెల్యే పి ఏ మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు మరో వర్గం ఫిర్యాదు చేసిన వర్గం లక్ష్యంగా సామాజిక మాధ్యమంలో ఎదురు దాడికి దిగింది. జిల్లా కలెక్టర్ ను కలిసిన నాయకులందరూ స్వార్థపరులు, అవినీతిపరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలు సై అంటే సై అనే పరిస్థితికి చేరుకున్నాయి. కాగా పెనుమూరుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఎప్పటి కప్పుడు నియోజక వర్గం పరిస్థితులు అధిష్టానం దృష్టికి తీసుకుని వెళుతున్నట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం చంద్రబాబు, థామస్ ను పిలిచి నియోజక వర్గం పరిస్తితులను సమీక్షించారు. నియోజక వర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని పార్టీని పటిష్ట పరచాలని సూచించారు. చంద్రబాబు సూచించిన రెండు రోజులలోనే నియోజకవర్గ పార్టీ నిట్టనిలువునా రెండు వర్గాలుగా చెలిపోయింది. ఒకరి మీద ఒకరు అవనీతి ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారు. ఈ వర్గ పోరు ఎంతవరకు పోతుందో వేసి చూడాలి.

