వర్షాభావంతో ముందుకు సాగని ఖరీఫ్ సాగు
జిల్లాలో 22 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం
ఆరు శాతం కూడా సాగు గాని ఖరీఫ్ పంటలు
36వేల హెక్టార్లకు గాను 800 హెక్టార్లలో వేరుశనగ
11 వేల హెక్టార్లకు గాను 300 హెక్టార్లలో వరి
71 వేల హెక్టార్లకు గాను 4వేల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
చిత్తూరు జిల్లాలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులదృష్ట జిల్లాలో ఖరీఫ్ పనులు ముందుకు సాగడం లేదు. వర్షం కోసం జిల్లాలోని రైతులు ఆశగ ఎదురుచూస్తున్నారు. గత నెల రోజులుగా మబ్బులు కమ్మి ఊరించడం తప్ప వర్షాలు పడడం లేదు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రం పడుతున్నాయి. ఈ వర్షాలు వ్యవసాయ పనులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. వర్షం పడితే వేయడానికి వేరుశనగ విత్తనాలను రైతులు సిద్ధం చేశారు. కొందరు రైతులు వేరుశనగ విత్తనం వేశారు. వర్షాబావ పరిస్థితుల్లో కారణంగా వేసిన వేరుశనగ కూడా ఎండిపోతుంది. జిల్లాలో ఇప్పటివరకు ఐదు శాతం పంటను కూడా సాగు కాలేదు. రైతులు విత్తనాలు చేత పట్టుకొని రాసిగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు బాగా పడతాయి. దీంతో జిల్లాలో ఖరీఫ్ పనులు ప్రారంభమవుతాయి. అయితే అందుకు భిన్నంగా చిత్తూరు జిల్లాలోని 22 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయింది. ఫలితంగా 71 వేల హెక్టార్లకు గాను 4వేల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. 36వేల హెక్టార్లకు గాను 800 హెక్టార్లలో వేరుశనగ సాగు కాగా, 11 వేల హెక్టార్లకు గాను 300 హెక్టార్లలో వరి పంటను వేశారు.
ఖరీఫ్ సీజన్ సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో వేరుశనగ, వరి, మొక్కజొన్న, జొన్న, రాగి, కంది, ఉలవలు, అలసందులు, ఉద్దులు, ఆనపకాయలు, సోయాబీన్, పెసర మొదలైన పంటలు వేస్తారు. ఈ ఖరీఫ్ పంటలు అక్టోబర్ లేదా నవంబర్ నెల చివరిలో కోతకు వస్తాయి. రుతుపవనాలు వారం ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వానలు పాడుతాయని వాతావరణ శాఖ తెలియచేసింది. దీంతో రైతులు నూతన ఉత్సాహంతో ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తూ, జిల్లా అంతటా రైతులు తమ పొలాలను సాగు కోసం సిద్ధం చేసుకుంటున్నారు. చాలా మంది రైతులు ట్రాక్టర్లను ఉపయోగించి తమ భూములను దున్నడం ప్రారంభించారు. మరికొందరు ఇప్పటికే విత్తనాలను వేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో చిత్తూరు జిల్లాలో ప్రధానంగా వేరుశనగ పంట సాగు చేస్తారు. జిల్లాలో సాధారణంగా 35,238 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు కావాల్సి ఉంది. ఇందుకు వ్యవసాయ శాఖ 26 వేల క్వింటాళ వేరుశనగ విత్తనాలను రైతు సేవ కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేసింది. రైతులు విత్తనాలను సిద్ధం చేసి విత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సీజన్ కు వ్యవసాయ శాఖ యూరియా వంటి ఎరువులను కూడా రైతులకు సరఫరా చేసింది. సాధారణంగా గత సంవత్సరం ఈపాటికి 30 వేల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎనిమిది వేల హెక్టార్లలో మాత్రమే వేరుశనగ సాగైందని వ్యవసాయ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఖరీఫ్ సీజన్లో చిత్తూరు జిల్లాలో వరి, జొన్న, సజ్జలు, మినుములు, రాగులు, సామలు, కొర్రలు, కందులు, పెసలు, ఉద్దులు, ఉలవలు, అలసందులు, పొద్దు తిరుగుడు పువ్వు, ఆముదం, చెరకు పంటలు వేస్తారు. అలాగే పశువుల కోసం పశుగ్రాసాన్ని కూడా సాగు చేస్తారు. జిల్లాలో గత రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. జూన్ నెలలో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. జిల్లాలోని నిండ్ర, యాదమరి మండలాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదయింది. విజయపురం, నగరి, కార్వేటినగరం, పెనుమూరు, శ్రీరంగరాజపురం, పాలసముద్రం మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయింది. మిగిలిన ఏడు జిల్లాల్లో సాధారణం కంటే 60 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. 15 మండలాల్లో వర్షం పడలేదు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ పంటలు పడకేశాయి. ఈ ఖరీఫ్ సీజన్ కు జిల్లాలో 71, 305 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 4 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జిల్లాలో 11 వేల హెక్టార్లలో వరి సాగు కవాల్సి ఉండగా, ఇప్పటివరకు 300 హెక్టార్లలో మాత్రమే సాగయింది. వేరుశనగ 36 వేల హెక్టార్లలో సాగు కావలసి ఉండగా ఎనిమిది వేల హెక్టార్లలో మాత్రమే సాగయింది. మిగిలిన పంటలు కూడా అంతంత మాత్రమే. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ కు ఇప్పటివరకు ఆరు శాతం పంటలు మాత్రమే సాగినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో ఖరీఫ్ పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. వరుణదేవుడు దయతలిస్తే జిల్లాలో ఖరీఫ్ వంటలు సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పో రై గంగ 1 వర్షం కోసం అన్నదాత ఎదురుచూపులు
గంగ 2 గత నెలలో తవణంపల్లి మండలంలో ఏరువాక ప్రారంభించిన జిల్లా కలెక్టర్, పూతలపట్టు ఎంఎల్ఎ (ఫైల్ ఫోటో)

