సాంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటలకు ప్రోత్సాహం
జిల్లాలో ప్రయోగాత్మకంగా మునగాకు, వెదురు, కోర్రమేను చేపల పెంపకం
డిఆర్డిఏ ద్వారా రైతులకు సంకేతిక సహాయం
బై బ్యాక్ విధానంలో రైతుల పంట కొనుకోలు
జిల్లాలో మునగాకు పౌడర్ ప్లాంట్
అరకు కాఫీ స్టాళ్ళ ఏర్పాటుకు చర్యలు
ఆంధ్రప్రభ బ్యూరోతో డిఆర్డిఏ పిడి శ్రీదేవి
ఆంధ్రప్రభ బ్యూరోతో డిఆర్డిఏ పిడి శ్రీదేవి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
సాంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటలను పండించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రైతులకు సహకారం అందిస్తుందని ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించారు. ఆమె మంగళవారం చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ వాణిజ్య పంటలకు అవసరమైన విత్తనాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు డిఆర్డిఏ అందజేస్తుందని తెలిపారు. డిఆర్డిఏ తరఫున పలు సంస్థలతో ఎం ఓ యు లను కుదుర్చుకున్నామని, తద్వారా రైతులు పండించిన వాణిజ్య పంటలను ఆ సంస్థలే రైతుల నుంచి కొనుగోలు చేస్తాయని తెలిపారు. జిల్లాలో మునగాకు పెంపకం, వెదుర్ల పెంపకం, కొర్రమేను చేపల పెంపకం ఈ సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే డ్వాక్రా మహిళలకు కిరాణా షాపులను, అరకు కాపీ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానమంత్రి ఆహార శుద్ధి పరిశ్రమ కింద మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని, రెండు మండలాలలో సమీకృత వ్యవసాయ విధానాలను అమలు చేసి అన్ని వాణిజ్య పంటలను ఆ మండలాల్లో ప్రయోగాత్మకంగా పండిస్తామని శ్రీదేవి వివరించారు.
చిత్తూరు జిల్లాలో మునగాకు పెంపకానికి 7 మండలాలను ఎంపిక చేశామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఐరాల, తవణంపల్లి, బంగారుపాలెం, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పెనుమూరు మండలాల్లో ప్రయోగాత్మకంగా మునగాకును పండిస్తామన్నారు. ఇప్పటికీ 300 ఎకరాలను గుర్తించడం జరిగిందని, మరో 530 ఎకరాలలో మొనగాకు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మునగాకు 45 రోజుల తర్వాత కోతకు వస్తుందని, ఈ మునగాకును తమిళనాడుకు చెందిన సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. 30 రోజులకు ఒకసారి మునగాకు కోతకు వస్తుందని, ఒక ఎకరాకు ఖర్చులు పోను సంవత్సరానికి 50,000 మిగులుతుందన్నారు. మునగ కాయలను రైతులు స్థానికంగా అమ్ముకొని లాభం పొందవచ్చన్నారు. చిత్తూరు జిల్లాలో మునగాకు పౌడర్ ప్లాంటును కూడా స్థాపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం, ఐరాల, రామకుప్పం మండలాల్లో వెదురు పెంపకాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. బంజరు భూముల్లో 30 సెంట్లలో ఈ వెదుర్లను ప్రయోగాత్మకంగా పండిస్తామని తెలిపారు. ఇండస్ట్రియల్ ఫౌండేషన్ గ్రూపు వెదుర్లను కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. నాలుగవ సంవత్సరం నుంచి వెదురు కోతకు వస్తాయన్నారు. మొదటి సంవత్సరం రైతుకు 40 వేల రూపాయల ఆదాయం ఉంటుందని, తర్వాత ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుందని వివరించారు. తవణంపల్లి, చౌడేపల్లి మండలాల్లో కొర్రమేను చేపల పెంపకంను చేపట్టనున్నట్లు తెలిపారు. ఐదు లక్షల యూనిట్లు జిల్లాకు మంజూరయ్యాయని, ఇందుకు 30 సెంట్ల భూమిలో గుంత ఉండాలన్నారు. షెడ్డు ఉండాలని, వృధా నీటితో కూరగాయల పెంపకాన్ని చేపట్టవచ్చన్నారు. ఇప్పటివరకు 50 మందిని గుర్తించడం జరిగిందన్నారు. చేపల పెంపకంలో ఎనిమిది నెలలకు పంట వస్తుందని, వాటిని కిలో 250 రూపాయల చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిందన్నారు. కొర్రమేను చేపల పెంపకంలో ప్రభుత్వం నుండి 35 శాతం సబ్సిడీ వస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా ఎనిమిది నెలలకు లక్ష రూపాయలు పైగా ఆదాయం ఉంటుందన్నారు. జిల్లాలో చిరుధాన్యాలను వినియోగించడంపై హోటల్ యజమానులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికీ కుప్పం, పెద్ద పంజాని మండలాల్లో ఇద్దరిని ఎంపిక చేసామని, ఇంకా ఎనిమిది మందిని ఎంపిక చేస్తామన్నారు. జిల్లాలో డ్వాక్రా గ్రూపులకు కిరాణా దుకాణాలు నడపడానికి 50 వేల రూపాయలు రుణ సౌకర్యం కలగచేసి, 500 యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 274 యూనిట్లు ఎంపిక చేసామని తెలిపారు. వీరికి ఎంపిక చేసిన సంస్థ ద్వారా అన్ని రకాల కిరాణా వస్తువులను సరఫరా చేస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో పండే పంటలను వీరి ద్వారా ఆ సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో అరకు కాపీ యూనిట్లను 10 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికీ కాణిపాకం, పుంగనూరులలో గుర్తించామని, యూనిట్ ధర ఆరు లక్షల రూపాయలుగా తెలిపారు. ఇందులో 35 శాతం సబ్సిడీ ఉంటుందని వివరించారు. ప్రధానమంత్రి ఆహార శుద్ధి పథకం ద్వారా స్వీట్స్ తయారీ, బేకరీలకు లక్ష రూపాయలు నుండి పది లక్షల రూపాయల వరకు రుణముగా అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే ఆయిల్ మిల్స్, నిల్వ ఉండే ఆహార పదార్థాలు తయారు చేసే సంస్థలకు వర్తిస్తుందన్నారు. జిల్లాలోని తవణంపల్లి, చౌడేపల్లి మండలాల్లో సమీకృత వ్యవసాయం ద్వారా అన్ని రకాల పంటలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తిపలికి ఆదాయాన్ని చార్జించు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాల్సిందిగా ఆమె కోరారు డిఆర్డిఏ సహకారాన్ని వినియోగించుకొని రైతులు అధిక ఆదాయం పొందాలని ఆకాంక్షించారు.
పో రై గంగ 1 డిఆర్డిఏ పిడి శ్రీదేవి
పో రై గంగ 1 డిఆర్డిఏ పిడి శ్రీదేవి

