13, జులై 2025, ఆదివారం

తెలుగు తమ్ముళ్లలో హర్షాతిరేకాలు

పదవుల పందేరానికి రంగం సిద్ధం 
ఆలయ పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలను భర్తీ చేసే అవకాశాలు

జిల్లాలో భారీగా ఆశావహులు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు భర్తీకి రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆలయాలు, మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులు సభ్యుల నియామకం కోసం జాబితాలు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 15 వ తేదీ లోపల జాబితాలు సిద్ధం చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేశారు. దీనితో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు శుక్ర, శనివారాలలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జిల ద్వారా పేర్లు సేకరించారు. 

ఈ నేపధ్యంలో చిత్తూరు జిల్లాలో పలువురు నేతల్లో అసలు చిగురించాయి. జిల్లాలో కాణిపాకం, బోయకొండ గంగమ్మ ఆలయాలు ప్రసిద్ధి పొందాయి. ఈ రెండు ఆలయాలకు తీవ్రమైన పోటీ ఉంది. పుంగనూరు నియోజక వర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే బోయకొండ కూడా ఆ జిల్లా పరిధిలోకి వెళుతుంది. జిల్లాలో ఇంకా పలు ఆలయాలు ఉన్నాయి. పెనుమూరు మండలంలో ఉన్న కలికిరి కొండ ఆలయాన్ని టిటిడి స్వాధీనం చేసుకుంది. కాగా పదికి పైగా మార్కెట్ కమిటీలు, 35 పైగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు పాలక మండళ్లు వేయాల్సి ఉంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అన్నింటికి ఆయా ఎమ్మెల్యేలు పేర్లు పంపినట్టు తెలిసింది. చంద్రబాబు ఈ నెల 15, 16 వ తేదీలలో డిల్లీకి వెళ్ళే అవకాశం ఉన్నందున ఆయన రాగానే పదవులను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ పదవులు అన్నీ దాదాపు ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే కేటాయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఐవీఆర్ఎస్ సర్వే ఆధారంగా కొన్ని చోట్ల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. కాగా ఖాళీగా ఉన్న దాదాపు 40 రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్, డైరెక్టర్ల పదవులకు కసరత్తులు జరుగుతున్నట్టు తెలిసింది. ఇందులో కనీసం రెండు చైర్మన్ పదవులు, కొన్ని డైరెక్టర్ పదవులు జిల్లా నాయకులను వర్తించే అవకాశం ఉందంటున్నారు. అలాగే నెలాఖరు లోగా పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఇందులో కూడా జిల్లాకు ఐదారు పదవులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో గ్రంథాలయ సంస్థ, కాణిపాకం ఆలయ ట్రస్టు బోర్డు పదవులకు ఎక్కువ పోటీ ఉంది. జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్ కు కూడా చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పదవులను ఆశిస్తున్న వారు భారీగా ఉన్నారు. గత ఎన్నికలలో టికెట్టు రానివారు, అభ్యర్థుల విజయానికి దోహదం చేసిన వారు, పార్టీ గెలుపు కోసం ధనం వ్యయం చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చాలా మంది రాష్ట్ర స్థాయి పదవులను ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరికి న్యాయం చేస్తారో చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *