10, జులై 2025, గురువారం

మామిడి చెట్లను నరికేస్తున్న రైతులు

ముఖ్యమంత్రి ఆదేశించిన అమలు కాని మద్దతు ధర 

4 నుండి 6 రూపాయలు చెల్లిస్తున్న ఫ్యాక్టరీలు 

ర్యాంపులలో మూడు రూపాయలు మాత్రమే 

ఆర్థికంగా నష్టపోతున్న మామిడి రైతులు 

మామిడిని కోయకుండా వదిలేస్తున్న రైతులు 



చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా స్వయంగా చిత్తూరు జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఎనిమిది రూపాయలు మద్దతు ధర రైతులకు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే, జిల్లాలో ఏ ఫ్యాక్టరీ కూడా రైతులకు ఎనిమిది రూపాయలు మద్దతు ధర ఇవ్వడం లేదు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తున్నట్లు ఫ్యాక్టరీల యజమానులు కానీ, సంబంధిత అసోసియేషన్ గానీ ప్రకటించలేదు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా, జిల్లాలో మామిడి రైతులకు ఎనిమిది రూపాయలు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు మామిడి చెట్లను తొలగిస్తున్నారు. కొందరు కాయలను ఫ్యాక్టరీలకు సరఫరా చేయకనే తోటల్లోనే వదిలేస్తున్నారు. శ్రమ పడి మామిడికాయలను కోసుకొని వచ్చినా, వచ్చే ఆదాయం కూలీలకు, ట్రాక్టర్ బాడుగులకు కూడా చాలడం లేదు. దీంతో రైతులు మామిడిని కోయడానికి కూడా ముందుకు రావడం లేదు. చాలా చోట్ల మామిడి తోపుల్లోనే పండి పడిపోతున్నాయి.

చిత్తూరు జిల్లాలో మామిడి పంట గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా వచ్చింది. జిల్లాలో మామిడికాయలను తీసుకొని ప్రాసెస్ చేయడానికి 35 గుజ్జు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో ఏడు గుజ్జు ఫ్యాక్టరీలు వివిధ కారణాలతో ప్రారంభం కాలేదు. 28 ఫ్యాక్టరీలలో మామిడి కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ప్రాసెస్ చేసిన మామిడి పల్ప్ నిల్వ ఉండడంతో జిల్లాలోని ఫ్యాక్టరీలు మామిడికాయలను తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంతో రాష్ట్ర ప్రభుత్వం మామిడికి 12 రూపాయలను మద్దతు ధరగా నిర్ణయించింది. ఇందులో ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ యజమానులు ఇస్తారని, నాలుగు రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని తెలిపింది. 8 రూపాయలకు కూడా కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ముందుకు రాలేదు. గత నెల మొదటి వారంలో జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు జిల్లాలోని మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఎనిమిది రూపాయలు ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లాలో మంత్రి హెచ్చరికలు కూడా పనిచేయలేదు. మామిడికాయలు పక్వానికి రావడంతో ధర విషయం పక్కనపెట్టి రైతులు కాయలు కోయడం ప్రారంభించారు. దీంతో ఫ్యాక్టరీలు కిలోకు నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు మాత్రమే చెల్లించడానికి ముందుకు వచ్చాయి. ఈ విషయాన్ని రెండవ తారీఖున కుప్పం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మామిడి రైతులు తీసుకెళ్లారు. మూడవ తారీఖున ముఖ్యమంత్రి జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు, రైతులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మామిడి గుజ్జు ఫ్యాక్టరీల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందని, ప్రభుత్వం నిర్దేశించిన ఎనిమిది రూపాయలను రైతులకు ఇవ్వాల్సిందిగ ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ యజమానులను విజ్ఞప్తి చేశారు. అయితే జిల్లాలో ఎక్కడ గాని ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ఎనిమిది రూపాయలు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి పర్యటన అయిన తర్వాత జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో సమావేశం అయ్యారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి ఈనెల 5, 6 తేదీల్లో చిత్తూరు జిల్లాలో మద్దతు ధర అమలు చేయడానికి ప్రత్యేకంగా పర్యటించారు. ఆయన ఐదవ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం గుజ్జు పరిశ్రమల సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తుందని, సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా రైతులకు ఎనిమిది రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆరవ తారీఖున పూతలపట్టు మండలంలోని గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీని పరిశీలించారు. అక్కడ మామిడికాయల కొనుగోలు, జ్యూస్ తయారీ తదితర విషయాలను పరిశీలించారు. జిల్లాలో దాదాపుగా మామిడి కాయల సీజన్ ముగింపునకు వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.08 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికాయలను 51వేల రైతుల నుంచి సేకరించినట్లు తెలియజేస్తున్నారు. మరో వారం రోజుల్లో మామిడి సీజన్ ముగిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా రైతులకు ఎనిమిది రూపాయల గిట్టుబాటు ధర ఏ ఫ్యాక్టరీ కానీ ఇవ్వడం లేదు. ర్యాంపుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు రూపాయలతో ప్రారంభమైనా, ప్రస్తుతం మూడు నాలుగు రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు పాటించకపోవడంతో జిల్లాలోని రైతులు ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *