జీడి నెల్లూరులో సంక్లిష్టంగా మారిన మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక
వర్గపోరుతో పలువురు అభ్యర్థులు మండల పార్టీ అధ్యక్ష బరిలో
పరిశీలకులకు కూడా అందుబాటులో లేని స్థానిక ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి పర్యటనకూ డుమ్మా
ఉసేలేని సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు మినహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తయింది. గతంలో నిర్దేశించిన గడవు ముగియడంతో, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మండల కమిటీల ఎన్నికను నిర్వహించడానికి తొమ్మిది మందితో కూడిన పరిశీలకులను అధిష్టానం నియమించింది. ఈనెల 5వ తేదీలోపు మండల కమిటీ ఎన్నికలను పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే అధిష్టానం ఆదేశించినా ఇప్పటివరకు నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిక పూర్తి కాలేదు. శాసనసభ్యులు ఎం వి థామస్ జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చినా స్వాగతం పలకడానికి కూడా హాజరు కాలేదు. సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమాన్ని జిల్లాలోని శాసనసభ్యులందరు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా, శాసనసభ్యుడు పట్టించుకోలేదు. సంస్థాగత ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన పరిశీలకులకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేదు. ఫలితంగా నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిక మరో మారు వాయిదా పడింది.
గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో టిడిపి మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయలేనని పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ఆయన వ్యతిరేకుల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరుకోవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి నప్పటికీ నియోజక వర్గంలో వైసిపి నుంచి వచ్చిన కొందరి ఆధిపత్యం పెరిగింది. ఎమ్మెల్యే ప్రాపకంతో కొందరు ఏక పక్షంగా మండల కమిటీల ఏర్పాటుకు ప్రయత్నం చేసారు. దీనితో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు వర్గీయులు అడుగడుగునా వ్యతిరేకించడం ప్రారంభించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఇక్కడ జరుగుతున్న పార్టీ వ్యతిరేక వ్యవహారాలను అధిస్థానం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనితో అధిష్టానం రెండు సార్లు నియోజక వర్గం పరిశీలకులను మార్చింది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా శనివారానికి మండల కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే గడువు పూర్తి అయినప్పటికీ పరిశీలకులు కనీసం నియోజక వర్గంలో పర్యటించలేదు. ఎమ్మెల్యే థామస్ చంద్రబాబు వారించినా లెక్క చేయకుండా విదేశాలకు వెళ్ళారు. ఆయన ఈ నెల తొమ్మిదవ తేదీ తిరిగి వస్తారని తెలిసింది. అప్పటి వరకు మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియ చేపట్టే అవకాశం లేదంటున్నారు. కాగా పాలసముద్రం, జి డి నెల్లూరు, కార్వేటినగరం, ఎస్ ఆర్ పురంలో మండలాల్లో మండల పరిశీలకులు గ్రామ, బూత్ కమిటీలను ఏర్పాటు చేసి అధిష్టాన వర్గానికి జాబితా పంపారు. సోమవారం పెనుమూరు, వెదురుకుప్పం మండలాల్లో గ్రామ కమిటీల ఏర్పాటు చేస్తారని తెలిసింది. కాగా మండల కమిటీల ఏర్పాటు కత్తిమీద సాములా తయారు అయ్యిందని భావిస్తున్నారు. ఎమ్మెల్యే థామస్, రాష్ట్ర నాయకు చిట్టి బాబు నాయుడు, సుధాకర్ రెడ్డి ఎవరికి వారు తమ వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఒక మండలం కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు. ప్రతి మండలంలో మూడు నుంచి ఐదు మంది నాయకులు మండల అధ్యక్ష పదవి కోసం పాటు పడుతున్నారు. పాలసముద్రం మండలంలో తిరిగి అధ్యక్షునిగా కొనసాగాలని రాజేంద్ర కోరుకుంటున్నారు. అయితే వాసు నాయుడు, శివా నాయుడు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గంగాధర నెల్లూరు మండలంలో ప్రస్తుత అధ్యక్షుడు స్వామి దాసు, మాజీ అధ్యక్షుడు దేవసుందరం, పార్లమెంటు నాయకుడు కృష్ణమ నాయుడు పదవి ఆశిస్తున్నారు. పెనుమూరు మండలంలో నిట్ట నిలువునా రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రస్తుత అధ్యక్షుడు పి రుద్రయ్య నాయుడు ఇప్పటికే ఎనిమిది సార్లు అధ్యక్షునిగా ఉన్నందున వేరొకరికి అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపిపి హరిబాబు నాయుడు వర్గం పట్టు పడుతోంది. ఈ వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం నాయుడు, మాజీ మండల కమిటీ అధ్యక్షుడు మనోహర్ ( బాబు) రెడ్డి, మాజీ ఎంపిపి షణ్ముఘ వర్మ ( బిసి ), ప్రకాశ్ నాయుడు, నాగరాజ ( ఎస్సీ), సతీశ్ రెడ్డిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఈ వర్గం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తున్నారు. కాగా రుద్రయ్య నాయుడుకు అవకాశం లేకపోతే మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, పార్లమెంటు కార్యదర్శి రెడ్డప్ప ( ఎస్సీ) లలో ఒకరికి ఇమ్మని కోరే అవకాశం ఉంది. ఎస్ ఆర్ పురం మండలంలో ప్రస్తుత అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, భాస్కర్ నాయుడు, పైనేని మురళి నాయుడు, వేమా నాయుడు, రాజశేఖర్ నాయుడు పోటీలో ఉన్నారు. కార్వేటినగరం చెంగల్రాయ యాదవ్ తిరిగి కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే నియోజక వర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ఒక మండలం అయిన కేటాయించాలని ఆ వర్గం పట్టుపడుతోంది. ఈ నేపధ్యంలో తిరుమల నాథ్ పేరు తెరపైకి వచ్చింది. తలారి రవి, రవి యాదవ్, కూడా పదవి ఆశిస్తున్నారు. నియోజక వర్గంలో ఒక మండల అధ్యక్ష పదవిఅయినా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిస్థానం భావిస్తోంది. వెదురుకుప్పం మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నందున ఆ వర్గానికే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు లోకనాథ రెడ్డి అందరి సమ్మతితో కొనసాగాలని కోరుకుంటున్నారు. పోటీ అనివార్యం అయితే ఆయన తప్పుకునే అవకాశం ఉందంటున్నారు.రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి మునిచంద్రా పదవి ఆశిస్తున్నారు. గతంలో కూడా ఆయన పోటీ పడ్డారు. కాగా మాజీ మండల కమిటీ అధ్యక్షుడు మోహన మురళీ ( ఎస్సీ) కిషన్ చంద్ (బిసి) పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిక ప్రక్రియ రసవతరంగా మారింది.

