మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముంది?
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
మద్యం ముడుపుల కుంభకోణం కేసులో రాజంపేట పార్లమెంటు సభ్యుడు పీవీ మిథున్ రెడ్డిని కీలకమైన నేతగా సిట్ ఎసిబి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసుకు ఆయనే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు ఆయన ద్వారానే అందాయని పేర్కొంది. ఈ ముడుపుల కుంభకోణానికి సంబంధించిన పధక రచన ఆయనే చేశారని తెలిపింది. ఆయనను నాలుగో అనిందితుడుగా చేర్చి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించింది.
మిథున్ రెడ్డి మీద ఐపిసి సెక్షన్లు 409, 420, 384, 201, 120 (బి) తో పాటు సెక్షన్లు 34, 37 కింద క్రైమ్. నెం. 21.2024 తో ఎఫ్ఐఆర్ నమోదయింది. అలాగే అవినీతి నిరోధక చట్టం, 1988 లోని 7, 7 ఏ, 8, 12, 13 (1) (బి), 13 (2) సెక్షన్ల కింద కూడా నమోదు చేశారు. ఎక్సైజ్ విధానంలో లేబులింగ్, ధర నిర్ణయించడం, బ్రాండింగ్, ఐ ఎం ఎఫ్ ఎల్ డిమాండ్ & సరఫరా, డిస్టిలరీలు, ఆర్డర్ ఫర్ సప్లై, లాజిస్టిక్స్, జి ఆర్ ఓ ల ద్వారా మద్యం అమ్మకాలను తారుమారు చేయడం ద్వారా కమీషన్లు, కిక్‌బ్యాక్‌ల రూపంలో సభ్యులకు అక్రమ ధన లాభం చేకూర్చడానికి ఒక సిండికేట్‌ను ఏర్పాటు చేసి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. అక్టోబర్ 2019 నుండి మార్చి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రదేశాలలో నేరాలు జరిగాయని తెలిపింది. ఈ నేరానికి సంబంధించి ఆగస్టు 26, 2024న, యేది వెంకటేశ్వరరావు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ (ఎక్సైజ్)కి ఒక ఫిర్యాదు చేశారు. 2019-2024 మధ్య రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, సరఫరాలో అనేక అవకతవకలు, ముఖ్యంగా కొన్ని మద్యం బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి మాన్యువల్ ఓ ఎఫ్ ఎస్ జారీ చేయడం, కొన్ని బ్రాండ్‌ల ధరలు అసాధారణంగా పెరగడం, కమీషన్లు, కిక్‌బ్యాక్‌లు చెల్లించడం మొదలైన వాటిలో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎక్సైజ్ విభాగంలోని సీనియర్ అధికారులతో కూడిన 5 మంది సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. కాలక్రమేణా ఓ ఎఫ్ ఎస్ కేటాయింపులో స్థాపించబడిన ప్రసిద్ధ బ్రాండ్‌లను అణచివేయడం, అన్యాయమైన వివక్ష చూపడం జరిగిందన్నారు. ప్రస్తుత నిబంధనలను ఉల్లంఘించి కొన్ని కొత్త బ్రాండ్‌లకు అనుకూలమైన, ప్రాధాన్యతతో కూడిన సరఫరా ఆర్డర్‌ల కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. మునుపటి ఆటోమేటెడ్ ఓ ఎఫ్ ఎస్ వ్యవస్థకు విరుద్ధంగా ఓ ఎఫ్ ఎస్ (సరఫరా కోసం ఆర్డర్) తారుమారు చేయడానికి అవకాశం కల్పించేలా కొనుగోలు వ్యవస్థను మాన్యువల్ ప్రక్రియకు మార్పులు చేశారని వివరించారు.
మిథున్ రెడ్డి ఈ కుట్రకు, మద్యం సిండికేట్ కార్యాచరణ రూపకల్పనకు ప్రధాన సూత్రధారులలో ఒకరు, ప్రధాన కార్యనిర్వాహకులలో ఒకరని ఏసీబీ కొట్టుకు తెలిపారు. పెద్ద ఎత్తున కిక్‌బ్యాక్‌ల కోసం నిర్దిష్ట డిస్టిలరీలు, బ్రాండ్‌లకు అనుకూలంగా ఎక్సైజ్ మరియు మద్యం కొనుగోలు విధానాలలో విధాన స్థాయి మార్పులను ఆయన రూపొందించారని తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ లేదా బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అధికారికంగా ఎటువంటి పదవిని కలిగి ఉండకపోయినప్పటికీ, దర్యాప్తులో ఆయన కీలక విధాన నిర్ణయాలపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపారని వెళ్లడయ్యిందని తెలిపారు. మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు, బేవరేజెస కార్పొరేషన్ కొనుగోలు వ్యవస్థ ఆటోమేటెడ్ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (పి ఆర్ పి) సిస్టమ్ నుండి మాన్యువల్, ఇమెయిల్ ఆధారిత ఆర్డర్ ఫర్ సప్లై (ఓ ఎఫ్ ఎస్) పద్ధతికి మార్పు చేశారని తెలిపారు. ఇది డేటా ఆధారిత కొనుగోలును అధిగమించడానికి విచక్షణాధికారాన్ని కల్పించిందన్నారు. ఎక్సైజ్ రంగంలో చాలా తక్కువ అనుభవం ఉన్న ఏ.3 శ్రీ సత్య ప్రసాద్ ను ఆంధ్ర ప్దేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కు స్పెషల్ ఆఫీసర్‌గా మిథున్ రెడ్డి ఆదేశాలతో నియమించారని పేర్కొన్నారు. బ్రాండ్ ప్రమోషన్, కొన్ని సరఫరాదారుల అణచివేత, ఓ ఎఫ్ ఎస్ ఏకపక్ష పునఃపంపిణీకి సంబంధించిన ఆదేశాలను నిస్సందేహంగా అమలు చేసే నమ్మకమైన, విధేయుడైన అధికారిని నియమించడానికి ఒక పథకం పన్నారని తెలిపారు. అక్టోబర్ 8, 2019న సత్య ప్రసాద్ (ఏ-3) మిథున్ రెడ్డి (ఏ-4)ని కలిసినప్పుడు, మిథున్ రెడ్డి సరఫరాదారులు, డిస్టిలరీల నుండి కమీషన్లు, కిక్‌బ్యాక్‌లు సంపాదించడానికి తమ ప్రతిపాదన గురించి వివరించారనీ తెలిపారు. సత్యప్రసాద్ ను తమ సిండికేట్ కోసం పనిచేయమని మిథున్ రెడ్డి కోరారని పేర్కొన్నారు. 2023లో ఐఏఎస్ పదోన్నతి ఇస్తానని వాగ్దానం చేశారని వివరించారు.
అక్టోబర్ 13, 2019న హైదరాబాద్‌లోని వి. విజయసాయి రెడ్డి ఇంటి వద్ద మిథున్ రెడ్డితో సహా సిండికేట్ సభ్యులు సమావేశమయ్యారు. గత మూడు సంవత్సరాల మద్యం అమ్మకాల డేటాను విశ్లేషించిన తర్వాత, ప్రతి నెలా రూ. 50-60 కోట్ల కమీషన్లు, కిక్‌బ్యాక్‌లు సంపాదించవచ్చని వారు అంచనా వేశారని సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు వివరించారు. మాన్యువల్ ఓ ఎఫ్ ఎస్ ప్రక్రియతో డిపోలలో సరఫరా, ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్‌లలో (జి ఆర్ ఓ) అమ్మకాలను ఏ-3 సత్య ప్రసాద్ నిర్వహించాలని నిర్ణయించారని నివేదించారు. కిక్‌బ్యాక్‌లు చెల్లించే మద్యం బ్రాండ్‌లు, కంపెనీలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించాలని సిండికేట్ అంగీకరించిందనీ పేర్కొన్నారు. మిథున్ రెడ్డి (ఏ-4) సహచరుల ద్వారా సమావేశాలలో నగదు వసూలు చేసి పంపిణీ చేశారని తెలిపారు. ఎస్ పి వై డిస్టిలరీస్, సన్హాక్ ల్యాబ్స్, డి కార్ట్ లాజిస్టిక్స్ వంటి సంస్థల మధ్య రూ. 60 కోట్లు బదిలీ అయ్యాయనీ వివరించారు. డి కార్ట్ లాజిస్టిక్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమీక్షించేటప్పుడు, అక్టోబర్ 3, 2021న పి ఎల్ ఆర్ ప్రాజెక్ట్‌ల ఖాతాలో రూ. 5 కోట్లు జమ చేయబడినట్లు గుర్తించామన్నారు. ఈ కంపెనీ మిథున్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులకు చెందినదిగా పేర్కొన్నారు. మిథున్ రెడ్డి జీవో ఎంఎస్ నెంబర్ 401ని ఉల్లంఘించి, ధరలు, డిస్కౌంట్లు, బ్రాండ్ ఆమోదాలు వంటి బేవరేజెస్ కార్పొరేషన్ విధానాలను సమర్థవంతంగా ఆదేశించారనీ, సారూప్య బ్రాండ్‌లను దుర్వినియోగం చేసి ధరలను పెంచారనీ పేర్కొన్నారు. ఈ సిండికేట్ కార్యకలాపాల ద్వారా సుమారు రూ. 3,200 కోట్ల అక్రమ లాభాలు పొందినట్లు అంచనా వేశారు.
ఆటోమేటెడ్ ఓ ఎఫ్ ఎస్ వ్యవస్థ నుండి మాన్యువల్ వ్యవస్థకు మార్చడం, కిక్‌బ్యాక్‌లు చెల్లించే కొన్ని కొత్త బ్రాండ్‌లకు అనుకూలమైన, ప్రాధాన్యతతో కూడిన ఓ ఎఫ్ ఎస్ కేటాయింపులు చేయడం, కిక్‌బ్యాక్‌లు చెల్లించడానికి నిరాకరించిన ప్రసిద్ధ బ్రాండ్‌లను అణచివేయడం, ఇండెంట్ ప్రణాళికలను తారుమారు చేయడం, జి ఆర్ ఓ లాగిన్‌లను నియంత్రించడం ద్వారా సరఫరాదారులకు రూ. 200 కోట్లకు పైగా అదనపు చెల్లింపులు (జూన్ 2022 నుండి మార్చి 2024 వరకు) 1.5 శాతం డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా జరిగాయని రిమాండ్ రిపోర్టులో వివరించారు. తద్వారా వారికి ధన లాభం చేకూరి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ అదనపు చెల్లింపులు ప్రధానంగా ఎస్ పి వై ఆగ్రో ఇండస్ట్రీస్, లీల డిస్తలరీస్, అంబర్ స్పిరిట్స్, ఆదాన్ డిస్టర్లరీస్, తిలక్ నగర్, సెంటిని, మోహన్, ఎస్ ఎన్ జే సప్లయర్స్ ఇతర సరఫరాదారులకు జరిగాయనీ వివరించారు. కిక్‌బ్యాక్‌లు బాలియన్ వ్యాపారులు, షెల్ కంపెనీలతో పెంచిన లావాదేవీల ద్వారా దాచి పెట్టారని, ఆ నిధులు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లోని హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా షెల్ కంపెనీలకు లేదా నిందితులకు పంపారని వివరించారు. ఈ విచారణలో 74 హార్డ్ డిస్క్‌లు, ఒక ల్యాప్‌టాప్, 1,016 డాక్యుమెంట్లు, ఫైళ్లు స్వాధీనం చేసుకుని ఎఫ్ ఎస్ ఎల్ విశ్లేషణకు పంపినట్లు తెలిపారు. ఇప్పటివరకు 270 మంది సాక్షులను విచారించామని పేర్కొన్నారు. పి.వి. మిథున్ రెడ్డి (ఏ-4)ని కస్టడీలో విచారించడం ద్వారా కుట్ర పూర్తి నిర్మాణాన్ని వెలికి తీయవచ్చని భావిస్తున్నారు.
పో రై గంగ 2 మిథున్ రెడ్డి

