అమూల్ డెయిరీకి రాజకీయ గ్రహణం
ప్రభుత్వం మారడంతో తగ్గిన పాల సరఫరా
తమిళనాడు, కర్ణాటక నుండి పాల సేకరణ
జిల్లా రైతులకు పెరగని పాల ధర
సందిగ్ధంలో డెయిరీ విస్తరణ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
సహకార రంగంలో నడుస్తున్న చిత్తూరు పాల డెయిరీ ని 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్న అమూల్ డెయిరీకి రాజకీయ గ్రహణం పట్టింది. రెండు సంవత్సరాల కిందట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమూల్ డైరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమూల్ డైరీ కారణంగా చిత్తూరు జిల్లాలోని రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని, రైతుల జీవితాలు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. అముల్ డెయిరీ ప్రారంభం నుండి వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు డెయిరీ కి రెండు లక్షలకు పైగా పాలు సరఫరా అయ్యేది. ప్రభుత్వం మారగానే పరిస్థితి మారిపోయింది. పాలు సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం పాల సేకరణకు అమూల్ డెయిరీ తంటాలు పడుతుంది. తమిళనాడు నుంచి 70 వేల లీటర్లను, కర్ణాటక నుంచి 30 వేల లీటర్లను సేకరిస్తున్నారు. చిత్తూరు, మదనపల్లి పరిసరాల నుంచి 45 వేల లీటర్లను సేకరిస్తున్నారు. పాల సరఫరా తగ్గడంతో పనీర్, పెరుగు, జున్ను, వెన్న, ఐస్ క్రీం, పాల పొడి కర్మాగారాల నిర్మాణం సందిగ్ధంలో పడ్డాయి. అనుకున్న విధంగా జిల్లా రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు.
చిత్తూరు జిల్లాలో సహకార డెయిరీ చరిత్ర 1945 నాటిది, అప్పటి నుండి ఇది పాల సేకరణ కేంద్రంగా స్థాపించబడింది . 1969లో, ఇది 6,000 లీటర్ల సేకరణతో సహకార కర్మాగారంగా మారింది. 1988 నాటికి రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత 1993 నాటికి దాని సామర్థ్యాన్ని 2.5 లక్షల నుండి 3 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసేలా పెంచారు. 1992లో కేంద్రం మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ జారీ చేసి, ప్రైవేట్ డెయిరీలకు అవకాశం కల్పించింది. అప్పటికే ఆపరేషన్ ఫ్లడ్3 ద్వారా యూరప్ నుంచి వచ్చిన పాలపొడిని ఉచితంగా సరఫరా చేసింది. దీంతో పాల ధర తగ్గి, డెయిరీలు నష్టాల బారిన పడ్డాయి. చిత్తూరు డెయిరీ పాలను ఏడాదిలో 7నెలలే ఏపీ డెయిరీ ఫెడరేషన్ కొనేది. మిగతా రోజుల్లో ఆవు పాల వంకతో తీసుకునేది కాదు. ఏడాదంతా కాంట్రాక్టు ఇచ్చేది కాదు. పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవటానికి రాష్ట్ర యూనియన్ అనుమతి ఇచ్చేదీ కాదు. చిత్తూరు డెయిరీ రోజుకు 2.75లక్షల లీటర్లు సేకరిస్తే. 1.60లక్షల లీటర్లే కొన్న పరిస్థితి. మిగిలినవి ఇతర మార్గాల్లో తరలించి, పౌడర్‌గా మార్చుకోవాల్సి వచ్చేది. ఎన్‌డీడీబీ ఇచ్చే ఉచిత పాలపొడి వల్ల ఈ పాల పొడికి డిమాండ్ ఉండేది కాదు. గతి లేక ఇండియన్ ఆర్మీ వంటి సంస్థలకు కిలో రూ.25కు అమ్మిన పరిస్థితులున్నాయి. కానీ ఈ పాల పొడి ఉత్పత్తి ఖరీదు కిలో రూ.34దాకా పడేదని చెప్పేవారు. నెయ్యి విషయంలో కూడా ఇంతే. బెంగళూరు, మద్రాసు(చెన్నై) డెయిరీలు పాల నుంచి వెన్న తీసి పాలు, వెన్న విడివిడిగా అమ్మేవి. అప్పట్లో చిత్తూరు డెయిరీకి తిరుపతి మినహా ఇతర పట్టణాల్లో పెద్దగా మార్కెట్ లేదు. టీటీడీ కిలో నెయ్యి రూ.45చొప్పున టెండర్లు ఇచ్చే ది. కానీ కిలో నెయ్యి ఉత్పత్తి వ్య యం రూ.54దాకా ఉండేది. ఈ కారణాలతో చిత్తూరు డెయిరీకి 1991 నాటికే రూ. కోట్లలో నష్టం వచ్చింది. 1993లో హెరిటేజ్ డెయిరీ పెట్టే నాటికి చిత్తూరు డెయిరీ బాగా నష్టాల్లో కూరుకుపోయింది. కడప, ఉభయగోదావరి జిల్లాల సహకార డెయిరీలూ నష్టాలబాట పట్టాయి. ఈ స్థితిలో 1992లో ఎంపీవో(డీ లైసెన్సింగ్) ద్వారా కేంద్రం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించింది. ఫలితంగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే అప్పట్లో 32 మిల్క్ బిల్డింగ్ సెంటర్లు నెలకొల్పారు. హెరిటేజ్‌తో సహా 5 యూని ట్లు టీడీపీకి చెందిన వారివి ఏర్పడగా, మిగిలినవి అప్పటి కాంగ్రెస్ నేతలవన్నవి వాస్తవం. చిత్తూరు సహకార డెయిరీ అప్పులు రూ.182 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ఆగస్టు 31, 2002న డెయిరీ మూతపడింది. వైసీపీ ప్రభుత్వ పెద్దలు చిత్తూరు డెయిరీకి సంబంధించి దాదాపు 33 ఎకరాల భూమి, జపాన్, జర్మనీ నుంచి తెప్పించిన విలువైన సామగ్రితో సహా.. దాదాపు రూ.650 కోట్ల విలువైన ఆస్తులను ఏడాదికి రూ.కోటికే లీజుకు ఇచ్చేశారు. పైగా 99 ఏళ్లకు లీజుకివ్వడం విమర్శలకు దారితీస్తోంది. అప్పగింతలు పూర్తవడంతో అమూల్ ఆధ్వర్యంలో నడిపే చిత్తూరు డెయిరీలో నూతన నిర్మాణాలకు 2023 జూన్ 4న సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ డెయిరీకి కొత్త జీవం పోయడానికి అమూల్ కు అప్పకిమ్చమని, అమూల్ రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉందన్నారు. ఇందువల్ల 5,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని, రెండు లక్షల మందికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం, అమూల్ చిత్తూరు డెయిరీ భూమిని లీజుకు పొందిన 10 నెలల్లోపు ఉత్పత్తిని ప్రారంభించాలి. పాల ప్రాసెసింగ్ యూనిట్‌ను నిర్మించాలి. ఇక్కడ పనీర్, పెరుగు, జున్ను, వెన్న, ఐస్ క్రీం, పాల పొడి కర్మాగారాన్ని తయారు చేయడానికి యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. చిత్తూరు డెయిరీ పతనానికి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కారణమని పేర్కొంటూ, నాయుడు కుటుంబానికి చెందిన ప్రైవేట్ డెయిరీ కంపెనీ అయిన హెరిటేజ్ కంపెనీ పుట్టిన తర్వాత చిత్తూరు డెయిరీ నష్టాలను చవిచూడటం ప్రారంభించిందని అన్నారు. చంద్రబాబు మూసివేసిన డెయిరీని మళ్ళి ప్రరంభిస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు. అయితే, అముల్ డెయిరీ కారణంగా జిల్లా రైతులకు ఒరిగింది ఎం లేదని రైతులు అంటున్నారు. పాల ధర కూడా ఎం పెరగలేదని, వైసిపి నాయకుల స్వార్థానికి సహకార డెయిరీ బలి అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

