బంగారుపాళ్యంలో టెన్షన్ టెన్షన్
నేడే జగన్మోహన్ రెడ్డి రాక
2 వేలకు పైగా పోలీసుల మోహరింపు
అడుగడుగునా పోలీసు నిఘా
వైసీపీ నేతలకు నోటీసులు
వాహనాల రాకపోకలపై ఆంక్షలు
పోలీసుల నియంత్రణలో మామిడి మార్కెట్ యార్డ్
బంగారుపాలెంలో అప్రకటిత కర్ఫ్యూ
బంగారుపాళ్యంలోనే ఎస్పీ మకాం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
మామిడి రైతులను పరామర్శించడానికి బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం రానున్నారు. ఈ సందర్భంగా బంగారుపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బంగారు పాల్యంలో ఆడగడుగునా పోలీసు నిఘా కొనసాగుతోంది. ఇప్పటికే బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అక్కడే మకాం పెట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంగళవారం నుంచి వాహనాల రాకపోకల మీద పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలకు నోటీసులు అందజేసి, బుధవారం రోడ్ల మీదకి రాకూడదని హెచ్చరించారు. కొందరిని బైండోవర్ చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోలీసు నిఘా కొనసాగుతోంది. వైసీపీ నాయకులు కట్టిన బ్యానర్లను పోలీసులు తొలగిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి బుధవారం బంగారుపాలెం రానున్నారు. ఎందుకు షెడ్యూలు కూడా ఖరారు అయింది. జగన్మోహన్ రెడ్డి ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.50 గంటలకు కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బంగారు పాల్యం మామిడి మార్కెట్ యార్డుకు వస్తారు. గంటపాటు మామిడి రైతులతో మాట్లాడుతారు. అనంతరం 12. 20 గంటలకు బయలుదేరి బెంగళూరు వెళ్తారు. తొలుత జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో రావడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఆయన రోడ్డు మార్గంలో బెంగళూరు నుంచి బంగారుపాలెం రావడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసు అధికారులు హెలిపాడ్ కు అనుమతించారు. షరతులతో కూడిన అనుమతిని జగన్ పర్యటనకు పోలీసుల మంజూరు చేశారు. హెలిపాడ్ వద్ద 50 మంది మాత్రమే ఉండాలని, మామిడి రైతులతో మాట్లాడుతున్నప్పుడు 500 మంది మాత్రమే ఉండాలని నిర్దేశించారు. ఇందుకు మించితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీసుల ఆదేశాలను వైసీపీ నాయకులు ఖాతరు చేస్తున్నట్లు కనిపించడం లేదు. వైసీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేస్తున్నారు. మామిడి రైతుల సమస్యల మీద జిల్లాకు వస్తున్న తమ నేతకు బలప్రదర్శన ద్వారా తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇందుకు నియోజకవర్గాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని జన సమీకరణ చేస్తున్నారు. పూతలపట్టు, పలమనేరు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు బంగారుపాళ్యానికి తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నాయకుల అంచనా ప్రకారం పదివేలకు పైగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. దీనిని నియంత్రించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు బంగారుపాలెలో అప్రకటిత కర్ఫ్యూ అమలులో ఉంది. జిల్లా ఎస్పీ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాహనాల రాకపోకల మీద ఆంక్షలు విధించారు. జగన్ పర్యటన సందర్భంగా ప్రైవేట్ వాహనాలు ఏవి తిరగకూడదని ప్రైవేటు వాహనదారులకు కూడా నోటీసులను జారీ చేస్తున్నారు. బంగారుపాళ్యం నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న నాయకులకు అలాగే పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, గంగాధర నెల్లూరులోని నాయకులకు నోటీసులను జారీ చేస్తున్నారు. కొందరిని బైండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ప్రశాంతంగా జగన్ పర్యటన జరగాలని పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జిల్లాలో తమ సత్తా చూపాలని వైసీపీ నాయకులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బంగారుపాలెంలో రెండు వేలకు పైగా పోలీసులను మోహరించారు. అడుగడుగునా పోలీసులు కనిపిస్తున్నారు. హెలిపాడ్ నుంచి బంగారుపాలెం వచ్చే దారిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంగారు బాల్యంలోకి కొత్తగా వచ్చే వ్యక్తుల మీద నిఘా పెట్టారు. బుధవారం రెచ్చగొట్టే విధంగా ఎవరైనా మాట్లాడినా, సుప్రవర్తించిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు రౌడీ షీట్ తెరవడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు గొడవలు సృష్టించవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకుగాను సాధారణ దుస్తుల్లో పోలీసులు నిఘాను పెంచారు. బుధవారం బంగారుపాళ్యానికి వచ్చే అన్ని మార్గాలలో పోలీసులు నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. బయట నుంచి వాహనాలు రాకుండా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని తొలిత తెలుగుదేశం పార్టీ వాళ్లు భావించారు. అయితే అలా చేయడం కారణంగా జగన్మోహన్ రెడ్డిని హీరో చేసినట్లు అవుతుందని, ఆ కార్యక్రమానికి విరమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి పర్యటనను నిశజంగా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద బంగారు పాల్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బల ప్రదర్శన చేయాలని వైసిపి నాయకులు భావిస్తుండగా, ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనను ముగించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

