పన్నులు, పన్నేతర వసూళ్ళలో చిత్తూరు జిల్లా ఫస్ట్
డిపిఓకు అవార్డును అందచేసిన ఉపముఖ్యమంత్రి పవన్
చిత్తూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ): గత ఆర్థిక సంవత్సరానికి పన్నులు, పన్నేతర వసూళ్ళలో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో నిలచింది. జిల్లాలో పంచాయితీల నుండి పన్నులు, పన్నేతరాలు 24.25 కోట్ల రూపాయలను వసూలు చేయల్చి ఉండగా, రూ. 22.10 కోట్లు వసూలు చేసి 88 శాతంతో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లాలో 697 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామపంచాయతీలు ఇంటి పన్ను, నీటి పన్ను, స్థలాల మీద పన్ను, గ్రంథాలయ పన్ను తదితర పన్నులను వసూలు చేస్తాయి .అలాగే పన్నేతరాలకు సంబంధించి సంతలు, టోల్ గేట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, సెల్ టవర్లు, చెరువులను వేయడం. ద్వారా పన్నేతరాలను వసూలు చేస్తాయి. ఈ పన్నుల వసూలు చిత్తూరు జిల్లా 88 శాతంతో రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచింది. అలాగే చిత్తూరు జిల్లాను చెత్తకుప్పల రహిత జిల్లాగా అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ నిర్ణయం తీసుకున్నారు. రోడ్లు పక్కన, ఇళ్ల పక్కన, పబ్లిక్ స్థలాలలో ఎక్కడ గాని చెత్తకుప్పలు ఉండకూడదని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి ఈ నెలాఖరుకు చెత్తకుప్పల రహిత జిల్లాగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 1589 స్థలాల్లో 3465 చెత్త కుప్పలను పంచాయతీ అధికారులు గుర్తించారు. వీటిని అన్నిటిని యుద్ధ ప్రాతిపదిక మీద తొలగించడానికి చర్యలు తీసుకొన్నారు. తొలగించిన స్థలంలో మళ్లీ చెత్త కుప్పలు వేయకుండా పంచాయతీ కార్యదర్శులు సంబంధిత వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోసారి చెత్త కుప్పలు వస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో చాలావరకు చెత్తకుప్పలను తొలగించారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో 90 శాతానికి పైగా చెత్త కుప్పలను తొలగించమని తెలిపారు. ఇంకా పూతలపట్టు, తవణంపల్లి, పెనుమూరు మండలాల్లో కొన్ని స్థలాల్లో రోడ్డు పక్కన, పబ్లిక్ స్థలాల్లో చెత్తకుప్పలు ఉన్నాయని, వాటిని కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాను చెత్తకుప్పల రహిత జిల్లాగా ప్రకటిస్తామని వివరించారు. రాష్ట్రంలోని పన్నులు, పన్నేతరాల వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచిన చిత్తూరు జిల్లాకు పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారని తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దుతానని తెలిపారు. జిల్లాలో వేసవి సందర్భంగా 15 రోజులకు ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం చివరి నిధులు కూడా విడుదలయ్యాయని, తొందర్లోనే ఆనిధులను గ్రామపంచాయతీలకు అందజేయడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ వివరించారు.
పో రై గంగ 1 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుండి ఉత్తమ పంచాయితీ అవార్డును అందుకుంటున్న డిపిఓ సుధాకర్

