20, ఏప్రిల్ 2025, ఆదివారం

టిడిపి జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా మంత్రి సవిత

మే నెల 15 లోపు పార్లమెంటు, అసెంబ్లీ, మండల కమిటీల ఏర్పాటు 
అలాగే తెలుగు యువత, తెలుగు మహిళ ఇతర అనుబంధ కమిటీలు 
ఇందుకు తొలుత  జిల్లా, నియోజకవర్గ స్థాయిలో త్రీమాన్ కమిటీలు 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

టిడిపి సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవితను నియమించారు. ఇటీవల పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అధ్యక్షుడుగా  రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసారు. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావుతో పాటు ఎం డి షరీఫ్, సవిత, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, దగ్గుమల్ల ప్రసాద రావు లను సభ్యులుగా నియమించారు.  రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజక వర్గాల బాధ్యతలను కేటాయించారు. 

ఈ నేపధ్యంలో సవితకు చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల ఎన్నికల నిర్వహణ బాధ్యత అప్పగించారు. ఆమె మే నెల 15 లోపు పార్లమెంటు, అసెంబ్లీ, మండల కమిటీల ఏర్పాటు చేయల్చివుంది. ఇందుకు  త్వరలో చిత్తూరులో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కుటుంబ సాధికార సమితి సభ్యులు, నాయకుల ఎంపిక ప్రారంభం అయ్యింది. వార్డు, పంచాయతీ, మండల, అసెంబ్లీ నియోజక వర్గాలు, పట్టణ, నగర, పార్లమెంటు నియోజక వర్గం కమిటీలను ఎన్నుకోవలసి ఉంటుంది. అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎమ్మెల్యేలు ఇంచార్జీలుగా ఉంటారు. ఎమ్మెల్యేలు లేని నియోజక వర్గాలలో ఇంచార్జీలను ఎన్నుకుంటారు. పార్ల మెంట్ పరిధిలోని ఏడు నియోజక వర్గాలలో  ఆరు చోట్ల టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. పుంగనూరు నియోజక వర్గం ఇంచార్జిగా చల్లా రామచంద్రా రెడ్డి ఉన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఇంచార్జి బాధ్యతలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నిర్వహిస్తున్నారు. మే నెల 15 లోపు జిల్లా, మండల, గ్రామ  కమిటీలను పూర్తి చేస్తారు. పార్టీ కమిటీలతో పాటు అనుబంధ విభాగాలు అయిన తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, తెలుగు విద్యార్థి విభాగం, బీసీ విభాగం, ఎస్సీబీ భాగం, ఎస్టీ విభాగం, మైనారిటీ విభాగం, క్రిస్టియన్ విభాగం, వైద్యుల విభాగం, న్యాయవిభాగం, అంగన్వాడీ విభాగం, తెలుగు నిపుణుల విభాగం, విభిన్న ప్రతిభావంతుల విభాగం, తెలుగు వాణిజ్య విభాగం, టిఎన్ టి యు సి, తెలుగు సాంస్కృతిక విభాగం, ఎన్నారై విభాగం, ఐటీడీపీ, బీసీ సాధికార సమితి, ఎస్సీ సాధికార సమితి కమిటీల ఏర్పాటు చేస్తారు. వీటి నిర్వహణ కోసం ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇందులో రాష్ట్ర స్థాయి నాయకుడు, ఇద్దరు పార్లమెంట్  స్థాయి నాయకులు ఉంటారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో చర్చించి సవిత ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేస్తారు. మే 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడులో జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకుంటారు. తరువాత జూన్ మొదటి వారంలో జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ నేపధ్యంలో చిత్తూరు పార్ల మెంటు అధ్యక్షునిగా గట్టి వ్యక్తిని పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్ కే రోజా వైసిపి రాజకీయ సలహా కమిటీ సభ్యులుగా ఉన్నారు. మాజీ ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి కీలక వ్యక్తిగా ఉన్నారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రభావం ఇక్కడ ఉంటుంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైసిపి జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో వారిని సమర్థవంతంగా ఎదుర్కోగల నాయకుడిని పార్లమెంటు అధ్యక్షునిక నియమించ వలసిన బాధ్యత సవితపై ఉందని అంటున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న సి ఆర్ రాజన్ రాష్ట్ర వన్నె కుల క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులు అయ్యారు. ఈ నేపధ్యంలో కొత్త అధ్యక్షుని కోసం అన్వేషణ జరుగుతున్నదని తెలిసింది.

పో రై గంగ 1 మంత్రి సవిత

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *