నెలాఖరులోపు ఈ కేవైసీ చేయకుంటే రేషన్ కట్
ఇంకా 1.06 లక్షల మంది ఈకేవైసీ చేసుకోవాలి
రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభం
ఆంధ్రప్రభ బ్యురోతో డిఎస్ఓ శంకర్
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
తెలుపు రంగు రేషన్ కార్డు లోని సభ్యులు ఈ నెలాఖరులోపు ఈ కేవైసీ చేయకుంటే మే నెల నుంచి వారికి నిత్యవసర వస్తువుల సరఫరా ఆగిపోతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి శంకర్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 1.06 లక్షల మంది ఈకేవైసీ చేయాల్సి ఉందన్నారు. దీపం పధకం కింద ఏప్రిల్ నెల నుంచి రెండవ ఉచిత సిలిండర్ ను పొందవచ్చన్నారు. ఈ అవకాశం ఆగస్టు నెల వరకు ఉంటుందన్నారు. గ్యాస్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న 5,43,203 తెలుపు రంగు కార్డులలో 17,06,359 మంది సభ్యులు ఉన్నారని డిఎస్ఓ శంకర్ తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 16 లక్షల మంది ఈ కేవైసీ చేసుకున్నారని తెలిపారు. ఇంకా లక్ష ఆరువేల మంది ఈకేవైసీ చేయించుకోవలసి ఉందన్నారు. వీరందరూ సమీపంలోని రేషన్ షాప్ డీలర్ వద్ద ఈ కేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరారు. వినియోగదారులు తమ గ్రామంలోని రేషన్ షాప్ దగ్గర మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఇతర ప్రాంతాలలో ఉన్నవారు సమీపంలోని రేషన్ షాప్ దుకాణాలలో ఈ కేవైసీ చేయించుకోవచ్చని వివరించారు. అలాగే ఇంటింటికి నిత్యావసర వస్తువులను సరఫరా చేయు ఎండియు వాహనాల వద్ద కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు. ఈకేవైసీ గడువును ఇక పొడిగించడం ఉండదని, ఈ నెలాఖరు లోపు అందరూ ఈ కేవైసీ చేయించుకోవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అలా ఈకేవైసీ చేయించుకోని లబ్ధిదారులకు మే నెల నుంచి నిత్యవసర వస్తువుల సరఫరా ఆగిపోతుందన్నారు. మన జిల్లాలో ఈ కేవైసీ చేయించుకోవాల్సిన 1.06 లక్షల మందిలో 30,500 మంది ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారని, వీరు ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలాగే 1,454 మంది 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు ఉన్నారని, మీరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మిగిలిన వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం నడుస్తుందన్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 5.80 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 3.55 లక్షల గ్యాస్ వినియోగదారులు ధారిధ్యరేఖ కన్నా దిగువన ఉన్నారని తెలిపారు. వీరికి మాత్రమే ఉచిత సిలిండర్ పథకం వర్తిస్తుందన్నారు. ఇప్పటివరకు ఈ పథకాన్ని 3.52, 982 మంది వినియోగించుకున్నారని చెప్పారు. వీరికి 28.57 కోట్ల రూపాయలను సబ్సిడీగా వారి బ్యాంకు ఖాతా ద్వారా తిరిగి చెల్లించడానికి బ్యాంకులకు జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో 28. 52 కోట్ల రూపాయలు వినియోగదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలినవి కూడా తొందర్లోనే జమ చేయడానికి బ్యాంకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. రేషన్ షాపుల ద్వారా జొన్నలను కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదన్నారు. ఎవరైనా చనిపోతే లేక ఇతర ప్రాంతాలకు వలస పోతే వారిని రేషన్ కార్డు నుంచి తొలగించే ఆప్షన్ మాత్రమే పనిచేస్తుందన్నారు. కొత్త సభ్యులను చేర్చడానికి, చిరునామా మార్పు, ఇతరాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని జిల్లా పౌరసరఫరాల అధికారి శంకర్ వివరించారు.
పో రై గంగ 1 డిఎస్ఓ శంకర్

