నాయకులు జాస్తి - అభివృద్ధి నాస్తి
అభివృద్దికి ఆమడ దూరంలో పెనుమూరు మండలం
కక్షలు, కార్పణ్యాలు, వర్గపోరు, ఆధిపత్యపోరు ఎక్కువ
ఎవరు అధికారంలో ఉన్నా, ఆధిపత్యం నిలుపుకోవడం ముఖ్యం
స్వపక్షంలో మరో వర్గాన్ని దెబ్బతీయడానికి వైరి పార్టీలతో స్నేహం
కోర్టు కేసులతో మండల ఆదాయానికి గండి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
మండల కేంద్రం అయిన పెనుమూరులో రాష్ట్ర స్థాయి నాయకులు ఎక్కువ. ఈ నాయకులలో కొందరికి మండలం అభివృద్ధి మీద ఆశక్తి లేదు. తమ స్వార్థమే పరమావధిగా పనిచేస్తున్నారు. మండలంలో ఉన్న ప్రధాన పార్టీలు అయిన తెలుగుదేశం, వైసిపి వర్గవిభేదలకు పెట్టింది పేరు. ఎవరు అధికారంలో ఉన్నా, ఈ వర్గాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి కృషి చేస్తున్నాయే తప్ప, చిత్త శుద్దితో మండల అభివృద్దికి కృషి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకు అనుకునంగానే మండలంలో నాయకుల పనితీరు ఉంది. నాయకులు తమ ఆధిపత్యాన్ని నిలపెట్టుకోవడానికి, తమ పార్టీలోని మరో వర్గాన్ని దెబ్బతీయడానికి ఇతర వైరి పార్టీలతో చేతులు కలుపడానికి సైతం వెనుకాడడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసిపి వారికిసాయం చేస్తే, పాముకు పాలు పోసినట్లు అని స్పష్టం చేశారు. అటువంటి వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించినా, ఆ పార్టీ నాయకులలో మార్పు రాలేదు. ఈ కక్షలు, కార్పణ్యాలు, వర్గపోరు, ఆధిపత్యపోరు పెనుమూరు మండలానికి శాపంగా మారింది. దీని ప్రభావం మండల అభివృద్ధి మీద పడుతోంది. ఈ మండలానికి రావడానికి మండల స్థాయి అధికారులు కూడా భయపడుతున్నారు. స్థానిక నాయకులు కొందరి స్వార్థం వల్ల అభివృద్ధికి అవరోధం కలుగుతోంది.
తాజాగా జరిగిన బస్టాండు వాణిజ్య సముదాయం షాపుల వేలం వ్యవహారం దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. వైసిపి నాయకుల చొరవతో ఏడాది కిందట బస్టాండు కాంప్లెక్స్ లో 1.08 లక్ష రూపాయల జిల్లా పరిషత్ నిధులతో 24 గదులు నిర్మించారు. మాజీ ఎంపి, మాజీ ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి చొరవతో ఈ నిర్మాణం చేపట్టారు. ఆయన అన్న కుమారుడు దయాసాగర్ రెడ్డి కాంట్రాక్టర్ గా నిర్మాణం పూర్తి చేశారు. అయితే నిర్మాణ దశలో అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులు టిడిపి నేతల సహకారంతో అడ్డుపడ్డారు. దీంతో అప్పటి ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి టిడిపి మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడుతో సంప్రదించి రాజీ కుదిర్చారు. వైసిపికి 14, టిడిపికి 10 గదులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే నిర్మాణం పూర్తి అయ్యే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో గదుల వేలం ఆగిపోయింది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రావడంతో టిడిపి నేతలు అన్ని గదులు తామే దక్కించుకునే ప్రయత్నం చేశారు. అయితే చట్టం ప్రకారం వేలం వేయక తప్పదని అధికారులు చెప్పడంతో ప్రత్యామ్నాయం ఆలోచిస్తూ ఏడు నెలలు గడిపేశారు. దీంతో పాటు సంత గేటు, ఆటో స్టాండు వేలం ఆపేసి కొందరు నాయకులు వసూలు చేసి, నామమాత్రంగా పంచాయతీకి చెల్లిస్తూ వచ్చారు. ఈ విషయం తెలిసిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జనవరి పదవ తేదీ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. పవన్ ఆదేశాలతో అధికారులు వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 17 వ తేదీన సంత గేటు, ఆటో స్టాండు వేలం వేశారు. రెండు రోజుల తరువాత 19 వ తేదీన బస్టాండు గదుల వేలం వేశారు. ఉన్న 24 గదుల కోసం 380 మంది డిడి లు చెల్లించి వేలం పాటకు సిద్ధం అయ్యారు. అయితే స్థానికి టిడిపి నేతలు అందరిని భయపెట్టి, ఇతర పార్టీ నాయకులతో కలసి, నామ మాత్రపు ధరలకు పాడుకుని పంచుకున్నారు. ఎస్సీలకు కేటాయించిన నాలుగు గదులు, ఎస్టీలకు కేటాయించిన ఒక గది కూడా బినామీ పేర్లతో దక్కించుకున్నారు. ఇందులో టిడిపి వారికి 17, వైసిపి వారికి ఐదు బిజెపి, జనసేన వారికి ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. దీనితో మండలానికి చెందిన జ్ఞానేంద్ర రెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు దళిత నేతలు హై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఈ వ్యవహారంలో తీర్పు ఎప్పటికీ వస్తుందో చెప్పలేమన్నారు. అప్పటి వరకు బస్టాండ్ లోని షాపుల వాళ్ళ పంచాయితికి రావల్చిన ఆదాయం ఆగిపోతుంది. ఈ బస్టాండు వివాదం 27 ఏళ్లుగా కొనసాగుతోంది. 1987 లో బస్టాండ్ మూసివేసి అల్లాల చెరువు వద్ద కొత్తగా ఏర్పాటు చేసారు. అయితే అప్పటిలో సమితి అధ్యక్షునిగా ఉన్న జ్ఞానేంద్ర రెడ్డి వర్గం వారు స్టే తెచ్చారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ బి సుధాకర్ రెడ్డి తన అనుచరులతో బాంబులు వేసి బస్టాండు గోడలు పగుల గొట్టి, బస్సులను నిలిపి స్టే రావడానికి సహకరించారని కొందరు తెలిపారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతుందని అంటున్నారు. కాగా నాయకుల మధ్య సమన్వయం లేక పోవడం వల్ల నేండ్రగుంట - పెనుమూరు రోడ్డు విస్తరణకు నోచుకోలేదని అంటున్నారు. పులిగుండు అభివృద్ధి, ఎన్టీఆర్ జలాశయం నుంచి 32 చెరువులకు నీటి అనుసంధానం ఆగిపోయిందని అంటున్నారు. మండలానికి చెందిన బి ఆర్ నాయుడు టిటిడి చైర్మన్ గా ఉన్నప్పటికీ కలికిరి కొండ అభివృద్ధికి కృషి జరగడం లేదంటున్నారు. కాగా పెనుమూరు పంచాయతీలో చార్వకానిపల్లె పంచాయతీ విలీనం చేయడంపై కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. దీంతో ఆ పంచాయితిలో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు అగినందున పంచాయితీకి రావల్చిన 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏడాదికి 27 లక్షలు ఆగి పోయాయి. అలాగే బుస్తండులోని దుకాణాల వేలం మీద కోర్టు స్టే విధించడంతో షాపుల కేటాయింపు ప్రక్రియ ఆగిపోయింది. దీంతో షాపుల వల్లా పంచాయాతికి రావల్చిన ఆదాయం ఆగిపోయింది. దీని వల్ల పంచాయతీలో నిధుల కొరత ఏర్పడింది. నిధుల కొరత కారణంగా మండలంలో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి.
పో రై గంగ 1 పెనుమూరు బస్టాండులో నిర్మించిన దుకాణాల సముదాయం
పో రై గంగ 1 పెనుమూరు బస్టాండులో నిర్మించిన దుకాణాల సముదాయం

