త్వరలో నామినేటెడ్ పదవుల నాలుగో జాబితా
ఐ వి ఆర్ ఎస్ ద్వారా అభ్యర్ధులపై ప్రజాభిప్రాయం సేకరణ
జిల్లాకు కార్పోరేషన్ చైర్మన్ పదవులు దక్కే అవకాశం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పదవుల నాలుగో జాబితా విడుదల అవుతుందని తెలిసింది. గత రెండు రోజులుగా కొందరు కార్యకర్తలకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ( ఐ వి ఆర్ ఎస్) కాల్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేల సిఫారసు, రాబిన్ శర్మ బృందం సర్వే, ప్రోగ్రామ్స్ కమిటీ రిపోర్టు ఆధారంగా టిడిపి నేతల ఎంపిక జరుగుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో విడుదల చేసిన రెండు జాబితాల్లో 80 రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవులు ఇచ్చారు. మూడవ జాబితాలో 47 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్ ల నియామకం జరిగింది. ఇంకా 60 రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ లు, 171 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, 21 దేవాలయాల పాలక మండళ్ల నియమానికి కసరత్తులు జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు నేతలకు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే జిల్లాలోని 10 కి పైగా మార్కెట్ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగే అవకాశం ఉంది. అలాగే కాణిపాకం, బోయకొండ ఆలయాల పాలక మండలి నియామకం జరిగే అవకాశం ఉందంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆచితూచి అడుగు వేస్తుండడంతో కాస్త జాప్యం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం కోసమే విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. వీటితోపాటే దేవాయలయ కమిటీలనూ ప్రకటించే అవకాశం ఉంది. మిగతా నియామకాలు కూడా 15 రోజుల్లో పూర్తిచేసేయాలని భావిస్తున్నారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (సింగిల్ విండో)ల భర్తీపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,250 సింగిల్ విండోలు ఉన్నాయి. వీటికి చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నామినేటెడ్ చైర్మన్లు లేదా పర్సన్ ఇన్‌చార్జులతో నడిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గానికి చెందన పిఎస్ మునిరత్నంను ఆర్టీసీ వైస్ చైర్మన్ గా, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ ను రాష్ట్ర ఎన్నికల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా, పెనుమూరు మండలానికి చెందిన బి ఆర్ నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా, చిత్తూరు కార్పొరేషన్ మాజీ మేయర్ హేమలతను చూడ చైర్మన్ గా నియమించారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో ఇద్దరు బీసీలకు, ఒక కమ్మ, ఒక బలిజ కులస్తులకు పదవులు దక్కాయి. రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు లభించలేదు. ఈ జాబితాలో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా జరిగే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఒకరిద్దరికి కార్పోరేషన్ చైర్మన్ పదవులు లభించే అవకాశం ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పలువురు నాయకులు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ ల మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ జాబితాలో కాణిపాకం, బోయకొండ గంగమ్మ దేవస్థానాల పాలకమండళ్ళను నియమించే అవకాశం ఉంది.

