29, ఏప్రిల్ 2025, మంగళవారం

మందకొడిగా టిడిపి గ్రామ, మండల కమిటీల ఏర్పాటు

 పార్టీ పదవుల పట్ల క్యాడర్ లో  అనాశక్తి 

జిల్లాలో పర్యటించని  ఎన్నికల ఇంచార్జి మంత్రి 

పనుల వత్తిడితో దృష్టిని కేంద్రకరించని ఎమ్మెల్యేలు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

జిల్లాలో తెలుగు దేశం గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పట్ల కార్యకర్తలు ఉత్సాహం చూపడం లేదు. కమిటీల ఏర్పాటు నత్త నడక నడుస్తోంది. జిల్లాకు పార్టీ ఎన్నికల పరిశీలకురాలుగా నియమితులైన మంత్రి సవిత ఇప్పటి వరకు జిల్లాలో పర్యటించలేదు. చంద్రబాబు స్వంత జిల్లాలో కూడా కార్యకర్తల్లో నిస్తేజం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ పదవులు తీసుకుంటే, నామినేటెడ్ పదవులు వస్తాయో, రావో అన్న అనుమానం కూడా నాయకుల్లో వ్యక్తం అవుతోంది. నాలుగు రోజుల క్రితం  జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, పార్టీ సంస్థాకత ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది. రాష్ట్రంలో కేవలం 25 శాతం నియోజక వర్గాలలో మాత్రమే అనుకున్న రీతిలో కమిటీల ఏర్పాటు జరుగుతున్నదని తెలిసింది. 


చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో కొంత చలనం కనిపిస్తోంది. మిగిలిన ఆరు నియోజక వర్గాలలో  కొన్నింటిలో ఇంకా కమిటీల ప్రక్రియ ప్రారంభం కాలేదని అంటున్నారు. జిల్లాలో ఆరు చోట్ల పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పుంగనూరు నియోజక వర్గంలో చల్లా రామచంద్రా రెడ్డి ఇంచార్జి గా ఉన్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కమిటీల ఏర్పాటు వ్యవహారం చూస్తున్నారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు, ఇంచార్జి, పార్టీ నియోజక వర్గం పరిశీలకులు కమిటీల బాధ్యత నిర్వహించవలసి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యేలు, పరిశీలకులు ఉత్సాహం చూపడం లేదు. అలాగే మిగిలిన వివిధ స్థాయి నాయకులు కమిటీల ఏర్పాటు పట్ల శ్రద్ధ చూపడం లేదు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో జరుగుతున్న జాప్యమే దీనికి ప్రధాన కారణం అని కొందరు సీనియర్ నాయకులు చెపుతున్నారు. గత ఐదేళ్లు  అనేక కష్టాలు పడి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇప్పుడు తగిన గుర్తింపు దొరకడం లేదన్న అసంతృప్తి అన్ని స్థాయిల్లో వ్యక్తం అవుతోంది. జిల్లాలోని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులకు పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనతి కాలంలోనే నామినేటెడ్ పదవులు ఇచ్చారు. చంద్రబాబు అధికారం చేపట్టి పదిన్నర నెలలు కావస్తున్నా ముఖ్యమైన నేతలకు పదవులు ఇవ్వడం లేదు. అతి కొద్ది మందికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చారు. అదికూడా ఎమ్మెల్యేలు చెప్పిన వారికి ఇచ్చారు తప్ప నిజంగా కష్టపడిన వారిని పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాణిపాకం, బోయకొండ గంగమ్మ ఆలయాల పాలక మండళ్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా గ్రంథాలయ సంస్థ, పలు మార్కెట్ కమిటీల ఏర్పాటు కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు. కొందరు నాయకులు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవులు ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు, నారా లోకేష్ నాయకులను పట్టించుకోవడం లేదన్న ఆవేదన పలువురిలో వ్యాక్యం అవుతోంది. పదవులు పక్కన పెడితే చంద్రబాబు కనీసం కలవడానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటున్నారు. మంత్రి లోకేశ్ ఎవరైనా కలిస్తే కసురుకుంటు ఉన్నారని కొందరు అంటున్నారు. ఈ నేపధ్యంలో కమిటీల ఏర్పాటు పట్ల ఎవరు తగిన శ్రద్ధ, ఆసక్తి చూపడం లేదు. కాగా ఈ నెల ఆఖరు లోగా గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, పరిశీలకులకు మార్గ దర్శకాలు పంపింది. మే నెల 15 లోపల పార్లమెంటు కమిటీలు ఏర్పాటు.చేయాలని నిర్దేశించారు. మే 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడులో పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటారు. జూన్ మొదటి వారంలో జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తారు. కాగా ప్రతి మండలంలో గ్రామ కమిటీలు, మండల కమిటీ, అనుబంధ సంస్థల కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలు పంపారు. గ్రామ కమిటీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఒక్కొకరు ఉంటారు. ముగ్గురు కార్య నిర్వాహక కార్యదర్శులు, ముగ్గులు కార్యదర్శులు కలిపి మొత్తం పది మంది ఉండాలి. అలాగే తెలుగు యువత, ఐటీడీపీ, తెలుగు రైతు, తెలుగు మహిళ, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలు  ఎనిమిదింటికి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. అలాగే మండల కమిటీకి అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఏడుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ముగ్గురు కార్యదర్శులు, కోశాధికారి ఉండాలి. గ్రామ స్థాయి అనుబంధ సంస్థలతో పాటు కల్చరల్, డాక్టర్స్, ఎస్ హెచ్ డి గ్రూపు, క్రిస్టియన్, దివ్యాంగుల విభాగాలకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలి. మండల నియోజక వర్గంలోని సగం మండలాలలో ఎస్సీ, బీసీలకు అవకాశం కల్పించాలి. మండల అధ్యక్షుడు ఓసీ అయితే ప్రధాన కార్యదర్శి ఎస్సీ లేదా బీసీ ఉండాలి. ఎస్సీ లేదా బీసీ మండల అధ్యక్షుడు అయితే ఓసీ వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా ఉండాలి. అలాగే మిగిలిన కార్యవర్గంలో సామాజిక న్యాయం పాటించాలి. పార్ల మెంటు కమిటీలు, అనుబంధ కమిటీలు కూడా మండల కమిటీల లాగే ఏర్పాటు చేయాలని పార్టీ నిర్దేశించింది. అయితే ప్రతి పక్షంలో పార్టీ కమిటీలకు పోటీ పడుతారు,  అధికారం వచ్చిన తరువాత నామినేటెడ్ పదులు కోరుకుంటారు తప్ప పార్టీ పదవులు ఎందుకని  కొందరు నోరు చప్పరిస్తున్నారు.

పో రై గంగ 1 టిడిపి లోగో 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *