చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు పట్ల ప్రభుత్వ తీవ్ర అసంతృప్తి
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయని ఆవేదన
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వినతి
2025 - 26 బడ్జెట్ అంచనాలకు సమావేశం ఆమోదం
చిత్తూరు, ఏప్రిల్ 29 (ఆంధ్రప్రభ బ్యూరో): చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు డాక్టర్ ఎంవి థామస్ తీతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయని, పేదలు లక్షలాది రూపాయలను ప్రైవేటు ఆసుపత్రులలో వ్యయం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జెడ్ పి సమావేశపు మందిరంలో జెడ్పి ఛైర్మన్ ఆధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, జి.డి నెల్లూరు శాసన సభ్యులు వి.ఎం.థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎంఎల్ఏ కె.మురళిమోహన్, జెడ్పిటిసి లు, ఎంపిటిసి లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్న ఎం ఆర్ ఐ, సిటి స్కాన్ వసతులను వినియోగించి అత్యవసర పరిస్థితులలో క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవ సమయంలో చిన్న చిన్న కారణాల రీత్యా గర్భవతులను ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారని తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని తెలిపారు. పాలసముద్రం మండలానికి సంబంధించి గంగమాంబపురంలో పి హెచ్ సి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయగా ప్రజలకు అనుగుణంగా ఉండేలా పి హెచ్ సి నిర్మాణాన్ని తిరుమల రాజపురంలో ఏర్పాటు చేయాలని కోరారు. వితంతు పెన్షన్ ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధులతో జిల్లాలో వేసవి కాలంలో ఎక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి నిధుల కొరత లేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి ఉత్తీర్ణతలో వెనుకబడిన పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు తగ్గిన పాఠశాలలలో ప్రత్యేక శ్రద్ధతో ఉత్తీర్ణతా శాతం పెంచటంతో పాటు మెరుగైన విద్యా బోధన చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ, నరేగా పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని, తాగునీటి ఏర్పాట్ల పై సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవసాయ భూమిలో ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుకు రుసుము చెల్లించిన రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. నరేగా నిధులతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.కుప్పం నియోజకవర్గంలో వంద శాతం సోలరైజేషన్ లో భాగంగా వెండర్లను గుర్తించి మే 1 నుండి పనులు ప్రారంభించుటకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయిల్ ఫామ్ ల ద్వారా చెరకు పంట కంటే 4 రెట్లు అధిక ఆదాయం పొందవచ్చని, ఆయిల్ ఫామ్ ల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు తెలియపరచాలన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, వైద్య సేవలు, మందుల పంపిణీ, వైద్య పరీక్షల ను పకడ్భందీగా నిర్వహిస్తున్నామని, కొంత మంది స్పెషలిస్ట్ డాక్టర్ లను నియమించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వంకు నివేదించామన్నారు. జడ్పీపీ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాఠశాలలలో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనుల్లో అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసి వాడుకలోనికి తీసుకొని రావాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు చేపట్టిన పనులను పూర్తి చేయడంలో కొంతవరకు నిధులు మంజూరు చేయడం జరుగుతున్నదని, ఉపాధి హామీ నిధులతో కాంపౌండ్ వాల్ ప్లేగ్రౌండ్ తదితర పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ ఫలితాలలో జిల్లా వెనుకబడి ఉన్నదని విద్యా ప్రమాణాల పెంపుపై విద్యాశాఖ అధికారులు శ్రద్ధ చూపాలని రామకుప్పం జడ్పిటిసి తెలుపగా ఈ అంశంపై జిల్లా విద్యా శాఖ అధికారి వరలక్ష్మి వివరిస్తూ పదవ తరగతిలో వెనుకబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వెనకబడిన విద్యార్థుల విద్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. కుప్పంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్నారని, ఫీజుల చెల్లింపుకు సంబంధించిన బోర్డులను డిస్ప్లే చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. తమిళనాడు రాష్ట్రంలో ఆర్ఎంపీ డాక్టర్లను ప్రభుత్వం నిషేధించడం జరిగిందని, కుప్పంలో ఎక్కువమంది ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేయడం వల్ల క్యాన్సర్, కిడ్నీ బాధితులు ఎక్కువ అవుతున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి జిల్లా పాకాలలో వీఆర్వోలు, పంచాయతీ సెక్రెటరీల పోస్టుల ఖాళీ ఎక్కువగా ఉన్నాయని, పాకాల లో మేజర్ పంచాయతీలు ఉన్నందున గ్రేడ్- 1పంచాయతీ సెక్రెటరీ లను నియమించాలని, నాబార్డ్ నిధులతో పాకాల జడ్పీ హెచ్ ఎస్ స్కూల్ చేపట్టిన పనులు నిలిచిపోయాయని, 108 వాహనంలో ప్రథమ చికిత్సకు అవసరమైన సదుపాయాలు కూడా లేవని ఈ అంశాన్ని పరిశీలించాలని పాకాల జడ్పిటిసి కోరకోరారు. ఈ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పంచాయతీ సెక్రెటరీలకు పదోన్నతులు ఇవ్వడం జరుగుతున్నదని, అవకాశం మేరకు పంచాయతీ సెక్రెటరీల పోస్ట్ లను భర్తీ చేస్తామని తెలిపారు. 108 ద్వారా అందించే వాహన సేవలకు సంబంధించి మెరుగైన వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని వైద్యశాఖ అధికారులు వివరించారు. తిరుపతి జిల్లా పేరూరు చెరువులోకి అపార్ట్మెంట్ల నుండి డ్రైనేజీను వదులుతున్నారని డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తిరుపతి రూరల్ జెడ్పిటిసి కోరారు. ఈ అంశంపై ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ వివరిస్తూ పేరూరు చెరువు ను పరిశీలించడం జరిగిందని, డ్రైనేజీ కాలువ నిమిత్తం ప్రతిపాదనలను పంపడం జరిగిందని వివరించారు. ఎర్రావారిపాలెంలో వేసవి కాలం అయినందున ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతున్నదని, సబ్ స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ను అందుబాటులో ఉంచాలని ఎర్రవారిపాలెం జడ్పిటిసికోరారు. ఈ అంశం పై ట్రాన్స్కో అధికారులు స్పందిస్తూ ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో 5 ట్రాన్స్ ఫార్మర్స్ లు అందుబాటులో ఉంచడం జరుగుతున్నదని వివరించారు. తిరుపతి జిల్లా వికృతమాల పంచాయితీలో పంచాయితీ నిధులు దుర్వినియోగం చేశారని, అయినప్పటికీ వారికి పదోన్నతి కల్పించడం జరిగిందని, ఈ అంశం పై తిరుపతి డిపిఓకు పిర్యాదు చేశామని జెడ్పీటీసీ తెలుపగా.. ఈ అంశంను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ తిరుపతి డి ఆర్ ఓ కు సూచించారు. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి 44.05 కోట్ల రూపాయల మిగులుతో రూపొందించిన బడ్జెట్ జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం ఆమోదం తెలిపింది. అలాగే 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి నికర బడ్జెట్ కు, 2024- 25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ కు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తిరుపతి డి ఆర్ ఓ నరసింహులు, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జిల్లా అధికారులు ఆర్&బి, పిఆర్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ లు సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, ఇస్మాయిల్, డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపిసి వెంకటరమణ,డిఆర్డిఏ, ఐసిడిఎస్ పిడి లు శ్రీదేవి, వెంకటేశ్వరి, వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపి, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీ కృష్ణ, మధుసూదన్ రెడ్డి, ఆరిఫ్, బాలసుబ్రమణ్యం, హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, డిపిఓ సుధాకర్ రావు, డి సి హెచ్ ఎస్ పద్మాంజలి, జిల్లా సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు చెన్నయ్య, చిన్నారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పిటిసిలు, ఎం పి పి లు పాల్గొన్నారు.
పో రై గంగ 1 జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడుతున్న థామస్
గంగ 2 జిల్లా కలెక్టర్
గంగ 3 జిల్లా పరిషత్ చైర్మన్
గంగ 4 సమావేశానికి హాజరైన సభ్యులు, అధికారులు

