ఈ సారి కూడా తగ్గనున్న మామిడి పంట
ఆలస్యంగా ప్రారంభమైన మామిడి సీజన్
అనుకూలించని వాతావరణ పరిస్థితులు
50 శాతం పంట కూడా సందేహమే
మామిడిని చుట్టుముట్టుతున్న చీడపీడలు
గిట్టుబాటు ధరకై రైతుల నిరీక్షణ
నేడే మామిడి అమ్మకందారుల, కొనుగోలుదారుల సమావేశం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లా రైతులను మామిడి పంట ఈ సంవత్సరం కూడా దగా చేసింది. గత సంవత్సరం మామిడి పంట గణనయంగా తగ్గింది. గత సంవత్సరం పంట తగ్గడంతో ఈ సంవత్సరం మామిడి పంట భారీగా వస్తుందని మామిడి రైతులు ఆశపడ్డారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో మామిడి పూత నెలన్నర ఆలస్యంగా వచ్చింది. పూత భారీగా వచ్చినా, ఆ పూత నిలవలేదు. గత సంవత్సరంకంటే ఈ సంవత్సరం మరింత దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఈ సంవత్సరం మామిడికి పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణం జిల్లాలో కనిపించింది. పగటిపూట ఎండలు కాసినా, రాత్రి మంచు భారీగా కురవడంతో జిల్లాలో మామిడి పంట ఆలస్యమైంది. పూత ఆలస్యమైనా, దిగుబడి బాగా వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. అక్కడక్కడ మామిడి కాయలు కనిపించినా, వాటికి రకరకాల రోగాలు వస్తున్నాయి. మామిడి చెట్లను మంగు ముంచెత్తుతోంది. చెట్లు నల్లగా మారిపోతున్నాయి. మామిడికాయలలో రింగురోగం అప్పుడే కనిపిస్తుంది. కాడ వద్ద నల్లగా వచ్చి, కొద్దిరోజులకే మామిడి నేల రాలుతోంది.
ఈ సంవత్సరం కాపు తక్కువగా వచ్చినా, వచ్చిన కాపు కూడా నిలుస్తుందన్న నమ్మకం లేదు. ఈ పర్యాయం గత సంవత్సరం కంటే తక్కువ పంట రావచ్చని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. పంట తక్కువైనా, గిట్టుబాటు ధర విషయంలో కూడా సందిగ్ధత కొనసాగుతోంది. గత సంవత్సరం పంట 20 నుంచి 30 శాతం మాత్రమే వచ్చింది. అయినా మామిడి కిలో ధర 20 రూపాయలు కూడా పలకలేదు. మామిడి కిలోకు 20 రూపాయలకు తక్కువ కాకుండా చెల్లించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాలను జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలు పాటించలేదు. దీంతో గత సంవత్సరం పంట లేక, గిట్టుబాటు ధర లేక రైతుల తీవ్రంగా నష్టపోయారు. చిత్తూరు జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా, ఉమ్మడి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న మామిడి తోటల నేపద్యంలో మామిడికాయలను పల్ప్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 47 మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవి 2023లో 8 లక్షలు మెట్రిక్ టన్నుల మామిడికాయలను కొనుగోలు చేసి తద్వారా నాలుగు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. 2024 సంవత్సరంలో మామిడి పంట గణనయంగా తగ్గింది. దీంతో నాలుగు లక్షల మామిడి కాయలను క్రస్సింగ్ చేసి రెండు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అయిన పల్ప్ ఎక్కువగా యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాగే కొంత గల్ఫ్ దేశాలకు, సింగపూర్ కూడా ఏగుమతి అవుతుంది. జిల్లాలో తయారయ్యే మామిడి పల్పు మనదేశంలో వినియోగం చాలా తక్కువ. మన దేశంలోని స్లైడ్, మాజా, రియల్, ఫ్రూటీ, గల్లా వంటి జ్యూస్ లు తయారు చేస్తారు. గత సంవత్సరంగా జరుగుతున్న అమాస్ ఇజ్రాయిల్ యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్దాల కారణంగా ఇతర దేశాలకు చిత్తూరు నుండి మ్యాంగో పల్ప్ ఎగుమతి ఆగిపోయింది. గత రెండు సంవత్సరాలలో తయారైన మామిడి పల్ప్ ఇంకా 2.85 లక్షల టన్నుల నిల్వ ఉంది. కావున రైతులు మామిడి మీద వ్యయం తగ్గించాలని జ్యూస్ ఫాక్టరీల అసోసియేషన్ రైతులను హెచ్చరించింది. అంటే.. ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధర ఉండదని చెప్పకనే చెప్పారు. ఒకవైపు జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకుండా రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరో వైపు ప్రపంచంలో జరుగుతున్న యుద్దాల కారణంగా మామిడి గుజ్జు ఎగుమతికి నోచుకోకుండా రైతులు నష్టపోయే పరిస్థితి ఎదురవుతుంది. నెలన్నర ఆలస్యంగా చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం మామిడి పూత విరగపూసింది. ఎక్కడ చుసిన మామిడి పూత విపరీతంగా కనిపించింది. గత ఏడాది దిగుబడులు తగ్గినా, ఈసారి భారీగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశపడ్డారు. గత సంవత్సరం దిగుబడి రాకపోవడంతో పాటు గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి పూత ఆలస్యం అయినా, భారీగా దిగుబడులు వస్తాయన్న రైతన్న ఆశలు అడిఅశాలు అయ్యాయి. భారీగా వచ్చిన పూత నిలువలేదు. చాలా చెట్లకు పూతకు బదులు ఇగుర్లు వచ్చాయి. గత రెండు సంవత్సరాలుగా జిల్లాలో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేసిన పల్ప్ నిల్వలు ఎక్కడికక్కడ పెరుకుపోయాయి. విదేశాల్లో జరుగుతున్న యుద్దాల కారణంగా జిల్లాలో మామిడి పల్ప్ ఎగుమతి ఆగిపోయింది. దీంతో ఈ పర్యాయం మామిడి రేట్లు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో అధిక వర్షాలు పడడం, రాత్రి వేళలో చలితీవ్రత పెరగడం, తెగుళ్ల ప్రభావం వల్ల ప్రస్తుతం ఆశించిన మేరకు తొలుత పూత రాలేదు. అధిక వర్షా లు, తీవ్రమైన చలి పరిస్థితులు మామిడిపై ప్రభావం చూపాయి. మామిడి పంటకు వేడి వాతావరణం అవసరం. ఈ సీజన్ లో నవంబర్ నెల ఆఖరి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ నెలలో కూడా వర్షాలు పడ్డాయి. దీంతో జిల్లాలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. జిల్లాను చలి గడగడలాడించింది. ఉదయం 8 గంటలైన మంచు కురిసింది. మళ్లీ సాయంకాలం నాలుగు గంటలకే మంచు ప్రారంభం అయ్యింది. అయితే నెలన్నర ఆలస్యంగా మామిడి పూత ప్రారంభమైంది. జిల్లాలో పగటిపూట ఎండలు మండుతున్న, రాత్రిపూట చల్లని వాతావరణం కొనసాగింది. దీంతో మామిడి చెట్లలో వచ్చిన పూత నేల రాలింది. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలవవలసిన ప్రజా ప్రతినిధులు ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మామిడి బీమా పథకం జిల్లాలో విజయవంతం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ బీమా పథకం రైతులకు అర్థం కాకపోవడంతో జిల్లాల్లో 10 శాతం రైతులు కూడా మామిడి బీమా చెల్లించలేదు. జిల్లాలో మామిడి రైతులు ఆదుకోవడానికి మామిడి బోర్డ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతున్న ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్తూరులో జరగనున్న మామిడి అమ్మకందారుల, కొనుగోలుదారుల సమావేశం మామిడి రైతులకు దిశా నిర్దేశం చేస్తుందని మామిడి రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
పో రై గంగ 1 మామిడి చెట్టు

