విలేకరులు సమాజానికి మార్గదర్శకులుగా పని చేయాలి
మెరిట్ సాధించిన జర్నలిస్ట్ ల పిల్లలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం
ఏపిడబ్యూజేఎఫ్ జిల్లా మహాసభలో మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి
చిత్తూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రప్రభ బ్యూరో): ప్రజాస్వామ్యంలో నాల్గవ స్థంభం మీడియా అని, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే మార్గదర్శకులుగా భాద్యతతో పని చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జెడ్పి సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ నాల్గవ మహా సభలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్, కె. మురళి మోహన్, ఏపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకట రావ్, జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జయరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు సాటి గంగాధర్, జిల్లా అధ్యక్షులు బి.ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సలీంభాష, ఏపిబిజెఏ (ఎలక్ట్రానిక్ మీడియా) జిల్లా అధ్యక్షులు చాలా జయచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.నీరజాక్షులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మీడియా వృత్తి చాలా మహోన్నతమైన వృత్తి అని, చాలా మంది కార్గిల్ లాంటి క్లిష్ట పరిస్థితులలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజం పట్ల అవగాహన కలిగి, ప్రేమతో సేవలందిస్తున్నారన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడం లో మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం మెరిట్ సాధించిన జర్నలిస్ట్ ల పిల్లలకు తన వంతు సహాయంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. వార్తలు ప్రచురించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా వార్తా ప్రసారాలు ఉంటే ప్రజలలో విశ్వసనీయత పేరుగుతుందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం తో కలసి పని చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు గృహ నిర్మాణం, హెల్త్ కార్డులను సమకూరుస్తున్నారని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పాత్రికేయులకు అందించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పాత్రికేయులు ఒత్తిడులు లేకుండా పూర్తి స్వేచ్చతో పని చేయాలని, ఖచ్చితమైన సమాచారంతో వాస్తవాలను ప్రజల ముందుంచాలని తెలిపారు. సామాన్య ప్రజలు సమాచారం కొరకు వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్ ను ఆశ్రయిస్తుంటారని, పూర్తి సమాచారంతో వార్తా ప్రసారాలు చేయాలని కోరారు. ప్రజా సమస్యలను ముందుకు తీసుకువచ్చి పరిష్కారం చూపేలా వార్తలు ఉండాలని సూచించారు. పాత్రికేయ వృత్తి చాలా పవిత్రమైనదని, పారదర్శకంగా సమాజ హితం కోసం పని చేయాలని తెలిపారు. పత్రికారంగంలో సముచితమైన విమర్శలు అవసరమని, సమాజం లోని సమస్యలను అర్థవంతంగా తెరపైకి తీసుకురావలన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కోరారు. చిత్తూరు శాసన సభ్యుడు గురుజాల జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ సమాజంలో జరిగే విషయాలను వాస్తవంగా ప్రచురించడం ద్వారా పాత్రికేయుల విలువలు పెరుగుతాయని, నియోజకవర్గంలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్ట్ లకు గృహాల మంజూరు విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానన్నారు. భయం పక్షపాతం లేకుండా, కులం, పార్టీలకు అతీతంగా వార్తలను ప్రచురించే స్వేచ్చ పత్రికారంగానికి ఉండాలన్నారు. పాత్రికేయులకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటానన్నారు. పూతలపట్టు ఎం ఎల్ ఏ మురళీమోహన్ మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పడంలో పత్రికా రంగం ముందుండాలని, సమాజం లోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి వారిని చైతన్య పరచాలని తెలిపారు. జర్నలిస్ట్ ల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాద్యతతో వ్యవహరిస్తున్నారన్నారు. పాత్రికేయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు రానున్న రెండు దశాబ్ధాల కాలం వరకు పాత్రికేయులకు రక్షణ కవచంగా పని చేస్తుందన్నారు. పాత్రికేయులను సమాజం గొప్ప దృషితో చూస్తుందన్నారు. వ్యవస్థలు గాడితప్పే సమయంలో మీడియా వ్యవస్థ దారిలో పెట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి వెనకడుగు వేయబోయనని తెలిపారు. నిజాన్ని నిర్భయంగా వెలికితీయడంలో పత్రికా రంగం స్వేచ్ఛగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా చిత్తూరు శాసన సభ్యులు తన సొంత నిధులతో 400 మంది పాత్రికేయుల హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన మొత్తం రూ.5,20,000 కు సంబంధించిన మెగా చెక్కు ను పాత్రికేయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో, మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, పుంగనూరు టిడిపి ఇంచార్జి చల్లా బాబు, సికే బాబు సతీమణి లావణ్య బాబు, ఫెడరేషన్ గౌరవ సలహాదారులు వి. కృష్ణ, కే వరదరాజులు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. గిరి శేఖర్, కోశాధికారి కృపానంద రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేంద్రనాయుడు, ఆర్ చంద్ర. కె మోహన్ కుమార్, ఈ దేవరాజులు, ఎండి సైఫుల్ల, కే జగన్నాథరెడ్డి, జై లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేంద్రబాబు, పబ్లిసిటీ కార్యదర్శి ఎస్ జె దినేష్ కుమార్, సంయుక్త కార్యదర్శులు భార్గవ్, రామయ్య, యాదవేంద్ర రెడ్డి, విజయ్, శ్రీనివాసులు, జయప్రకాష్, హరిప్రసాద్, నాగరాజు, లీగల్ కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులను శాలువాతో సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సబికులను అలరించాయి.
పో రై గంగ 1 ఏపిడబ్యూజేఎఫ్ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
గంగ 2 జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
గంగ 3 చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు
గంగ 4 పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్
గంగ 5 మహాసభకు విచ్చేసిన పాత్రికేయులు

