అవును ... వాళ్ళిద్దరూ కలిశారు
మారుతున్న జీడి నెల్లూరు టిడిపి రాజకీయం
కొందరిని పక్కన పెడుతున్న జీడి నెల్లూరు ఎమ్మెల్యే
మరికొందరితో జతకట్టి పార్టీ పటిష్టతకు వ్యూహం
స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ఆ శాసనసభ్యుడు డాక్టర్ ఎం.వి. థామస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏడాదికావస్తున్న తరుణంలో పార్టీ పటిష్టత మీద ఎమ్మెల్యే దృష్టిని సారించారు. రానున్న స్థానిక ఎన్నికలలో విజయమ లక్ష్యంగా పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టారు. శాసనసభ ఎన్నికల వరకు అన్ని తానై వ్యవహరించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబును ఎమ్మెల్యే పక్కన పెట్టారు. వర్గ విభేదాలు కారణంగా పార్టీకి దూరంగా ఉంటున్న పాలసముద్రం మాజీ మండల పరిషత్ అధ్యక్షులు రాజేంద్ర, ఇందిరలను కలుపుకొని మండలంలో పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారు. అలాగే ఎన్నికల నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పెనుమూరు మండలంకు చెందిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డిని ఇటీవల తిరుపతిలో కలిసి, నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు అనుసరించాల్చిన వ్యూహం గురించి చర్చించారు. ఇదివరకు నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేసిన సూరా సుధాకర్ రెడ్డి సమక్షంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. గతాన్ని మరిచి ఇరువురు నేతలు నియోజకవర్గంలో పార్టీ పటిష్తకు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా జి డి నెల్లూరు నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కలయిక సంచలనంగా మారింది. పెనుమూరుకు చెందిన సుధాకర్ రెడ్డి వర్గ పోరుతో విసిగిపోయి తన సభ్యత్వాన్ని తిరుపతికి మార్చుకున్నారు. ఆయన గత ఏడాది కాలంగా చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం వైపు కన్నెత్తి చూడలేదు. అయితే మారిన రాజకీయ పరిస్థితులలో ఇద్దరు కలసి పనిచేయాలని అధిస్థానం చూపించినట్టు తెలిసింది. దీనితో థామస్ రెండురోజుల క్రితం తిరుపతిలో సుధాకర్ రెడ్డితో కలసి చర్చించారు. రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి సమక్షంలో పార్టీ పటిష్ఠతపై చర్చించారని తెలిసింది. ఇక్కడ 30 ఏళ్ళ తరువాత టిడిపి అభ్యర్ధి డాక్టర్ వి ఎం థామస్ గెలిచారు. వేపంజేరి నియోజక వర్గం పేరుతో ఉన్న ఇక్కడి నుంచి 1983 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి తలారి రుద్రయ్య గెలిచారు. అయితే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ విజయం సాధించారు.1989 ఎన్నికల్లో కూడా గెలిచిన ఆమెకు 1994 ఎన్నికల్లో టికెట్టు రాకుండా అప్పటి లోక్ సభ సభ్యుడు ఎం జ్ఞానేంద్ర రెడ్డి అడ్డుపడ్డారు. దీనితో కుతూహలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. ఆమెకు తలపులపల్లె బాబూరెడ్డి, రంగంపేట బాబు రెడ్డి తదితరులు అండగా నివడంతో భారీగా ఓట్లు చీల్చారు. దీనితో కాంగ్రెస్ అభ్యర్థి శోభపై టిడిపి అభ్యర్ధి ఆర్ గాంధీ విజయం సాధించారు. తరువాత 1999, 2004 లో జరిగిన ఎన్నికల్లో కుతూహలమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నియోజక వర్గాల పునర్విభన సమయంలో వేపంజేరి జి డి నెల్లూరుగా మారింది. 2009 లో జరిగిన ఎన్నికల్లో కుతూహలమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆమె 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్ధి నారాయణ చేతిలో 20 వేల పైగా ఓట్ల తేడాతో ఓడి పోయారు. 2019 ఎన్నికల్లో ఆమె కుమారుడు డాక్టర్ హరికృష్ణ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్ధి నారాయణ స్వామి చేతిలో 45 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తరువాత నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్న హరికృష్ణ, కుతూహలమ్మ టిడిపికి రాజీనామా చేశారు. ఆమె మృతి చెందిన అనంతరం హరికృష్ణ వైసిపి లో చేరి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గంగా ఉన్నారు. అయితే డాక్టర్ థామస్ 2024 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి నారాయణ కుమార్తె కృపాలక్ష్మిపై 26 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే నియోజక వర్గంలో వర్గ పోరు ఆయనకు తల నొప్పిగా తయారు అయ్యింది. పెనుమూరు బస్టాండ్ కాంప్లెక్స్ గదుల వేలం ఏక పక్షంగా జరిగింది అంటూ మాజీ ఎంపి జ్ఞానేంద్ర రెడ్డి వర్గం హై కోర్టులో స్టే తెచ్చారు. వైసిపి అధినేత మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నారాయణ స్వామిని పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యునిగా నియమించారు. ఆరు మండలాలలో ఎంపీపీలు, జడ్పీటీసీలు గా వైసిపి వారే ఉన్నారు. ఏడాది తరువాత వచ్చే స్థానిక ఎన్నికలు పై వైసిపి నేతలు దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో నియోజక వర్గంలో పార్టీని పటిష్ట పరచడానికి సుధాకర్ రెడ్డి అవసరం ఉందని అధిష్టానం భావించినట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో అధిష్టానం సూచనతో థామస్ తిరుపతిలోని సుధాకర్ రెడ్డితో కలసి మాట్లాడారు. నియోజక వర్గంలో బలమైన బంధువర్గం ఉన్న ఆయన థామస్ కు సంఘీభావం తెలిపారు. కాగా నియోజక వర్గంలో మండల కమిటీలపై థామస్ దృష్టి పెట్టారు. అందరిని కలుపుకుని బలమైన నాయకులకు పదవులు కట్టబెట్టాలని చూస్తున్నారు.త్వరలో ఎన్నికల పరిశీలకులను నియమిస్తారని తెలిసింది. కాగా పాలసముద్రం మండలానికి చెందిన సీనియర్ నాయకులు రాజేంద్ర, ఇందిరకు రాష్ట్ర స్థాయి పదవులు వస్తాయని భావిస్తున్నారు.
పో రై గంగ 1 ఎన్ బి సుధాకర్ రెడ్డి, సూరా సుధాకర్ రెడ్డిలను తిరుపతిలో కలిసిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్
పో రై గంగ 1 ఎన్ బి సుధాకర్ రెడ్డి, సూరా సుధాకర్ రెడ్డిలను తిరుపతిలో కలిసిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్

