4, ఏప్రిల్ 2025, శుక్రవారం

శ్రీరామనవమి ఉత్సవాలకు చిత్తూరు పట్టణం ముస్తాబు


 శ్రీరామనవమి ఉత్సవాలకు చిత్తూరు పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. చిత్తూరు రాముల గుడి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి ఉత్సవాలు లాంచనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామివారికి విశ్వక్సేన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ మాజీ చైర్మన్ సుగుణ, శ్రీ రామానుజ ట్రస్ట్ బ్రాహ్మణ సంఘం ఉభాయదరులుగా  వ్యవహరించారు. రాత్రి విశ్వక్సేన ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా నటకల బ్రదర్స్ వ్యవహరించారు. 5వ తేదీన ధ్వజారోహనం, సప్త ఉత్సవం, సింహ వాహనం సేవ ఉంటుంది. ఆరవ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా హంస వాహనం, సూర్యప్రభ వాహనాల మీద స్వామివారు ఊరేగుతారు. ఏడవ తారీఖున గరుడ వాహనం మీద స్వామివారి ఊరేగుతారు. శ్రీవారికి ఉయ్యాల సేవ నిర్వహిస్తారు. ఏడవ తారీఖున హనుమంత వాహనం, 8వ తేదీన శేష వాహనం, చంద్రప్రభ వాహనం, 9వ తేదీన పల్లకి ఉత్సవం, మోహిని అవతారం, యాలి వాహనం సేవలు ఉంటాయి.  పదవ తేదీన వేణుగోపాల అలంకారం, వసంతోత్సవం, గజ వాహనం సేవలు ఉంటాయి. 11వ తేదీ పగలు రథోత్సవము, రాత్రి తోట ఉత్సవము జరుగుతుంది. 12వ తేదీన పగలు పల్లకిలో వెన్న కృష్ణుని  అలంకారం, రాత్రి గుర్రపు వాహన సేవ జరుగుతుంది. 13వ తేదీన పల్లకిలో ఉత్సవము, పుణ్యకోటి విమాన సేవలు ఉంటాయి. 14వ తేదీన అష్టోత్తర శతకలిశ మహాతిరుమంజనం, సీతారామ కళ్యాణం జరుగుతుంది. అనంతరం పుష్ప పల్లకి  సేవ ఉంటుంది. 15వ తేదీన ధ్వజావరోహణంతో  బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగిస్తుంది.  గరుడోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు  శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

శ్రీరామనవమి సందర్భంగా ఈనెల ఆరవ తారీఖున శ్రీరామ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ నిర్వహించాలని శ్రీరామ ఉత్సవ సమితి నిర్ణయించింది ఈ ర్యాలీ శ్రీరామనాభ యాత్ర సాయంత్రం 4 గంటలకు  కొంగారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి గుడి నుంచి ప్రారంభమై గాంధీ సర్కిల్, ఎమ్మెస్సార్ సర్కిల్, గిరింపేట సర్కిల్, పాత కలెక్టరేట్, శ్రీనగర్ కాలనీ కాజూరు సర్కుల్, అంబేద్కర్ సర్కిల్, గంగనపల్లి సర్కిల్, గవర్నమెంట్ హాస్పిటల్, పిసిఆర్ సర్కుల్, జిల్లా కోర్టు, గాంధీ రోడ్డు, సంతపేట చవటపల్లి, మురకంబట్టు, వినాయక స్వామి గుడి మీదుగా కట్టమంచి లోని వివేకానంద స్వామి విగ్రహం వద్ద ముగుస్తుంది.  శ్రీ రామ నవమి సందర్భంగా చిత్తూరు నగరంలో శ్రీ రామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగు శ్రీ రామ శోభాయాత్ర బైకు ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చిత్తూరు 28వ డివిజన్ వినాయకపురంలో కరపత్రాలను 28వ డివిజన్ ఇన్చార్జి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, స్ధానిక మాజీ కార్పొరేటర్ కృపానంద పంపిణీ చేశారు.వీరు మాట్లాడుతూ ప్రతి ఒక్క హిందూ బంధువు తప్పక ఈర్యాలీలో పాల్గొన్నవలయునని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోకె.శ్రీనివాసులు, షణ్ముగం, గుణశేఖర్, ఏలుమలై, శేఖర్, గోవిందరాజులు, రఘు స్వామి, లాయర్ ఆనంద్, జిరాక్స్ శీనా,  మణిగండన్, రమేష్, గౌరి శంకర్, ధనశేఖర్, వాసు, రామకృష్ణ ఆచ్చారి పాల్గొన్నారు.

చిత్తూరు పెనుమూరు జాతీయ రహదారిలో వెలసివున్న శ్రీ వాగ్దేవి సవితా సేవాశ్రమంలో విశ్వావసు నామ సంవత్సరంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు శ్రీ సీతారామస్వామి వసంత నవరాత్రోత్సవములు  ప్రారంభం అయ్యాయి. ఆశ్రమ అధినేత స్వామిని పూజానంద ఆధ్యర్యంలో  వసంత నవరాత్రోత్సవములలో భాగంగా ఆరవతేదీన అభిజిత్ లగ్నములో శ్రీ సీతారామస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగనున్నదని ఆశ్రమ ప్రధాన కార్యదర్శి హరగోపాల్  తెలిపారు.  ఏప్రిల్ 7న పవళింపు సేవ, 10న శ్రీరామ హోమంతో  వసంత నవరాత్రోత్సవములు ముగియనున్నవని, పాంచరాత్రాగమన పద్దతిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని హనుమాన్ లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్ర కృపకు పాత్రులు కావలెనని కోరారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *