12, ఏప్రిల్ 2025, శనివారం

మామిడి రైతులను నిరాశ పరచిన మామిడి సదస్సు

మామిడి గిట్టుబాటు ధర ప్రస్తావన లేని సదస్సు 

మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని పలువురి వినతి 

మామిడి కిలో రూ. 40 ఇవ్వాలని రైతు సంఘం వినతి 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరులో శుక్రవారం జరిగిన మామిడి అమ్మకముదారుల, కొనుగోలుదారుల సదస్సు జిల్లాలోని మామిడి రైతులకు నిరాశనె మిగిల్చింది.  ఈ సదస్సులు మామిడి మద్దతు ధరకు సంబంధించిన ప్రకటన  వస్తుందని జిల్లాలోని మామిడి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఉదయం 10 గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగిన ఈ సదస్సులో ఎక్కడ మామిడి మద్దతు ధర గురించి ప్రస్తావన రాలేదు. పలువురు రైతు సంఘ నాయకులు మాత్రం అధికారులకు మామిడి రైతుల సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందజేశారు. వినతి పత్రాలను అందుకున్న అధికారులు మద్దతు ధర విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. 


చిత్తూరులో శుక్రవారం భారీ స్థాయిలో మామిడి కొనుగోలుదారుల,  అమ్మకందారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ కె శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో, సీజన్ ప్రారంభానికి ముందే సదస్సు ఏర్పాటు చేయడంతో మద్దతు ధర ప్రకటిస్తారని రైతులు ఆశపడ్డారు. జిల్లాలోని మామిడి రైతులు, రైతు సంఘాల నాయకులు, కూటమి పార్టీల నాయకులు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఉద్యానవన అధికారులు  తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మామిడి బోర్డు ఆవశ్యకతను గురించి పలువురు ప్రస్తావించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా మామిడి సాగు అవుతున్న కారణంగా, చిత్తూరు కేంద్రంగా మామిడి బోర్డును  ఏర్పాటు చేయల్చిన  ఆవశ్యకతను సదస్సు దృష్టికి పలువురు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ ఈ విషయమే కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ తాను అసెంబ్లీలో కూడా మ్యాంగో బోర్డు విషయం ప్రస్తావించానని, ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పట్టుదలతో ఉన్నారని వివరించారు. మామిడి గిట్టుబాటు ధర విషయమై తెలుగుదేశం పార్టీ, చిత్తూరు మామిడి ఉత్పత్తిదారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వేరువేరుగా వినతి పత్రాలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, చిత్తూరు జిల్లా మామిడిపత్తిదారుల సంఘం తరఫున మునిచంద్ర నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ జనార్ధన్ వినతి పత్రాలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ, చిత్తూరు జిల్లా మామిడి పసిదారుల సంఘం అందజేసిన వినతి పత్రంలో రాయలసీమ జిల్లాలకు మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలని, మామిడి పల్ప్ నుంచి తయారుచేసే శీతల పానీయాలకు జిఎస్టి తగ్గించి, అమ్మకాలను ప్రోత్సహించాలని కోరారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు, రాష్ట్రంలోని పాఠశాల కళాశాల విద్యార్థులకు మామిడి జ్యూస్ ఇవ్వాలన్నారు. జిల్లాలోని అన్ని జ్యూస్ ఫ్యాక్టరీలు పనిచేసే విధంగా చర్యలు తీసుకొని రైతుల వద్ద తోతాపురి రకం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. మామిడి ఉపవాత్పత్తులైన మామిడి తాండ్ర, మామిడి చాక్లెట్, మామిడి స్లైస్ వివిధ రకాల ఉత్పత్తులను ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అమ్మకానికి ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర అందజేయాలని కోరారు. మామిడి బీమా కాలాన్ని పొడిగించాలని, గాలి, వానలకు రాలిపోయే మామిడికాయలతో ఊరగాయలు తయారుచేసే పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. గాలి వానలకు మామిడి రాలిపోయిన మామిడికి రైతులకు నష్టపరిహారం అందజేయాలని కోరారు. చీడపీడల నష్టాన్ని నివారించడానికి ఏర్పాట్లు చేయాలని, ఎకరా మామిడి పంటకు 80 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. మామిడి పంటకు భీమాను 500 రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆ నాయకులు వినతిపత్రం సమర్పిస్తూ సదస్సులో మాట్లాడడానికి అధికార పార్టీ నాయకులకు మాత్రమే అవకాశం ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతులకు మేలు చేయడానికి తోతాపురి రకానికి కిలోకు 40 రూపాయలుగా నిర్ణయించాలని, ఇందులో 30 రూపాయలు గుజ్జు పరిశ్రమలు, మరో పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా అందచేయాలని కోరారు. మామిడి  టేబుల్ రకం కాయలను విదేశాలకు ఎగుమతి చేయడానికి సహాయం అందించాలన్నారు. మామిడి రైతులకు ఎరువులు, మందులు రాయితీపైన అందచేయాలని, అకాల వర్షం ఎండ వేడితో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందజేయాలని కోరారు. మామిడి రైతులకు కవర్లను ఉచితంగా అందజేయాలని, మామిడి సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని సూచించారు. మామిడి గుజ్జును జ్యూసుగా చేసి టీటీడీ, అంగన్వాడి, పాఠశాల విద్యార్థులకు అందజేయాలన్నారు. మామిడి పరిశోధన కేంద్రాన్ని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసి నూతన వంగడాలను సృష్టించాలని కోరారు. ఈ మేరకు రైతు సంఘం నాయకులు రాష్ట్ర ఉద్యానవన పట్టు శాఖల డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కు వినతిపత్రాలను అందజేశారు. 

పో రై గంగ 5 మామిడి సదస్సు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *